కుత్బుల్లాపూర్: జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిది కూకట్‌పల్లి మండలం, శంషీగూడ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్ 57లోని ప్రైవేటు భూమిలో కొందరు కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. స్థానిక సివిల్ కోర్టు నుంచి హైకోర్టు వరకు భూమి యజమానులకు అనుకూలంగా వచ్చిన ఆర్డర్లను కూడా లెక్క చేయకుండా దౌర్జన్యాలకు పాల్పడుతూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నారు. చట్ట ప్రకారం పోలీసు అధికారులు కేసులు నమోదు చేసినా, ఆక్రమణలకు పాల్పడవద్దని హెచ్చరించినా ఖాతర్ చేయకుండా భూమి యజమానులకై దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారు. శంషీగూడ గ్రామం ఎల్లమ్మబండ చౌరస్తాలోని పి. కృష్ణప్రియకు చెందిన ప్రైవేటు భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి తల్వార్లతో హంగామా చేస్తూ సెక్యూరిటీ సిబ్బందిని, భూమి యజమానులను చంపేస్తామని బెదిరిస్తున్నారు.
సర్వేనెంబర్ 57లోని 7 ఎకరాల భూమికి కృష్ణప్రియ తన తండ్రి ద్వారా రిజిస్టర్డ్ జీపీఏ కలిగి ఉన్నారు. హైకోర్టు ఫైనల్ డిక్రీ అప్లికేషన్ నెంబర్ 1043/2-011 ద్వారా సర్వ హక్కులు కలిగి ఉంది. హైకోర్టు ఫైనల్ డిక్రీ ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టు రిజిస్ట్రార్ 2012లో కూకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్ నెంబర్ 3366/2012 ద్వారా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పొజిషన్ డెలివరీ కోసం 2012లో అప్లికేషన్ నెంబర్ 480/12 ద్వారా హైకోర్టుని ఆశ్రయించారు. దీనిని విచారించిన హైకోర్టు ఫైలన్ డిక్రీలో ఉన్న 7 ఎకరాల భూమిని గుర్తించి ఫిజికల్ పొజిషన్ ఇవ్వవలసిందిగా హైకోర్టు రిసీవర్స్ కమ్ కమిషనర్స్ని ఆదేశించింది. 2013 అక్టోబర్లో హైకోర్టు రిసీవర్స్ పంచనామా చేసి ఫిజికల్ పొజిషన్ భూమి యజమానులకు అప్పగించారు. భూమి యజమానులు భూమి చుట్టూ రక్షణ కోసం టిన్ షీట్స్ ఏర్పాటు చేసుకున్నారు.
ఆ తర్వాత రెండు సంవత్సరాలకు 2015లో కూకట్పల్లికి చెందిన లక్ష్మయ్యయాదవ్, నర్సింగ్యాదవ్, రవీందర్యాదవ్, సత్యనారాయణయాదవ్, ఆంజనేయులుయాదవ్తో పాటు వారి కుటుంబ సభ్యులు, మరి కొందరు వ్యక్తులు రౌడీలతో కలిసి దౌర్జన్యంగా మా భూమిలోకి ప్రవేశించి కబ్జా చెయ్యటానికి ప్రయత్నం చేశారు . వీరి దౌర్జన్యాలను భరించలేక కూకట్పల్లి సివిల్ కోర్టుని భూమి యజమానులు ఆశ్రయించారు. కూకట్‌పల్లి కోర్టులో వేసిన ఓఎస్ నెంబర్ 199/2015, ఐఏ నెంబర్ 357/ 2015 ద్వారా కోర్టు మా భూమిలోకి ఇతరులు ఎవరూ ప్రవేశించకుండా ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది. అయినప్పటికీ కబ్జాదారులు రౌడీల సహాయంతో తరచూ భూమిలోకి ప్రవేశించి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న షీట్లను తొలగిస్తూ వస్తున్నారు. వీరి ఆగడాలు భరించలేక మళ్లీ భూమి యజమానులు కూకట్పల్లి కోర్టుని ఆశ్రయించి ఐ.ఏ.నెంబర్ 448/2015 దాఖలు చేయగా కోర్టు భూ యజమానులకు పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వవలసిందిగా జగద్గిరిగుట్ట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వకపోవటంతో కబ్జాదారులు నిరతరం రౌడీల సహాయంతో భూమిలోకి ప్రవేశించటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంవత్సరం జూలై 14వ తేదీన భూమి యజమానులు ఫన్సింగ్ ఏర్పాటు చేసుకోగా కబ్జాదారులు తొలగించారు. ఆగస్టు 11వ తేదీన మరోసారి ఫన్సింగ్ వేసుకోగా మళ్లీ తొలగించి రౌడీలతో కలిసి సెక్యూరిటీ గార్డ్ని తల్వార్తో బెదిరించారు.
భూమి యజమానులతో సహా సెక్యూరిటీ గార్డ్ని కూడా చంపేస్తామని బెదిరించారు. ఈ మేరకు చేసిన ఫిర్యాదు ప్రకారం జగద్గరిగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈనెల 17వ తేదీన మరోసారి భూమి యజమానులు టిన్ షీట్స్ ఏర్పాటు చెయ్యగా కబ్జాదారులు తొలగించారు. మరోసారి ఫిర్యాదు చేస్తే అదే రోజు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే క్రమంలో భూమి యజమానులు శనివారం ఉదయం మళ్లీ తమ భూమి చుట్టూ టిన్ షీట్స్తో ఫన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరోసారి కబ్జాదారులు వందల మంది రౌడీలతో దౌర్జన్యంగా షీట్స్ని తొలగించి దాడులకు పాల్పడ్డారు. ఈ మేరకు మరోసారి పోలీసులకు భూమి యజమానులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.