మన తెలంగాణ/క్రీడా విభాగం: న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికావడాన్ని కోట్లాది మంది అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. చివరి టెస్టులో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించడంలో భారత్ విఫలమైంది. భారత టెస్టు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సొంత గడ్డపై ఓ టీమ్ చేతిలో క్లీన్‌స్వీప్ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ, ప్రధాన కోచ్‌గా గౌతం గంభీర్ పూర్తిగా తేలిపోయారు. న్యూజిలాండ్ వంటి అనామక జట్టు చేతిలో ఘోర పరాజయం చవిచూడడం అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. సిరీస్ ఆరంభానికి ముందు భారత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. న్యూజిలాండ్ కిందటి సిరీస్‌లో శ్రీలంక చేతిలో వైట్‌వాష్ అయ్యింది. ఇలాంటి స్థితిలో భారత్‌ను ఓడించడం అటుంచి కనీసం ఒక్క మ్యాచ్‌నైనా డ్రా చేస్తే న్యూజిలాండ్‌కు అతి పెద్ద విజయమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
అంచనాలు తారుమారు..
అయితే తొలి టెస్టు మొదటి రోజే విశ్లేషకుల అంచనాలు తారుమారయ్యాయి. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలింది. ఈ పరిణామం అందరిని షాక్‌కు గురి చేసింది. రోహిత్ శర్మ, కోహ్లి, రిషబ్, యశస్వి, జడేజా, రాహుల్, అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన టీమిండియా ఇంత తక్కువ స్కోరుకు ఆలౌటవుతుందని ఎవరూ ఊహించలేక పోయారు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ మళ్లీ కోలుకోలేక పోయింది. న్యూజిలాండ్ మాత్రం అసాధారణ ఆటతో భారత్ వంటి బలమైన జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
ప్రతి సెషన్‌లోనూ న్యూజిలాండ్‌దే ఆధిప్యం సాగింది. సొంత గడ్డపై భారత్‌కు గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి దుస్థితి ఎదురు కాలేదంటే అతిశయోక్తి కాదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ప్రపంచ స్థాయి బ్యాటర్లు ఉన్న టీమిండియా ప్రత్యర్థి టీమ్ కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ అలవోక విజయం సాధించింది. మ్యాట్ హెన్రి, ఓ రౌర్కి, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, విల్ యంగ్, డారిల్ మిఛెల్ తదితరులు కివీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఇక పుణె వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ భారత్ పూర్తిగా తేలిపోయింది. ఈసారి కూడా బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాను వెంటాడింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు మరోసారి నిరాశ పరిచారు. అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తోనూ మెరువలేక పోయాడు.
శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. బౌలర్లు బాగానే రాణించినా బ్యాటింగ్ వైఫల్యం భారత్ కొంపముంచింది. ఈ టెస్టులోనూ టీమిండియాకు ఘోర పరాజయం తప్పలేదు. మరోవైపు న్యూజిలాండ్ అద్భుత ఆటతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో భారత గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ భారత్‌కు ఘోర పరాజయం తప్పలేదు. ఈసారి కూడా బ్యాటింగ్ ప్రతికూలంగా మారింది. కివీస్ బౌలర్లను ఎదుర్కొడంలో భారత బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. ఎజాజ్ పటేల్, ఫిలిప్స్ అసాధారణ ప్రదర్శనతో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. చివరికి 147 పరుగుల సునాయాస లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించలేక అవమానకర రీతిలో ఓటమి మూటగట్టుకుంది.
సవాల్ వంటిదే..
ఇలాంటి స్థితిలో ఆస్ట్రేలియా గడ్డపై త్వరలో జరిగే ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్‌గా తయారైంది. సొంత గడ్డపైనే వైట్‌వాష్‌కు గురైన భారత్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉండే ఆస్ట్రేలియా గడ్డపై ఎలా ఆడుతుందనేది ఆందోళన కలిగించే అంశమే. ఈసారి కూడా భారత్‌కు బ్యాటింగ్ కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. సీనియర్లు రోహిత్, కోహ్లిలు ఫామ్‌లో లేక పోవడం టీమిండియాకు ప్రతికూలంగా మారింది. జట్టును ముందుండి నడిపించాల్సిన వీరు ఎలా ఆడతారనే దానిపైనే జట్టు గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.