Friday, November 22, 2024

వృద్ధికి ఆటంకం అధిక జనాభా

- Advertisement -
- Advertisement -

Obstruction to development with high Population

కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సదుపాయాలు సకాలంలో ప్రజలకు అందజేయలేకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనలాంటి దేశంలో కొవిడ్ టీకాలు ‘వ్యాక్సినేషన్’ అందరికీ అందించుటలో జాప్యానికీ కూడా ప్రధాన కారణం అధిక జనాభా, ఆర్థిక పరిస్థితే. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో జనాభా విస్ఫోటనం వలన సంభవించే పరిణామాలు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఒకరోజు నిర్వహించాలి అని ప్రపంచ బ్యాంకు సీనియర్ డెమోగ్రాఫర్ డాక్టర్. కెసి జకర్యా సూచించారు. ఇదే సమయంలో 1987, జులై 11 వ తేదీన ప్రపంచ జనాభా 500 కోట్లుగా నమోదు కావడం, 1989లో ప్రపంచ దేశాలు జనాభా ప్రాముఖ్యత తెలియజేసే విధంగా జనాభా దినోత్సవం జరపాలని నిర్ణయించడంతో, 1990లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో 45/126 తీర్మానం చేసి, ప్రపంచ జనాభా దినోత్సవం జూలై 11వ తేదీన జరపాలని నిర్ణయించి, నేడు అన్ని దేశాల్లో నిర్వహిస్తున్నారు.

పారిశ్రామికీకరణ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో 1804 నాటికి ప్రపంచ జనాభా 100 కోట్లు (1బిలియన్) ఉండగా, 1930కి 200, 1960కి 300, 1974కి 400, 1987కి 500 నేటికి 2021 జూలైకి 787 కోట్లుగా పెరిగి, ఈ సంవత్సరం ఆఖరికి 790 , 2023 కి 800, 2037కి 900, 2057 నాటికి 1000 కోట్లు (10 బిలియన్లు) చేరి భూమి పట్టలేని, మోయలేని స్థితికి నెట్టబడుతుంది అని భూశాస్త్ర నిపుణులు చెబుతూ, ఆందోళన వ్యక్తం చేయుట పట్ల మనం అందరం శాస్త్రీయంగా ఆలోచన చేయవలసిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అందులో చైనా 144, భారత్ 139 కోట్లతో ముందు వరుసలో ఉన్నా యి. ప్రపంచ ఫెర్టిలిటీ రేటు (టి.ఎఫ్.ఆర్) 2.1 గా ఉంది. అదే సమయంలో ఆయుష్షు (లైఫ్ ఎక్సెపెటెన్సీ) సంయుక్తంగా 73.2 సంవత్సరాలుగా, పురుషులు 70.8, స్త్రీలు 75.6 సంవత్సరాల బ్రతుకుతున్నట్లు నివేదిక చెబుతోంది. శిశు మరణాలు ప్రతీ 1000 మందికి 26.1 గాను, 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు 35.8 గా ఉండుట గమనార్హం. 2019 నివేదికలో ప్రపంచ జనాభాలో 430 కోట్ల మంది (55.7%) పట్టణాల్లోను, మిగిలిన సుమారు 45% జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు.

అదే విధంగా ప్రతీ చదరపు కిలోమీటరకి 52 మంది నివసిస్తున్నట్టు జనసాంద్రత గణాంకాలు చెబుతున్నాయి. మనదేశ జనసాంద్రత 464 కాగా మనకంటే ఎక్కువ జనాభా ఉన్న చైనా దేశపు జనసాంద్రత 153 మాత్రమే. అమెరికా జనాభా 33 కోట్లు కాగా జనసాంద్రత 36 మాత్రమే. ఈ జనసాంద్రత బట్టి అభివృద్ధి అంచనా వేయవచ్చు. మతపరంగా ప్రపంచ జనాభాలో 217 కోట్లు (31%) క్రైస్తవులు, 159 కోట్లు (23% ) ముస్లింలు, నాస్తికులు 112 కోట్లు (16%), హిందువులు 103 కోట్లు (15%), బౌద్ధులు 48, గిరిజన మతస్థులు 40 కోట్ల ఉండగా మిగతా వారు ఇతర మతస్థులు గా ఉన్నారు.

ఈ విధంగా ప్రపంచ జనాభా వివిధ దేశాల్లో, అనేక రకాలుగా ఉంటూ జీవనయానం చేస్తుంది. అయితే అభివృద్ధి అన్ని చోట్లా ఒకే విధంగా లేకపోవడంతో అనేక అసమానతలు ఏర్పడి పలు సమస్యలు శతాబ్దాల తరబడి, నేటికీ పట్టి పీడుస్తున్నాయి. దీనికి కారణం అధిక జనాభా.. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రభుత్వాలు అందరికీ అన్ని వసతులు కల్పించలేక సతమతమవుతున్నాయి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు, దేశాలకు వలస బాటపడుతున్నారు. వలస కార్మికుల వెతలు నేటికీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. ‘మేధో వలస’ (బ్రెయిన్ డ్రెయిన్) మన దేశం ఇతర దేశాలకు వెళ్ళటం జరుగుతుంది. అక్కడ సదుపాయాలు ఉండుటచే అనేక నూతన ఆవిష్కరణలు చేస్తూ, అద్భుతాలు సృష్టిస్తూ మనకు ఆశ్చర్యం కలగజేస్తున్నారు.

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మన దేశంలో నాణ్యమైన విద్య, వైద్యం అందుట లేదు. ఉపాధి అవకాశాలు లేక, పేదరికంలో మునిగితేలుతున్నారు. చైనా దేశం 12 లక్షల పరిశ్రమలు నెలకొల్పి, ఆ దేశ ప్రజలు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించి, అన్ని రకాల ఉత్పత్తులు చేస్తూ ప్రపంచ దేశాలకు ఎగుమతిదారుగా, ఇంకా దేశ జనాభా పెంచండి అనే స్థాయికి చేరుట, జనాభా ఎక్కువైనా అభివృద్ధిలో అగ్రగామిగా ఉండుట గమనార్హం. మన ప్రభుత్వాలు కూడా పరిశ్రమలు స్థాపించాలి. ఉపాధి కల్పన చేయా లి, ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతులు పైనే ఆధారపడే స్థితి నుంచి బయటపడాలి.. అధికారం నిలుపుకోవడం కోసం పథకాలు, తాత్కాలిక తాయిలాలు అందిస్తూ, ఒకరికి ఒకరు పోటీపడుతున్నారు.

ఇది దేశ, రాష్ట్ర భవిష్యత్తుకు, యువతకు గొడ్డలిపెట్టు. భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతుంది అని గ్రహించాలి. ఉత్పాదక రంగాలకు బడ్జెట్ కేటాయింపులు పెరగాలి.యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వివిధ కోర్సులు అందుబాటులోకి తేవాలి. విద్య, వైద్యం ప్రభుత్వ రంగాల్లో ఉంచాలి. వ్యవసాయ, సేవా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. బడా పెట్టుబడిదారులకు అధిక మొత్తంలో రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వరాదు. ప్రజా సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి.

అధిక జనాభా వలన ఆహారం, నీరు, నిరుద్యోగం, పర్యావరణ, విద్య, ఆరోగ్యం సమస్యలు పెరుగుతాయి. వివిధ రకాల కాలుష్యాలు పెరిగి, అనారోగ్యాలకు గురవుతున్నారు. జాతీయ ఆదాయం (జిడిపి) ఎంత పెరిగినా, తలసరి ఆదాయం పెరిగినా దేశం, ప్రజలు పేదరికం చవిచూడాల్సి వస్తోంది. ఈ దుస్థితిలో ఉన్న యువత అసాంఘిక కార్యకలాపాలు వైపు పరుగులు తీస్తోంది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణ, ఉగ్రవాదం, సైబర్ నేరాలు, వివిధ రకాల మోసాలు చేస్తూ కుటుంబ సభ్యులకు, ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారై, శాంతిభద్రతలు సమస్యలకు కారణం అవుతున్నారు. ‘యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాలను, ప్రజలను చైతన్యం చేయాలి. అధిక జనాభా విషయంలో మత విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ప్రక్కన పెట్టి, శాస్త్రీయ దృక్పథం కలిగేటట్లు చేయాలి. భూభాగం తక్కువ- జనాభా ఎక్కువ వలన సంభవించే ప్రమాదాలు వివరించాలి.

అధిక జనాభా వలన అడవులు నరికివేస్తూ, పచ్చిక బయళ్ళు నాశనం చేస్తూ పర్యావరణాన్ని ప్రమాదంలో పడవేస్తూ, అనేక నూతన వైరస్‌లు, రోగాలకు కారణం అవుతున్నాము. పెరిగిన జనాభాకు అనుగుణంగా అధిక ఆహార ఉత్పత్తికై రసాయనిక ఎరువులు వాడుతున్నారు. భూగర్భ జలాలు కాలుష్యం అయి, మంచి నీటికై తహతహలాడుతున్నారు. నగరా లు, పట్టణాలు మురుగు కాల్వలు, కాలుష్య నిలయాలుగా మారి, రోగాలతో బాధపడుతున్న భారతదేశ రాజధాని న్యూఢిల్లీతో సహా ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి నగరాలు మనం చూస్తూనే ఉన్నాం.

కుటుంబ నియంత్రణ పాటించాలి. లింగ వివక్షత విడనాడాలి. మానవ హక్కుల రక్షణకు కట్టుబడి ఉండాలి. శరణార్థులు సమస్యలు పరిష్కారం చూపాలి. అన్ని దేశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేస్తూ, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేయటమే ఈ దినోత్సవం ప్రాధాన్యతగా భావించాలి. అధిక జనాభా అభివృద్ధికి అవరోధం అని గుర్తెరిగి, అన్ని దేశాలు జనాభా విస్ఫోటనం పై దృష్టి సారించాలి… చివరిగా అధిక జనాభా విషయంలో ప్రజల ఆలోచనల్లో మార్పు ద్వారానే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. ఆ విధంగా ప్రజలను చైతన్యపరచుటలో ప్రభుత్వాలు, విద్యావంతులు, మీడియా, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు విశేషంగా కృషి చేయాలని ఆశిద్దాం…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News