Monday, December 23, 2024

వన్డే సమరానికి సర్వం సిద్ధం!

- Advertisement -
- Advertisement -

ODI match Between South Africa-Team India teams today

ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా, భారత్‌కు పరీక్ష, నేడు తొలి పోరు

పార్ల్: సౌతాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య జరిగే మూడు వన్డేల సిరీస్‌కు బుధవారం తెరలేవనుంది. టెస్టుల్లో చిరస్మరణీయ విజయం సాధించిన సౌతాఫ్రికా వన్డే సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక కెఎల్.రాహుల్ సారథ్యంలోని టీమిండియాకు సిరీస్ సవాల్‌గా తయారైంది. వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ గాయం నుంచి కోలుకోక పోవడంతో రాహుల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇక ఈ సిరీస్‌లో అందరి దృష్టి సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లిపై నిలిచింది. ఇటీవలే కోహ్లి టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తనకంటే జూనియర్ అయిన రాహుల్ సారథ్యంలో విరాట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతను ఎలా వ్యవహరిస్తాడనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కొంతకాలంగా కోహ్లి తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడం లేదు. ఇలాంటి స్థితిలో అతనికి వన్డే సిరీస్ కీలకంగా మారింది. ఇందులో రాణించి సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. మూడు ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత కోహ్లి ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత నెలకొంది. కోహ్లి మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా..ఏ స్థానంలో ఫీల్డింగ్ చేసినా అందరి కళ్లు అతడిపైనే నిలుస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సిరీస్‌కు ప్రత్యేక ఆకర్షణ విరాట్ కోహ్లినే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కెప్టెన్‌కు సవాల్..

ఇక భవిష్యత్తు కెప్టెన్‌గా భావిస్తున్న కెఎల్.రాహుల్‌కు సౌతాఫ్రికాతో జరిగే సిరీస్ సవాల్ వంటిదేనని చెప్పాలి. అశ్విన్, ధావన్, కోహ్లి వంటి సీనియర్లు జట్టులో ఉండడంతో వారి సహకారం తీసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అతనిపై నెలకొంది. ఇక కోహ్లి ముఖ్య అనుచరల్లో ఒకడిగా రాహుల్‌కు పేరుంది. దీంతో విరాట్ సహకారం అతనికి ఎలాగో ఉంటుంది. ఇక బుమ్రా వంటి సీనియర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇది కూడా రాహుల్‌కు కలిసి వచ్చే అంశమే.

ధావన్‌కు కీలకం..

ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ వన్డే జట్టులో చోటు సంపాదించిన సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సిరీస్ కీలకంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్ నుంచి అతనికి గట్టి పోటీ నెలకొంది. రానున్న రోజుల్లో టీమిండియాలో చోటు కాపాడుకోవాలంటే శిఖర్ మెరుగైన బ్యాటింగ్ కనబరచక తప్పదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన ధావన్ విజృంభిస్తే టీమిండియాకు శుభారంభం ఖాయం. రోహిత్ దూరంగా ఉండడంతో రుతురాజ్, ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలున్నాయి. రాహుల్, కోహ్లి, సూర్యకుమార్, రిషబ్ పంత్ తదితరులతో టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక బుమ్రా, అశ్విన్, భువనేశ్వర్, శార్దూల్, చాహల్ తదితరులతో బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో సమష్టిగా రాణిస్తే సౌతాఫ్రికాను ఓడించడం టీమిండియాకు కష్టమేమీ కాదు.

సమరోత్సాహంతో..

టెస్టుల్లో చారిత్రక ప్రదర్శనతో అలరించిన దక్షిణాఫ్రికా వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. అయితే ఈసారి తెంబా బవుమా జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. డీన్ ఎల్గర్‌కు వన్డే జట్టులో స్థానం దక్కలేదు. అయితే వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ జట్టులోకి రావడం సౌతాఫ్రికాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. అంతేగాక డేవిడ్ మిల్లర్. ప్రిటోరియస్, పెహ్లుక్వాయో, తబ్రెయిజ్ షంసి, పార్నెల్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చేరారు. దీంతో ఈ
సిరీస్‌లోనూ దక్షిణాఫ్రికా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News