Wednesday, January 22, 2025

సుప్రీం ‘లక్ష్మణ రేఖ’ దాటింది

- Advertisement -
- Advertisement -

Objections to Supreme Court's recent harsh comments on Nupur Sharma

నూపుర్ శర్మ కేసులో వ్యాఖ్యలపై మాజీ న్యాయమూర్తుల విమర్శ
తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచిస్తూ బహిరంగ లేఖ
లేఖపై 15 మంది మాజీ హైకోర్టు జడ్జిలు,77 మంది ఆలిండియా సర్వీసెస్ మాజీ అధికారుల సంతకాలు

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండయిన బిజెపి అధికార ప్రతినిధి నూపుర్ శర్మపై ఇటీవల సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ‘ లక్ష్మణ రేఖ’ను దాటిందని .. దాన్ని సరిదిద్దడానికి తక్షణమే దిద్దుబాటు చర్యలు అవసరమని కొంతమంది మాజీ న్యాయమూర్తులు, అధికారులు విమర్శించారు. ఈ మేరకు 15 మంది హైకోర్టు న్యాయమూర్తులు, 77 మంది ఆలిండియా సర్వీసెస్ మాజీ అధికారులు, సాయుధ బలగాలకు చెందిన 25మంది రిటైర్డ్ అధికారులు బహిరంగ లేఖ రాశారు. ‘ దేశంలోని అన్ని సంస్థలు రాజ్యాంగం ప్రకారం తమ విధులను నిర్వర్తిస్తే ప్రజాస్వామ్యం చెక్కు చెదరకుండా ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. ఇటీవల సుప్రీంకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ( నూపుర్ శర్మ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పర్ధీవాలా వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ)లక్ష్మణ రేఖను దాటాయి. అందువల్లనే మేము ఈ బహిరంగ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఆ వ్యాఖ్యలు దేశం లోపల, వెలుపల తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేశాయి.

న్యాయస్థానాలనుంచి ఇటువంటి దురదృష్టకరమైన వ్యాఖ్యలు అతిపెద్ద ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థపై చెరగని మచ్చ వేస్తాయి. ప్రజాస్వామ్య విలువలు, దేశ భద్రతపై ఇవి తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉన్నందున..తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం. ఈ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయాలు న్యాయపరమైన విలువలకు లోబడి లేవు. కోర్టు తీర్పులో భాగం కాని ఈ వ్యాఖ్యలు న్యాయబద్ధతను అపవిత్రం చేస్తాయి’ అని ఆ బృందం తమ ప్రకటనలో పేర్కొంది. ‘ఆ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు పిటిషనర్ లేవనెత్తిన సమస్యతో సంబంధం లేకుండా ఉన్నాయి. అంతేకాకుండా న్యాయపరంగా అన్ని నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయి.ఈ కేసులో ఆమె తనపైన మోపిన కేసులలన్నిటినీ ఒకే చోటికి బదిలీ చేయాలని కోరారు. అయితే ఇందులో ఆమెకు న్యాయం దక్కలేదు. నూపుర్ కేసును ఎందుకు భిన్నంగా చూశారనేది ఇక్కడ అందరికీ అర్థం కాని విషయం. ఇలాంటి ఘటనలు సుప్రీంకోర్టు పవిత్రత, గౌరవంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’ అని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఓ టీవీ చర్చలో మహ్మదు ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలుతీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఎఫ్‌ఐఆర్‌లన్నిటినీ ఒకటిగా చేయాలంటూ నూపుర్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జెబి పర్ధీవాలాలతో కూడిన ధర్మాసనం .. నూపుర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె నోటి దురుసు దేశాన్ని మంటల్లో నెట్టిందని, ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న దురదృష్టకర ఘటనలకు ఆమే ఏకైక బాధ్యురాలని వ్యాఖ్యానించింది. చౌకబారు ప్రచారం కోసం లేదా రాజకీయ అజెండా కోసం లేదా నీచ కార్యకలాపాలకోసం ఏమైనా చేస్తారా అని ఆక్షేపించింది. ఈ వ్యాఖ్యలకుగాను ఆమె దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఈ వ్యాఖ్యలపై నే మాజీ అధికారులు, మాజీ న్యాయమూర్తులు విమర్శలు చేశారు. ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో బాంబే హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి క్షితిజ్‌వ్యాస్, కేరళ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ పిఎన్ రవీంద్రన్, గుజరాత్ హైకోర్టు మాజీ జడ్జి ఎస్‌ఎం సోని, రాజస్థాన్ హైకోర్టు మాజీ జడ్జిలు ఆర్‌ఎస్ రాథోర్, ప్రశాంత్ అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్‌ఎన్ ధింగ్రా, మాజీ ఐఎఎస్ అధికారులు ఆనంద్ బోస్, ఆర్‌ఎస్ గోపాలన్, ఎస్ కృష్ణకుమార్, రిటైర్డ్ రాయబారి నిరంజన్ దేశాయ్, మాజీ డిజిపిలు ఎస్‌పి వైద్, బిఎల్ వోహ్రా, మాజీ సైనికాధికారులు లెఫ్టెనెంట్ జనరల్ వికె చతుర్వేది, ఎయిర్‌మార్షల్ ఎస్‌పి సింగ్ తదితరులున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News