Monday, December 23, 2024

ఒబిసి కోటాయే ఎజెండా కావాలి

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ఎన్నికల ఫలితాలు రిజర్వేషన్లపై ఆసక్తికరమైన చర్చకు తెరతీశాయి. కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి అక్కడ రాజకీయ ప్రాబల్య వర్గాలైన లింగాయత్, వొక్కలిగలకు బిజెపి ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్నికలకు 3 నెలల ముందు బొమ్మై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంపై అక్కడి గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆందోళన చేశారు. యడ్యూరప్ప సొంత గ్రామంలోని ఆయన నివాసానికి నిప్పు పెట్టారు. అక్కడితో ఆగకుండా కర్ణాటక ఎన్నికలకు ముందు తెలంగాణలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా రిజర్వేషన్లపై చేసిన ప్రకటనపై అన్ని వర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా నేడు దేశ వ్యాప్తంగా రిజర్వేషన్లపై బిజెపి వైఖరిని గూర్చి చర్చ జరుగుతున్నది. దేశంలో కుల వ్యవస్థ వేళ్ళూనికొన్నది. ఆ వ్యవస్థలోని అంతరాలతో తరతాలుగా మన దేశంలో కింది కులాల వాళ్ళు అణచివేతకు గురవుతున్నారనే చర్చ స్వాతంత్య్రానికి ముందునుంచే ఉన్నది.

Also Read: ఎన్నికలకు బీ రెడీ

దేశంలో 1882లోనే రిజర్వేషన్లకు పునాది పడింది. వెనుకబడిన కులాల వారందరికీ సమానావకాశాలు కల్పించాలని, ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాధాన్యత కల్పించాలని హంటర్ కమిషన్ ముందు మహాత్మ జ్యోతిబాఫూలే ప్రతిపాదించారు. వారందరికీ ప్రభుత్వమే ఉచిత విద్య అందిచాలని, ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. దేశంలో మొట్టమొదటిసారిగా 1902లో అధికారికంగా రిజర్వేషన్లు అమలైనాయి. ఛత్రపతి సాహు మహారాజ్ కొల్హాపూర్ సంస్థానంలో సేవా రంగంలో 50% రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాలకు కేటాయించినారు. తర్వాత ఇతర సంస్థానాలలో క్రమంగా రిజర్వేషన్లను అమలు చేశారు. 1919లో మద్రాస్ రాష్ట్రంలో రిజర్వేషన్లపై చేసిన చట్టం, ఆ చట్టం వెలుగులో 1921లో తీసుకొచ్చిన జివో చెప్పుకోదగినది.ఈ చట్టం ప్రకారం బ్రాహ్మణేతరులకు 44 %, బ్రాహ్మణులకు 16 %, ముస్లింలకు 16%, ఆంగ్లో ఇండియన్ క్రిస్టియన్లకు 16%, షెడ్యూల్డ్ కులాల వారికి 8% చొప్పున రిజర్వేషన్లను కేటాయించారు.

తర్వాత బాంబే సంస్థానంలోనూ రిజర్వేషన్లు అమలయ్యాయి. రాజ్యాంగం అమల్లోకి రాగానే రిజర్వేషన్లకు సమస్యలు మొదలయ్యాయి. స్వాతంత్య్రం రాగానే మొట్టమొదటి దాడి రిజర్వేషన్లపైనే జరిగింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో కొనసాగిన రిజర్వేషన్లు భారత రాజ్యాంగం ప్రకారం చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపైన పార్లమెంట్‌లో చర్చ జరిగి రాజ్యాంగానికి మొట్టమొదటి సవరణ చేయాల్సి వచ్చింది.మొట్టమొదటి సవరణ ద్వారా 15(4)చేర్చబడింది. దీని ప్రకారం వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు సమాజంలో పురోగమించే వరకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వాలని పేర్కొనబడింది.ఈ విషయాన్ని వదిలేసి రిజర్వేషన్లను వ్యతిరేకించేవారు మొదటి పదేళ్ల కోసమే రిజర్వేషన్ అమలు చేయాలని పేర్కొన్నట్టు ప్రచారం చేస్తున్నారు. వెనకబడిన వర్గాలలో మొదటి పదేళ్లలో అనుకున్న అభివృద్ధి రాకపోతే వాటిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది.

నేటికీ ఈ దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉన్నాయి. వాటిని అధిగమించడం కోసం రాజ్యాంగంలో పేర్కొన్నట్టు వెనుకబడిన వారి పురోభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం వెనుకబడిన తరగతుల కులాలపై సర్వే జరగాలి. అందుకోసం 1953లో దత్తాత్రేయ బాలకృష్ణ కలేల్కర్ కమిషన్ వేశారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం వెనుకబడిన కులాలకు వివిధ కేంద్ర సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో 25% నుంచి 40% రిజర్వేషన్ ఇవ్వాలన్నారు. ఈ నివేదికను ఇప్పటి వరకు పట్టించుకోలేదు.1961 జనాభా గణన ప్రకారం దేశ జనాభాలో 52 % ఒబిసిలు ఉన్నారు. దేశంలో 3743 ఒబిసి కులాలు ఉన్నట్టుగా తేల్చారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం జనతా పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 1979లో బిపి మండల్ చైర్మన్‌గా వెనకబడిన తరగతులపై నివేదిక కోసం మండల్ కమిషన్ ఏర్పాటు చేసింది.

ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ అధికారంలోకి రావడానికి, 1990లో జనతాదళ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానంగా బిసి ఓటు బ్యాంక్ తోడ్పడింది. రాజకీయ విశ్లేషకులు అంచనాల ప్రకారం.. ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడించి జనతా పార్టీకి అధికారం కట్టబెట్టడంలో దేశంలోని బిసి ఓటర్లు విజయం సాధించారని చెపుతుంటారు. ప్రధాని విపి సింగ్ సాహసోపేతమైన నిర్ణయం వల్ల మండల్ కమిషన్ నివేదికను అమలుకు నోచుకున్నది. దేశంలో మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని నిర్ణయం తీసుకునే సమయానికి వివిధ కులాలను బిసిలలో చేర్చాలంటూ డిమాండ్లు లేవనెత్తారు. రిజర్వేషన్లు ఇష్టంలేని బిజెపి పార్టీ హిందూ అగ్రకులాలు, బిసి కులాలను దృష్టి మళ్లించడానికి రథయాత్రను చేపట్టారు. రథయాత్ర అడ్డుకున్నారని జనతాదళ్ పార్టీకి మద్దతు ఉపసంహరించుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి పగ తీర్చుకున్నారు.

హిందూ అగ్రకులాలకు ప్రాతినిధ్యం వహించే బిజెపి రథయాత్ర రామ జన్మభూమి పేరుతో బిసి, ఎస్‌సి, ఎస్‌టి కులాలను మతం మాయలో ముంచింది. వారికి రావలసిన సామాజిక న్యాయం గురించి ఆలోచించకుండా తప్పుదోవ పట్టించడంలో సఫలమైంది.అగ్రకుల, వ్యాపార వర్గ భావజాలానికి పెట్టని కోట వంటి బిజెపి. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు నాయకత్వం వహించింది. హిందూ మతంలో వ్యవస్థీకృతంగా ఉన్న కులాల నిచ్చెన మెట్ల వ్యవస్థ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టిందని, రథయాత్రను మండల కమిషన్ ప్రతిపాదనల ఆమోదంపై కమండలపు దండ యాత్రగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు. ఈ చరిత్రంతా రికార్డు అయింది. దేశంలో రిజర్వేషన్లు, ముఖ్యంగా బిసి రిజర్వేషన్ల అమలవ్వకుండా వివిధ పార్టీలు తమ వంతుగా ప్రయత్నాలు చేశారు. దేశంలో రిజర్వేషన్ల మీద అప్రకటిక దాడి జరుగుతున్నది. ఇప్పుడు ఒబిసిలతో పాటు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు ప్రమాదం పొంచి ఉన్నది. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా మూసేయడం లేదా ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ద్వారా ఆయా కంపెనీలలో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లను వెనకబడిన వర్గాలు కోల్పోయాయి.

వెనుకబడిన వర్గాలకు దక్కుతున్న రిజర్వేషన్లను శాశ్వతంగా దూరం చేసే కుట్ర ఇందులో దాగి ఉన్నది. ఈ మధ్య కాలంలో కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం 10 శాతం రిజర్వేషన్లను పెంచింది. ఇది ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఉద్దేశించింది. వెనుకబడిన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో రిజర్వేషన్ల వలెనే వెనకబడి నిరాదరణ గురవుతున్న అన్ని వర్గాల వారికి అవకాశం కల్పించాలి.దానికి భిన్నంగా కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి రెండు కులాలకు వాటిని పంపిణీ చేసింది. సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. గతంలో ఒక సాంప్రదాయం ఉండేది. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలపై రాజకీయ నాయకులు, అధికారులు మాట్లాడటానికి నిరాకరించేవారు. కానీ దానికి భిన్నంగా నేటి రాజకీయాలు సాగుతున్నాయి. తెలంగాణలో మరికొన్ని నెలల్లో ఎన్నికలున్నాయి. ఓట్ల లబ్ధి కోసం కర్ణాకటలో తరహాలోనే ఇక్కడా అదే ప్రయోగం చేస్తామని బిజెపి నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఎన్‌డిఎ, ప్రతిపక్షంలో ఉన్న యుపిఎ కూటములను పరిశీలిస్తే తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. యుపిఎ కూటమిలో ఉన్న ఎక్కువ పార్టీలు మండల్ కమిషన్‌కు మద్దతు ఇచ్చాయి.

రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ పార్టీ, జనతా పార్టీ, జనతాదళ్ పార్టీలకు బిసిల హక్కులు, వాటా కోసం పోరాడిన చరిత్ర ఉన్నది. ఆ పార్టీల ప్రభావంతో వచ్చిన వివిధ ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు యుపిఎ కూటమిలో ఉన్నాయి. దేశ వ్యాప్తంగా బిసి కుల గణనపైన చర్చ జరుగుతున్నది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ముందుకు తెచ్చింది. ఈ రిజర్వేషన్ తేనె తుట్టెను ముందుగా కదిపింది మాత్రం బిజెపినే. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ‘జిత్ని ఆబాదీ ఉత్నా హక్’ చేసిన నినాదం మెజారిటీ బిసి వర్గాలను ఆలోచనలో పడేసింది. నిజానికి ఆ డిమాండ్ మండల్ కమిషన్ ఏర్పాటుకు ముందు నుంచే ఉన్నది. మండల్ కమిషన్ నివేదికలో 40% దాక రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సూచించింది. నివేదిక అమలు సమయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయాలని ఇచ్చిన తీర్పు ప్రకారం ఒబిసిలకు 27 శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 2011-12 నిర్వహించిన సామాజిక, ఆర్థిక కులగణన నివేదికను విడుదల చేయాలని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

అదే సమయంలో ప్రతిపక్ష నాయకులు స్టాలిన్, నితీశ్ కుమార్, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ మొదలైన నాయకులు కుల గణన జరగాలని డిమాండ్ చేస్తున్నారు.మన దేశంలో ప్రముఖ సోషలిస్టు నాయకుడు రామ్ మనోహర్ లోహియా వెనుకబడిన వర్గాలకు 60% రిజర్వేషన్ కల్పించాలని ప్రకటించాడు. రాహుల్ గాంధీ అదే నినాదాన్ని తీసుకొని ముందుకెళ్లడం రేపటి రాజకీయాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రాజ్యాంగంలో సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు అనే మాటను స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం దానిని గుర్తించలేదు. నెహ్రూ, ఇందిరా గాంధీ ఒబిసి రిజర్వేషన్లకు వ్యతిరేకులు. నెహ్రూ ఒక అడుగు ముందుకేసి ఒబిసిలకు రిజర్వేషన్ ఇవ్వడం అంటే పరిపాలన వ్యవస్థలో ద్వితీయ శ్రేణి ఉద్యోగులను చేర్చుకోవడం అని కామెంట్ చేశారు.

మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసే సందర్భంలో పార్లమెంట్‌లో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ ఒబిసి రిజర్వేషన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ అదే మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తామంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. బిజెపి 1989 ఎన్నికల ప్రణాళికలో ఒబిసిలకు రిజర్వేషన్ కల్పిస్తామన్న వాగ్దానం చేసింది. పార్లమెంట్‌లో మండల్ కమిషన్ సిఫారసులపై జరిగిన చర్చలో మాత్రం బిజెపి రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతను ప్రకటించి పాత వాదననే ముందుకు తీసుకొచ్చింది. సమర్థత, అభివృద్ధి, ఐక్యత అనేది జాతికి చాలా అవసరమని రిజర్వేషన్లు సమాజాన్ని నిట్టనిలువుగా చీలుస్తాయని పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించింది. 2023 నాటికి రెండు జాతీయ పార్టీల ప్రకటనలలో మార్పు కనిపిస్తున్నది. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం కోసం సానుకూలంగా ఉన్నట్లు ప్రజలకు సంకేతాలు పంపుతున్నారు.

ఇది నిజాయితీగా జరుగుతున్నదా ఈసారి ఎన్నికలను గట్టిగడానికి ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఆడుతున్న నాటకమా భవిష్యత్తులో తేలుతుంది. విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇస్తామని హామీకి వరకే ప్రజలు సంతృప్తి పడితే సరైన న్యాయం జరగదు. రాజకీయాలలో చట్టసభలలో తమ వాటా తమకు లభించాలి. అప్పుడే ఇచ్చిన హామీల నెరవేర్చడానికి ఒత్తిడి చేయగల చట్టసభల ప్రాతినిధ్యాన్నికలిగి ఉంటారు. అది జరగనంత కాలం, అగ్రకులాలకు చట్టసభల్లో మెజార్టీ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నంతకాలం వెనుకబడిన వర్గాల ప్రయోజనాలు నెరవేరవు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లే కాదు రాజకీయ ప్రాతినిధ్యం కోసం కూడా ఇప్పుడు డిమాండ్ చేయాల్సి ఉన్నది.

– ఎర్రోజు శ్రీనివాస్
9700302973

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News