క్రిమిలేయర్ విధానం వల్ల అర్హులైన ఓబిసిలకు విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం
దీనిపై రాష్ట్ర బిసి కమిషన్ సమగ్రమైన నివేదికను రూపొందించాలి
కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి
రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణంకు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచన
మనతెలంగాణ/హైదరాబాద్: క్రిమిలేయర్ విధానం వల్ల అర్హులైన ఓబిసిలకు విద్య, ఉపాధి రంగాల్లో అన్యాయం జరుగుతుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం యూపిఎస్సీలో ఓబిసి క్రిమిలేయర్ (సంపన్న శ్రేణి)పై అవలంభిస్తున్న విధానం విచిత్రంగా ఉందని డా. వకులాభరణం కృష్ణమోహన్ రావుతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. క్రీమి లేయర్ (సంపన్న శ్రేణి) ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధి, విధానాలను నిర్ధేశించలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర బిసి కమిషన్ సమగ్రమైన నివేదికను రూపొందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వకుళాభరణంకు సూచించారు. ఈ క్రిమిలేయర్ విధానం వల్ల ఓబిసిలకు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్నారు. వేలాదిమంది ఓబిసి విద్యార్థులకు యూపిఎస్సీలో అమలు చేస్తున్న క్రిమిలేయర్ విధానం వల్ల ఎంతో నష్టం జరుగుతుందన్నారు.
ఓబిసిలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు కావడం లేదు
రాష్ట్ర స్థాయిలో డైరెక్టుగా గ్రూప్ -1, సమాంతర పోస్టులకు ఎంపికైన ఉద్యోగులకు, రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వారికి, వృత్తి, వ్యాపార రంగాల్లో ఉండి 8 లక్షల రూపాయలు, ఆపై ఆదాయం గల కుటుంబాల వారికి ఈ క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని నిబంధనలు చెబుతున్నా అవి ఎక్కడా అమలు కావడం లేదన్నారు మంత్రి పేర్కొన్నారు. క్రీమి లేయర్ (సంపన్న శ్రేణి) ను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన విధి,విధానాలను నిర్దేశించని కారణంగా 5, 6 ఏళ్ల నుంచి కోర్టుల్లో పోరాటం చేస్తున్న వారిని, క్రిమిలేయర్ వల్ల నష్టపోయిన వారిని గుర్తించి న్యాయం చేయాలని కేంద్రానికి మంత్రి సూచించారు. ఓబిసిలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ భేటీలో మహబూబ్ నగర్ జిల్లా బిసి సంఘాల ప్రతినిధులు గిరి గౌడ్, తిరుపతి ముదిరాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.