కరోనా కాలంలో ఓటీటీలో విడుదలైన సినిమా ఓదెల రైల్వే స్టేషన్. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘ఓదెల 2’. దర్శకుడు సంపత్ నంది స్క్రిప్టు అందించడంతో దర్శకత్వ పర్యవేక్షణ చేసిన ఈ చిత్రానికి అశోక్ తేజ డైరెక్టర్. తమన్నా-, వశిష్ట, హెబ్బాపటేల్ ముఖ్య పాత్ర లు పోషించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఓదెల అనే ఊరిలో పెళ్లికూతుళ్లను అనుభవించి ప్రాణా లు తీయడం అలవాటుగా మార్చుకున్న తిరుపతి (వశిష్ఠ)ను అతడి భార్య అయిన రాధ (హెబ్బా పటేల్) చంపేస్తుంది. తిరుపతి చేసిన ఘోరాలన్నీ తెలుసుకున్న ఊరి జనాలు అతడి ఆత్మకు శాంతి చేకూరకుండా సమాధి శిక్ష విధిస్తారు. దీంతో ఆత్మగా మారిన తిరుపతి ఓదెల ఊరి మీద పగబడతాడు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లయిన రెండు జంటల ప్రాణాలు తీస్తాడు తిరుపతి. దీంతో అతడిని కట్టడి చేసేందుకు గ్రామస్తులు శివ శక్తి అయినటువంటి భైరవిని (తమన్నా భాటియా) గ్రామానికి తీసుకువస్తారు. ఆ తర్వాత భైరవి, తిరుపతి ప్రేతాత్మ మధ్య జరిగే యుద్ధమే ఈ ‘ఓదెల 2’.
ఈ సినిమాలో విలన్ తిరుపతి ప్రేతాత్మగా మారి కొత్తగా పెళ్లయిన రెండు జంటలను ఎంతో హింసించి ప్రాణాలు తీస్తాడు. ఇక పతాక సన్నివేశాల్లో తమన్నాను విలన్ హింసించే సన్నివేశాన్నయితే మాటల్లో వర్ణించలేము. విలన్ పాత్ర మీద ప్రేక్షకుల్లో కసి పెంచడానికి ఇలాంటి సీన్లు పెట్టారేమో కానీ.. మహిళ పాత్రలమీద ఇంత తీవ్ర స్థాయి హింసను చూసి తట్టుకోవడం మాత్రం అందరి వల్లా కాదు. దైవ భక్తి వర్సస్ దుష్ట శక్తి.. ఫార్ములాలో తెలుగు సినిమా ఆరంభం నుంచి వందల సినిమాలు వచ్చాయి. అయితే ’ఓదెల-2’ను చూస్తుంటే కథా పరంగా చాలా సినిమాలను అనుకరిస్తున్నట్లు కనిపిస్తుందే తప్ప.. కొత్తగా ఏమీ కనిపించదు. ‘అరుంధతి’కి దీనికి సంబంధం లేదని మేకర్స్ చెప్పారు కానీ.. ముఖ్య పాత్రలన్నింటిలో ఆ సినిమాతో పోలికలు కనిపిస్తాయి. నాగసాధువు పాత్రలో తమన్నా బాగానే చేసింది. పాత్రకు తగ్గట్లు తన లుక్ బాగుంది.
కొన్ని సన్నివేశాల్లో ఇబ్బందికరంగా అనిపించినా.. కొన్ని సీన్లలో తమన్నా తన ప్రతిభను చాటుకుంది. నాగసాధువు అయిన హీరోయిన్.. ప్రేతాత్మ అయిన విలన్ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్న సన్నివేశంలో సంభాషణలు మరీ సుదీర్ఘంగా.. పేలవంగా సాగి సినిమాపై ఆసక్తిని చంపేస్తాయి. ఈ సినిమాలో అశ్లీలత.. హింస తగ్గిస్తే బాగుండేది. ఆత్మ, పరమాత్మ సంఘర్షణలో ఎక్కువ భాగం ఆత్మదే పైచేయిగా చూపించటం ఆడియన్స్ కు అంతగా నచ్చదు. పతాక సన్నివేశం బాగున్నా మిగతాదంతా భరించాలంటే కష్టమైన పనే. ఇక సినిమా చివరలో ‘ఓదెల 3’ ఉంటుందని స్క్రీన్ పై రాగానే.. ఇంకా ’దీనికి సీక్వెలా?’ అనిపిస్తుంది.