Friday, September 20, 2024

లెక్కతేలాలి, వాటా దక్కాలి

- Advertisement -
- Advertisement -

OBC caste census has to be done

సమ సమాజ స్థాపన కోసం జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి సరైన ప్రాతిపాదికన చేరాలంటే కచ్చితంగా ఒబిసి కుల గణన జరిగి తీరాల్సిందే. వేల ఏళ్ళ నుండి భారతదేశం కులాల ప్రాతిపదికన ఏర్పడింది. కుల నిర్మూలన జరగాలంటే ముందుగా ఏ కులానికి ఆ కులం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలి. అలా అభివృద్ధి చెందిననాడు కులం తనంతట తానే కనుమరుగైపోతుంది. ‘కులాల వారీ జనాభా గణన చరిత్రాత్మకం అవుతుంది , అది పేదలకు వరంగా మారుతుంది అని రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్ పేర్కొన్నారు’. ఇది ముమ్మాటికీ నిజం. 2010 లో బిసి కులాల వారీగా లెక్కలు తీయాలని పార్లమెంటులో బిజెపి డిమాండ్ చేసింది. కానీ నేడు అదే బిజెపి అధికారంలో ఉండి కూడా కుల గణన అనేది సాధ్యం కాదని చెబుతుంది. కారణం ఆ పార్టీ బిసిలను వ్యతిరేకించే ఉన్నత వర్గాల చేతిలో ఉన్నది కాబట్టి. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఒబిసి కులగణన చేయడానికి నిరాకరించింది. కాంగ్రెస్, బిజెపి కాకుండా కూటములుగా ఏర్పడ్డ ఇతర ప్రభుత్వాలు కూడా ఒబిసి కుల గణన చేయలేకపోయాయి ఇక్కడ గమనించదగ్గ విషయం. బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కులగణన చేయాలని అసెంబ్లీలలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాయి.

ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా గతంలో వి.పి.సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేసినందుకు నిరసనగా వి.పి.సింగ్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంది ఫలితంగా ఆ ప్రభుత్వం పడిపోయింది. కమ్యూనిస్టులు సైతం ఏదో మాట వరసకి కులగణన చేయాలని అంటున్నారు. కాని వారు ఏనాడు బిసిలకు అధికారం ఇచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. బెంగాల్ ను 30 సంవత్సరాలు పాలించారు ఒక్కసారి కూడా బిసి ముఖ్యమంత్రినీ చేయలేదు. కేరళను 40 సంవత్సరాలు పాలించారు కొన్ని అనివార్య పరిస్థితుల్లో బిసిలైన అచ్యుతానందన్‌ను, పినరయి విజయన్‌ను ముఖ్యమంత్రిని చేశారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1872 నుండి 1931 వరకు చేసింది. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత నుండి నేటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఒబిసి కుల గణన జరపలేదు. ఫలితంగా ఇప్పటి వరకు ఒబిసి లు ఎందరు అని లెక్కనే లేదు, అంచనాలు తప్ప అధికారిక ప్రకటన లేదు. అమెరికాలో సైతం ప్రజలను జాతుల వారీగా లెక్కిస్తారు, బ్రిటన్‌లో ప్రజలను మూలాల ఆధారంగా లెక్కిస్తారు, అధికారికంగా ప్రకటిస్తారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, దేశ వ్యాప్తంగా ఉన్న ఇతర బిసి పార్టీలు, సంఘాలు కుల గణన చేయాలని చాలా బలంగా వాదిస్తున్నాయి.

జాతీయ బిసి సంక్షేమ సంఘం, తెలంగాణ బిసి ఫ్రంట్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కుల గణన చేపట్టాలని సుప్రీంకోర్టులో కేసు కూడా వేశాయి. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తూ బిసి కుల గణన అనేది ఆచరణ సాధ్యం కాని చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం 2011లో జరిపిన సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం 46 లక్షల కులాలు, ఉప కులాల పేర్లు ప్రజలు చెప్పారని కేంద్రం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. ఇన్ని కులాలను గణించడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని కేంద్ర ప్రభుత్వ వాదన. నిజానికి కేంద్ర ప్రభుత్వ ఒబిసి జాబితాలో 2642 కులాలు ఉన్నాయి. రాష్ట్రాల జాబితాలలో 2892 బిసి కులాలు ఉన్నాయి. మరో నివేదిక అయినా జస్టిస్ రోహిణి నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా 2633 బిసి కులాలు, 1674 ఎస్‌సి కులాలు, 534 ఎస్‌టి కులాలు ఉన్నాయి. అంటే కేంద్రం చెప్తున్న ఒబిసి కుల గణనలోని సంక్లిష్టత రహస్యం గ్రహించవచ్చు. లెక్క తేలితే పక్క వాటా ఇవ్వాల్సి వస్తుందేమోనని భయం.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డి (6), 243టి (6) ప్రకారం వెనుకబడిన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ 34 శాతానికి మాత్రమే పరిమితం చేశారు కాని దీనిని 52 శాతానికి పైగా పెంచాల్సిన అవసరం ఉన్నది. అంతేకాక దేశ వ్యాప్తంగా రాజకీయ ఉద్యోగ రంగాలలో బిసిలకు 52 శాతానికిపైగా రిజర్వేషన్ అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవి కాకుండా రాజ్యాంగంలో బిసి కులాల రక్షణకు, అభివృద్ధికి సంబంధించి చాలా రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. వీటిని అమలు చేయాలంటే కూడా ఖచ్చితంగా జనాభా లెక్కలు ఉండాలి. 1986లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బిసిల స్థితిగతులపై నియమించిన మురళీధరరావు కమిషన్ నివేదిక ప్రకారం బిసిల రిజర్వేషన్లను 25 శాతం నుండి 44 శాతానికి పెంచడం జరిగింది. సరైన జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన పెంచుకుంటూ పోతారు అని బిసిలకు పెంచిన 44 శాతం రిజర్వేషన్ ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది.

ఐక్యరాజ్యసమితి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిపుణులు రూపొందించిన ‘మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్’ ప్రకారం ప్రతి ఆరుగురు నిరుపేదలలో ఐదుగురు కింది కులాల (ఎస్‌సి, ఎస్‌టి మరియు బిసి/ ఒబిసి)వారే ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసినట్లయితే మన దేశంలో ఎక్కువగా సుమారు 38.1 కోట్లమంది నిరుపేదలు ఉంటే అందులో ఎస్‌టిలు 6.5 కోట్లు, ఎస్‌సిలు 9.4 కోట్లు, ఒబిసిలకు 16 కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు ఈ నివేదిక పరిగణనలోకి తీసుకున్న అంశాలు… విద్య, ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, భద్రత… లాంటి అంశాలలో వెనుకబడిన వారిని నిరుపేదలుగా పేర్కొంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ నివేదిక తెలిపిన ప్రకారం దేశంలో 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాలు ఉండగా వాటిలో 44.4 శాతం ఒబిసి కుటుంబాలేనని చెప్పింది. ఎస్‌సిలు 21.6 శాతం కుటుంబాలు, ఎస్‌టిలు 12.3 శాతం కుటుంబాలు, ఇతర సామాజిక వర్గాలు 21.7 శాతం కుటుంబాలు. 17.24 కోట్ల గ్రామీణ కుటుంబాల లో 9 కోట్లు అనగా 54 శాతం వ్యవసాయ ఆధారితమైనవి కాగా వాటిలో 45.8 శాతం ఒబిసిలు, 15.9 శాతం ఎస్‌సి, 14.2 శాతం ఎస్‌టిలు, 24.1 శాతం ఇతర సామాజిక వర్గాలు. ఐఐఎఫ్‌ఎల్, హురున్ ఈ మధ్యనే ప్రకటించిన వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు కలిగిన పదిమంది యువ ధనవంతుల (40 సంవత్సరాలలోపు) జాబితాలో నిమ్న వర్గాలకు సంబంధించిన ఏ ఒక్క యువకుడు లేకపోవడం గమనించాల్సిన విషయం. యువ పారిశ్రామిక వేత్తలులోనే కాదు ఇతర ఏ పారిశ్రామిక వేత్తలలో కూడా అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం అణువంతైనా లేదు.

ఒబిసిలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు అమలు చేస్తున్న రిజర్వేషన్లలో ఆదాయ పరిమితి ఎనిమిది లక్షలు అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. ఎందుకంటే తరతరాలుగా సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా వివక్షను ఎదుర్కొంటున్న వారికి, తరతరాలుగా వేలాది ఎకరాల భూములను, ఆస్తులను, అంతస్తులను అన్నిటికంటే ముఖ్యమైన సామాజిక హోదాను అనుభవిస్తున్న వర్గాలకు ఒకే ఆర్ధిక శ్రేణి అంటే ఎనిమిది లక్షల ఆదాయ పరిమితి నిర్ణయించడం ఎంతవరకు సమంజసమో. అంటే ఒక మోస్తరు ఉద్యోగం చేస్తున్న ఒబిసి కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కుకుంటే వారికి రాజ్యాంగబద్ధంగా దక్కిన రిజర్వేషన్ నిరోధించడం కోసమే అని అర్థమవుతుంది.

ఇక్కడ ఒబిసిలకు ఆదాయ పరిమితి ఉండకూడదు ఒకవేళ తప్పదనుకుంటే కనీసం 20 లక్షలు ఉంటే మేలు అనేది ఈ వర్గ ప్రజల అభిప్రాయం. నీట్ ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటాలో ఒబిసి, ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలుకు 8 లక్షల ఆదాయ పరిమితిని ఏ ప్రాతిపదికన తీసుకున్నారని, దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లను సర్వోన్నత న్యాయస్థానంలో జస్టిస్ డి వై చంద్రుచూడ్ ధర్మాసనం విచారించింది. జాతీయ వ్యయ సూచిక ఆధారంగా ఎనిమిది లక్షల ఆదాయ పరిమితి విధించినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సోలిసిటర్ జనరల్ తెలిపారు. జీవన వ్యయం రాష్ట్రాలలో ఒక విధంగా అదే రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో మరొక విధంగా ఉంటుంది కదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతానికీ నీట్ ప్రవేశాలను నిలిపి వేసింది సర్వోన్నత న్యాయస్థానం. మండల్ కమిషన్ సిఫారసులను అమలుచేయాలని నిర్ణయించినప్పుడు దేశవ్యాప్తంగా అల్లర్లు చేసిన వర్గాల వారు ఇప్పుడు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ఎలా పొందగలుగుతున్నారు. ఒబిసి రిజర్వేషన్లు అమలు చేస్తే ప్రతిభా పాటవాలు పడిపోతాయని మొత్తుకున్నారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ వల్ల ప్రజలు పెరుగుతుందా? ప్రతిభ పాడైపోదా? తమకు ఒక న్యాయం ఇతరులకు ఒక న్యాయం అనేది ఎంతవరకు సమంజసం.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో బాటు 11 రాష్ట్రాలలో బిసి రిజర్వేషన్ల వర్గీకరణ అంటే ఎ, బి, సి, డి లు గా వర్గీకరించడం జరిగింది. మిగతా అన్ని రాష్ట్రాలలో, కేంద్ర ఒబిసి జాబితాలో కూడా వర్గీకరణ జరిగితే దేశ వ్యాప్తంగా కనీసం ఉద్యోగాలలోనైనా ప్రాతినిధ్యం లేని కులాలకు కొంతవరకైనా మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది. 2014, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నరేంద్ర మోడీని బిసిగా ప్రచారం చేయడం వల్ల 47% బిసిలు బిజెపిని ఆదరించడం వల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాగలిగారు. 2017లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపికి 312 స్థానాలు దక్కాయి కారణం బిసిల మద్దతు వల్లనే అనేది మరిచిపోయి బిసి కుల గణన చేపట్టడానికి బిజెపి వెనుకడుగు వేయడం అంటే అంతర్గతంగా బిజెపి పార్టీలో ఉన్నత వర్గాల ప్రభావం చాలా బలంగా పని చేస్తుందని గ్రహించవచ్చు. ఏదిఏమైనప్పటికీ కులాల వారీగా జనగణన జరిగి 85 శాతంగా ఉన్న నిమ్న జాతులు అభివృద్ధి చెంది సమ సమాజ స్థాపన జరిగి అసమానతలు లేని భారతదేశం ఆవిర్భవించాలని ప్రతి భారతీయుడు ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతలు లేని సమాజంలో జీవించాలి. భారతదేశం సుఖశాంతులతో వర్ధిల్లాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News