Wednesday, January 22, 2025

ఊబకాయ భారతం

- Advertisement -
- Advertisement -

నిన్న మొన్నటిదాకా పోషకాహార లోపం సమస్యపై పోరాటం చేసిన భారత్ ఇప్పుడు మరో కొత్త భూతంతో పోరాటం చేయక తప్పదనిపిస్తోంది. అంతర్జాతీయ సైన్స్ మ్యాగజైన్ ‘లాన్సెట్ జర్నల్’ తాజా కథనం ప్రకారం 2022 నాటికి భారత్‌లో అయిదునుంచి 19 ఏళ్ల మధ్య ఉండే 1.25 కోట్ల మంది చిన్నారులు, కౌమారులు ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో 73 లక్షల మంది బాలురు కాగా, 52 లక్షల మంది బాలికలున్నారు.1990 దశకం దాకా పెద్దల్లో మాత్రమే కనిపించే ఈ ఊబకాయం సమస్య ఇప్పుడు స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు, కౌమార వయసు వారిని కూడా పట్టి పీడిస్తోంది. ఊబకాయం, బరువు తక్కువ ఉండడం అనేవి రెండూ కూడా పోషకాహార లోపం వల్ల వచ్చే సమస్యలే. భారత్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, నిరుపేద దేశాల్లో మొన్నటిదాకా ఎక్కువ మంది చిన్నారులు బరువు తక్కువ సమస్యతో బాధపడే వారు. దానికి పోషకాహార లోపం ప్రధాన కారణం. అయితే ప్రపంచ శాస్త్రవేత్తల నెట్‌వర్క్ ఎన్‌సిడి రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ (ఎన్‌సిడిరిస్క్‌సి), ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఇప్పుడు అది తగ్గుముఖం పడుతోంది.

అయితే చిన్నారుల్లో ఊబకాయం సమస్యమాత్రం శరవేగంగా పెరిగి పోతోంది. లాన్సెట్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారులు, కౌమారులు, పెద్దల సంఖ్య 100 కోట్లను దాటింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దవారిలో ఊబకాయం మహిళల్లో రెండింతలు, పురుషుల్లో దాదాపు మూడు రెట్లు పెరిగిందని నివేదిక పేర్కొంది. అంతేకాదు, 990తో పోలిస్తే 2022లో ఒబేసిటీ రేటు నాలుగు రెట్లు పెరిగింది. వీరిలో పెద్దవారి సంఖ్య 87.9 కోట్లు అయితే, చిన్నారులు, కౌమార వయస్కుల సంఖ్య 15.9 కోట్లుగా ఉంది. 1990లో చిన్నారుల్లో ఒబేసిటీ రేటు బాలికల్లో 0.1 శాతం ఉంటే 2022 నాటికి అది 3.1 శాతానికి చేరుకుంది. బాలురలో అది 0.1 శాతంనుంచి 3.9 శాతానికి పెరిగింది.దేశంలో ఊబకాయ బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండడం ఆందోళన కలిగిస్తోందని ఆ నివేదిక పేర్కొంది.1990 దశకంలో 0.4 మిలియన్ల మంది ఊబకాయంతో బాధపడుతుండగా 2022 నాటికి ఆ సంఖ్య 12.5 మిలియన్లకు చేరుకుందని, ఈ పరిణామం ఆందోళనకరమని పేర్కొంది. 1990నుంచి 2022 మధ్య కాలంలో ఊబకాయంతో బాధపడుతున్న చిన్నారులు,

కౌమార వయస్కులు నాలుగు రెట్లు పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా 1500 మంది వైద్యులు, శాస్త్రజ్ఞులు 190 దేశాల్లోని 22 కోట్ల మందికి పైగా చిన్నారులు, పెద్దవారి బరువు, ఎత్తులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. 1990 దశకంలో పెద్దవారిలో మాత్రమే కనిపించే ఊబకాయం సమస్య ఇప్పుడు కౌమార దశలోనే కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని ఈ పరిశోధనా వ్యాసం సీనియర్ రచయిత, బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ ప్రొఫెసర్ మాజిద్ ఇజాతి పేర్కొన్నారు. అదే సమయంలో కోట్లాది మంది ఇప్పటికీ పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, పోషకాహార లోపం సమస్యను అధిగమించడం ప్రభుత్వాల ముందున్న పెద్ద టాస్కని ఆయన అంటున్నారు. ఇక ఊబకాయానికి ప్రధాన కారణం జంక్ ఫుడ్స్. స్నాక్స్, ఫాస్ట్‌ఫుడ్స్, స్ట్రీట్‌ఫుడ్స్‌లో అధిక కేలరీలు ఉంటాయి. ఈ ఆహారాల వల్ల ఊబకాయం వస్తుంది. ఇవే కాకుండా మిఠాయిలు, స్వీట్స్, కూల్‌డ్రింక్స్ కారణంగా కూడా పిల్లలు బరువు పెరుగుతున్నారు.

అంతేకాకుండా ఆటలు, వ్యాయామం వంటివి లేకపోవడం వల్ల పిల్లల్లో కేలరీలు కరగకపోవడం వల్ల కూడా వారిలో ఊబకాయం వస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో పిల్లలు ఎక్కువగా మొబైల్‌ఫోన్లు, టీవీలకు అతుక్కుపోవడం పెరిగింది. దీనితో పాటుగా బద్ధకం కూడా ఊబకాయం సమస్యను పెంచుతోంది. ఇక పిల్లలు తల్లిదండ్రులు, లేదా కుటుంబ సభ్యులు అధిక బరువుతో ఉంటే పుట్టే పిల్లలు కూడా ఎక్కువ బరువుతో జన్మిస్తారు. ఒత్తిడి లాంటి సమస్యలు కూడా కొంత మంది పిల్లల్లో బరువు పెరగడానికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే అతిగా తినేస్తారని, దీనివల్ల పిల్లలు బరువు పెరుగుతారని అంటున్నారు. ఇక కౌమార దశలో శరీరంలో హార్మోన్ల మార్పులు బరువు పెరగడానికి కారణం కావచ్చంటున్నారు. అన్నిటికన్నా మించి నేటి ఆధునిక లైఫ్‌స్టైల్స్ అధిక బరువుకు ప్రధాన కారణం. కారణం ఏమయినప్పటికీ ఈ సమస్యకు ఇప్పుడే పరిష్కారం కనుగొనకపోతే మరో పదేళ్లకు అంటే 2035 నాటికి ప్రపంచంలో సగం మంది ఊబకాయులుగా మారిపోయే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది.. ప్రభుత్వాలు ఇప్పటికయినా మేలుకొనకపోతే భవిష్యత్తులో ఊబకాయం ఓ కొరకరాని కొయ్యగా మారే ప్రమాదం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News