2న నిర్వహించిన పరీక్షపై అంగన్‌వాడీ టీచర్ల అభ్యంతరాలు
మనతెలంగాణ/ హైదరాబాద్: అంగన్‌వాడీ గ్రేడ్ -2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి సంబంధిత మెరిట్ జాబితా కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. గ్రేడ్- 2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి జనవరి 2న నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఇప్పటికే విడుదల చేశారు. అయితే ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు. మెరిట్ జాబితాను విడుదల చేసి రోస్టర్ పాయింట్ల మేరకు పోస్టుల ఎంపిక చేపట్టాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో నిర్వహించిన గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టుల భర్తీపై కొందరు గతంలో కోర్టును ఆశ్రయించారు. తాజాగా ప్రశ్నపత్రం సరిగ్గా లేదని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తుండడంతో మళ్లీ ఆ పోస్టుల భర్తీపై కూడా సందేహాలు నెలకొన్నాయి.
ఎలాంటి పరీక్ష లేకుండా తమను రెగ్యులరైజ్ చేయాలని దాదాపు 160 మంది కాంట్రాక్ట్ సూపర్‌వైజర్లు కోర్టును ఆశ్రయించగా.. వారిని క్రమబద్దీకరించే వీలుందని సంబంధిత శాఖ సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. 2013 నోటిఫికేషన్‌లో 359 పోస్టులను చూపించినా.. కేవలం 168 గ్రేడ్-2 సూపర్‌వైజర్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. సెకండ్ లిస్ట్‌లో మిగతా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పిన అధికారులు కాలయాపన చేయడంతో సమస్య పరిష్కారం నోచుకోలేదు. గతంలో పెండింగ్‌లో ఉన్న పోస్టులతో పాటు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన వారి ఎంపిక ప్రక్రియ వెంటనే చేపట్టాలని అంగన్‌వాడీ టీచర్లు కోరుతున్నారు.