Wednesday, January 22, 2025

‘పఠాన్’ పాటపై అభ్యంతరాలు!

- Advertisement -
- Advertisement -

ఇటీవల జరుగుతున్న కొన్ని ఉదంతాలను చూసినపుడు మన దేశం లో ఏం జరుగుతోంది అన్న ప్రశ్న చాలా మందిలో తలెత్తుతోంది. చాలా మందికి దేని మీదా స్పందన లేకపోవటం కూడా ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరు ధ్యం వాస్తవం. ఇది కొత్తగా వచ్చిన ధోరణా? మన దేశ గతంలోనూ ఇలాంటి తీరు తెన్నులు కనిపిస్తాయి. ఈ కారణంగానే రాజరికాలు, విదేశీ దురాక్రమణల వలస పాలన చాలా కాలం ఎదురులేకుండా సాగింది. తాజా అంశానికి వస్తే సినిమాలు ఎలా తీయాలో ఎవరు ఏ దుస్తులు, ఏ రంగువి వేసుకోవాలో కూడా మతశక్తులు నిర్దేశిస్తున్నాయి. లేకుంటే అడనివ్వం, సినిమా హాళ్లను తగుల బెడతాం అని బెదిరిస్తున్నాయి. షారూఖ్ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటించిన ‘పఠాన్’ అనే సినిమా పలు భాషల్లో జనవరి 25న విడుదల కానుంది. దానిలో బేషరమ్ సంగ్ అనే పాటను డిసెంబరు 12న విడుదల చేశారు.

ఇప్పటికే కోట్లాది మంది దాన్ని చూశారు. ఆ పాట తీరు, దానిలో హీరోయిన్ దీపిక ధరించిన బికినీ, ఇతర దుస్తుల మీద మతశక్తులు పెద్ద రచ్చ చేస్తున్నాయి. పాటలో దీపికను అసభ్యంగా చూపారన్నది కొందరి అభ్యంతరం. శృంగార భంగిమలతో చూపితే చూపారు పో, ఆమెకు కాషాయ రంగు దుస్తులు వేయటం ఏమిటి అని మరి కొందరు, వేస్తే వేశారు పో, ఒక ముస్లిం నటుడు కాషాయ రంగు దుస్తులు వేసుకున్న హిందూ మహిళతో తైతక్కలాడటం ఎంత ఘోరం అన్నట్లుగా స్పందనలు, ప్రచార దాడి తీరు తెన్నులు ఉన్నాయి. అనేక దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉన్నప్పటికీ నిరభ్యంతరంగా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు చేసే వారు కనిపిస్తారు. కొందరు ఆ బొమ్మలకు అశరీతత్వం, ఆత్మస్వరూపత్వ పరమార్ధం ఉంది అని భాష్యం చెబుతారు. ఖజురె శృంగార శిల్పాలు, వాత్సాయనుడి సచిత్ర కామసూత్రాల గురించి తెలిసినదే. వాటిని పుస్తకాల మీద ముద్రించి సొమ్ము చేసుకుంటున్న వారు, ఎవరూ చూడకుండా లొట్టలు వేసుకుంటూ ఆ పుస్తకాలను పడక గదుల్లో భాగస్వాములతో కలసి చదివి ఆనందించే, ఆచరించేవారి సంగతీ తెలిసిందే.

కానీ వాటి స్ఫూర్తితో సినిమాల్లో కొన్ని దృశ్యాలను పెడితే ఇంకేముంది హిందూత్వకు ముప్పు అంటూ కొందరు తయారవుతున్నారు. దీనిలో భాగంగానే జనవరి 25న విడుదల కానున్న ‘పఠాన్’ సినిమాను విడుదల కానివ్వం, విడుదలైనా ఆడనివ్వం, ప్రదర్శించే సినిమా హాళ్లను తగులబెడతాం అంటూ హిందూ, ముస్లిం మత శక్తులు వీరంగం వేస్తున్నాయి. పఠాన్ సినిమాకు సెన్సార్‌బోర్డు అనుమతించిన తరువాతే దానిలో బేషరవ్‌ు రంగ్ అనే పాటను విడుదల చేశారు. కోట్ల మంది అవురావురు మంటూ చూశారు.ఆ పాటలోని దుస్తులను మార్చకపోతే మధ్యప్రదేశ్‌లో ఆ సినిమాను ఆడనివ్వం అని రాష్ర్ట హోం శాఖ మంత్రి నరోత్తవ్‌ు మిశ్రా బెదిరించారు. మంత్రి నరోత్తవ్‌ు మిశ్రా ఆగ్రహంతో చేసిన ట్వీట్‌లో ఇలా ఉంది. ‘దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. పాటను కలుషిత బుద్ధితో చిత్రించారు.

పాట దృశ్యాలు, దుస్తులను సరిచేయాలి.లేకపోతే మధ్యప్రదేశ్‌లో దాన్ని విడుదల చేయనివ్వాలా లేదా అన్నది పరిశీలించాల్సిన అంశం’. సినిమాను నిషేధించాలి, బహిష్కరించాలని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ అన్నారు. ఇస్లాంలో నమ్మకం ఉన్న ఒక పఠాన్ ముస్లింల చిహ్నాలతో ఒక మహిళతో అలాంటి దృశ్యాలలో నటించవచ్చా అని ఒక ట్వీట్‌లో ప్రశ్నించారు. లవ్ జిహాదీల అసంబద్ధతకూ ఒక హద్దు ఉంటుంది అన్నారు. సినిమాలోని దృశ్యాలను సవరించే వరకు చిత్ర విడుదల నిలిపివేయాలని సుప్రీంకోర్టులో వినీత్ జిందాల్ అనే లాయర్ ఒక కేసు దాఖలు చేశారు. వీర శివాజీ బృందం పేరుతో ఉన్న కొందరు ఇండోర్‌లో దీపిక, షారుఖ్ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. హిందువుల భావాలను గాయపరచిన సినిమాను నిషేధించాలని కోరారు. మధ్య ప్రదేశ్ బిజెపి మంత్రికి ప్రతిపక్ష కాంగ్రెస్ నేత డాక్టర్ గోవింద్ సింగ్ జతకలసి సినిమా మీద ధ్వజమెత్తారు. భారత సంస్కృతికి విరుద్ధంగా సినిమాఉందని నేత చెప్పారు.

సెన్సార్ బోర్డు ఇలాంటి వాటికి అనుమతి ఇవ్వటం ఏమిటి? అది ఇచ్చిన తరువాత బిజెపి దాని మీద రచ్చ చేస్తుంది, ఇదొక నిగూఢమైన అంశం అని కూడా కాంగ్రెస్ నేత చెప్పారు. సదరు నేత తమ రాష్ర్టంలో ఉన్న ఖజురె శిల్పాల గురించి ఏమి చెబుతారు? 2020 జనవరి మొదటి వారంలో ఢిల్లీ జెఎన్‌యులో ముసుగుల తో వచ్చిన ఎబివిపి, దాని మద్దతుదారులు విద్యార్ధులు, టీచర్ల మీద చేసిన దాడికి నిరసన తెలుపుతున్న వారికి సంఘీభావంగా దీపిక వచ్చారు. వారితో కొద్దిసేపు గడపటం తప్ప ఆమె ఎలాంటి ప్రకటన, ప్రసంగం చేయలేదు. దాడిలో గాయపడిన జెఎన్‌యు విద్యార్ధి సంఘ అధ్యక్షురాలు, ఎస్‌ఎఫ్‌ఐ నేత ఐసి ఘోష్‌ను ఆమె పరామర్శించారు. దాని మీద బిజెపి నేతలు దీపిక సినిమాలను బహిష్కరించాలని అప్పుడే వీరంగం వేశారు. ఇప్పుడు మరోసారి బిజెపి మంత్రి ఆమె తుకడే తుకడే ముఠాకు చెందిన వారంటూ నోరు పారవేసుకొని నాటి ఉదంతాన్ని గుర్తుకు తెచ్చారంటే పాట మీద కంటే ఆమె మీద ద్వేషమే ప్రధానంగా ఉన్నట్లు చెప్పవచ్చు.

హిందూ ముస్లిం మతశక్తులు ఒకే నాణెనికి బొమ్మాబొరుసు వంటివి. పఠాన్ సినిమా పాట ముస్లిం సమాజ మనోభావాలను దెబ్బతీసిందని, దీన్ని తమ రాష్ర్టంలోనే గాక దేశంలో ఎక్కడా ప్రదర్శించనివ్వబోమని మధ్య ప్రదేశ్ ఉలేమాబోర్డు అధ్యక్షుడు సయ్యద్ అనస్ ఆలీ బెదిరించారు. ముస్లిం సమాజాల్లో గౌరవనీయులైన వారిలో పఠాన్లు ఒకరు. పఠాన్లనే కాదు మొత్తం ముస్లిం సమాజాన్నే దీనిలో అగౌరవపరిచారని, సినిమా పేరు పఠాన్, దానిలో మహిళ అసభ్యంగా నృత్యం చేసింది. సినిమాలో పఠాన్లను తప్పుగా చూపారని అలీ ఆరోపించారు. హిందూత్వను అవమానించే ఏ చిత్రాన్నైనా మహారాష్ర్టలో ప్రదర్శించనివ్వబోమని బిజెపి ఎంఎల్‌ఏ రావ్‌ు కదవ్‌ు ప్రకటించారు. పఠాన్ సినిమాను బహిష్కరించాలని, ఎక్కడైనా ప్రదర్శిస్తే సినిమా హాళ్లను తగులబెట్టాలని అయోధ్యలోని హనుమాన్ ఘరీ రాజు దాస్ మహంత్ పిలుపు నిచ్చారు. చివరకు ప్లేబోయి పత్రికకు అసలు ఏ దుస్తులూ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చిన నటి షెర్లిన్ చోప్రా (ఈమె హైదరాబాదీ) కూడా హిందూత్వ శక్తుల సరసన నిలిచారు. పఠాన్ సినిమాలో దీపిక కాషాయరంగు బికినీ ధరించటాన్ని తప్పుపడుతూ ఇది అంగీకారం కాదన్నారు.

దీపిక తుకడే తుకడే గ్యాంగ్ మద్దతుదారని ఆరోపించారు. కాషాయ రంగు దుస్తులు వేసుకొని అడ్డమైన పనులు చేస్తున్నవారిని చూస్తున్నాము. ఎప్పుడూ ఆ రంగును అభిమానించే వారు వాటిని ఖండించలేదు. అందుకే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చక్కగా స్పందించారు. సిగ్గులేని మతోన్మాదులు.. కాషాయ దుస్తు లు వేసుకున్న పెద్దలు అత్యాచారాలు చేసిన వారికి దండలు వేస్తారు, విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తారు.

ఎంఎల్‌ఎలు బ్రోకర్లుగా ఉంటారు, కాషాయ దుస్తులు వేసుకున్న స్వామీజీలు ముక్కుపచ్చలారని బాలికల మీద అత్యాచారాలు చేస్తా రు. ఒక సినిమాలో మాత్రం ఆ రంగు దుస్తులు వేసుకోకూడదా అని అడుగుతున్నానంతే అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. షారూఖ్ ఖాన్ సినిమా రయీస్ దర్శకుడు రాహుల్ ధోలాకియా మతశక్తుల బెదిరింపులను ఖండించారు. షారూఖ్ ఖాన్‌పై విద్వేష దాడులను సినిమా రంగంలోని వారందరూ ఖండించాలని, బుద్ధిలేని సిద్ధాంతాలతో ముందుకు వస్తున్న మతశక్తులను నోరు మూసుకోమని చెప్పాలని ట్వీట్ చేశారు. సినిమా నటి స్వర భాస్కర్ అధికారంలో ఉన్న మన నేతలను చూడండి, వారు కొంత పని చేసి ఉండవచ్చు, గుడ్లగూబలా నటుల దుస్తులను చూసేందుకు వారికి వ్యవధి ఉంటుందా అన్నారు. నేరగాండ్లు మంత్రివర్గాల్లో చేరుతుంటే అదేమీ వార్త కాదు. ఆర్థికవేత్తలు యాత్రల్లో చేరుతున్నారు. ఐటం సాంగ్స్‌లో నటి ఏ రంగు దుస్తులు ధరించిందన్నది మాత్రం వార్త అవుతోందని కూడా ఆమె పేర్కొన్నారు.

రిటైర్డ్ ఐపిఎస్ అధికారి పేరుతో ఒకరు చేసిన ట్వీట్‌లో నాలుగు డబ్బుల కోసం తన భార్య ను బహిరంగంగా అవమానించటాన్ని సహించే లేదా అనుమతించే భర్త ఎలాంటి వాడై ఉంటాడు అని కేవలం అడుగుతున్నానంతే అని పేర్కొన్నారు. దీని గురించి దర్శకుడు ఓనిర్ (అనిర్భన్ ధార్ ) కూడా కాషాయ దళాల దాడిని ఖండించారు. స్పందిస్తూ ‘ఛీ ఛీ మానసిక రోగమిది, అనుమతించటం, సహించటం అనే పదాలను ఉపయోగించటాన్ని చూస్తే భర్త ఒక మహిళకు యజమాని అని భావించే తెగకు చెందిన వారిలా కనిపిస్తున్నారు. చౌకబారు ఆలోచనలు గలవారే ఇలా చేస్తారు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత బొమ్మలను కళ్లప్పగించి చూడటం, విద్వేష ప్రచారం తప్ప మరేమి చేస్తారు అంటూ ఓనిర్ దుయ్యబట్టారు. ఫిలివ్‌ు సర్టిఫికెట్ బోర్డు, న్యాయ వ్యవస్థ లేదా చట్టాన్ని అమలు పరిచే సంస్థ లు కాదు, మనం చూడాల్సిందేమిటన్నది ఇప్పుడు గూండాలు నిర్ణయిస్తారు.

భయంకర రోజులు అని కూడా ఓనిర్ అన్నారు. బూతు బొమ్మలున్న దేవాలయాల సందర్శనలను నిషేధించాలని గానీ, వాటి చుట్టూ ఎత్తైన గోడలు కట్టి మూసివేయాలని గానీ, వాత్సాయన కామసూత్రాలు, వాటి చిత్రాల అమ్మకాలను నిషేధించాలని గానీ ఎన్నడూ హిందూత్వ శక్తులు రోడ్డెక్కింది లేదు. వాత్సాయన కామసూత్రాల పేరుతో దుస్తుల్లేకుండా పడక గది దృశ్యాలతో కూడిన వీడియోలు, సినిమాలు చూసేవారికి కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. కేంద్రంలో ఉన్న పెద్దలు వాటినేమీ నిషేధించలేదు.దీపికా పడుకోనే, షారూఖ్ ఖాన్ మీద చిత్రించిన పాటలో దీపిక కాషాయ రంగు దుస్తులు వేసుకోవటాన్ని వారు అంగీకరించటం లేదు. ఇతర రంగు వేసుకుంటే ఫర్లేదా? ఆ రంగు మీద ఎవరికీ పేటెంట్ హక్కు లేదు. ఎవరికి ఏ రంగు, ఎలా తగిన విధంగా ఉంటాయో నిర్ణయించేది సినిమా దర్శకులు, వారికున్న హక్కు అది. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ర్ట పర్యటనకుపోతే అక్కడి సంప్రదాయ వేషధారణతో కనిపించటం తెలిసిందే.

అదే విధంగా కొన్ని రోజులు గడ్డం పెంచారు, తరువాత తగ్గించారు, అది మోడీ స్వంత విషయం. దేశ ప్రధాని లేదా ప్రజాప్రతినిధుల దుస్తులు ఇలా ఉండాలని రాజ్యాంగం నిర్దేశించలేదు కదా! గతంలో ఇందిరా గాంధీ ఇంకా అనేక మంది కూడా అలాగే చేశారు. దుస్తుల కంటే కూడా దీపిక అంటే హిందూత్వ శక్తులకు మింగుడు పడటం లేదు. షారూఖ్ ఖాన్ ముస్లిం గనుక విద్వేషం వాటి డిఎన్‌ఎలోనే ఉంది. అయినా సెన్సార్ బోర్డు అనుమతించిన తరువాత దాన్ని అంగీకరించం అంటూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటామని చెప్పే హక్కు ఎవరిచ్చారు. ఇది ప్రజాస్వామ్యమా? మూక వ్యవహారమా? ఇరాన్‌లో హిజాబ్ వద్దంటూ సాగిన ఆందోళనను సమర్ధించిన శక్తులు మనదేశంలో మాత్రం ఇక్కడ ఎవరు ఏ దుస్తులు వేసుకోవాలో, కూడదో చెబుతూ ఆదేశాలు జారీ చేస్తున్నాయి. అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్లు, ఇరాన్‌లో నైతిక పోలీసులను విమర్శించే వారు మన దేశంలో వారిని పక్కాగా అనుసరిస్తూ సమాజాన్ని వెనక్కు తీసుకుపోవాలని చూస్తున్నారు. తాలిబాన్లు ఏరంగు, ఏ మతం వారైనా సమాజానికి ప్రమాదకారులే !

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News