వీరిలో కేంద్ర మంత్రులు నిర్మల, గోయల్
న్యూఢిల్లీ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన 27 మంది సభ్యులు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఇతరులు ఉన్నారు. ఎగువ సభ సభ్యులుగా ఎంపిలుగా వీరు తమ బాధ్యతల నిర్వహణ చేపట్టేందుకు రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ఛాంబర్‌లో రాజ్యాంగ బద్ధులుగా ఉంటామని ప్రమాణం చేయడం ఆనవాయితీ. ఈ పద్ధతిని పాటిస్తూ వీరు ప్రమాణం చేశారు. 10 రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు తొమ్మిది భాషలలో ప్రమాణపాఠం చదివారు. శుక్రవారం ప్రమాణం చేసిన సభ్యులలో జైరామ్ రమేష్, వివేక్ కె టంకా, ముకుల్ వాస్నిక్ (వీరంతా కాంగ్రెస్ వారు) , సురేంద్ర సింగ్ నగర్, కె లక్ష్మణ్, లక్మికాంత్ వాజ్‌పేయి ( వీరంతా బిజెపికి చెందిన వారు) వీరు కాకుండా జయంత్ చౌదరీ, కల్పనా సైనీ, సులాతా దియో, ఆర్ ధర్మార్ కూడా ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఛైర్మన్ వెంకయ్యనాయుడు కొద్ది సేపు సభ్యులను ఉద్ధేశించి ప్రసంగించారు. వర్షాకాల సమావేశాలు ఇంతకు ముందటిలాగానే పూర్తి స్థాయి కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా సాగుతాయని తెలిపారు. సభ్యులు సభా సంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ, నిబంధనలు పాటిస్తూ అర్థవంతమైన చర్చల ప్రక్రియ ద్వారా సభా గౌరవ మర్యాదల పరిరక్షణలో తమ వంతు బాధ్యత పోషించాలని సూచించారు.