Thursday, December 19, 2024

టీమిండియాకు సవాల్ వంటిదే..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం : సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్ టీమిండియా కు సవాల్ వంటిదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2011 భారత్‌లో జరిగిన వన్డే విశ్వకప్‌లో భారత్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈసారి మాత్రం ట్రోఫీని సాధించడం టీమిండియా కు అంత తేలికేం కాదనే చెప్పాలి. అప్పట్లో సచిన్, సెహ్వాగ్, గంభీర్, యువరాజ్‌లకు తోడు మహేంద్ర సింగ్ ధోనీ రూపంలో మిస్ట ర్ కూల్ కెప్టెన్ ఉండేవాడు. అయితే ఈసారి స్టార్ క్రికెటర్లతో పాటు ధోనీ వంటి అత్యుత్తమ సారథి టీమిండియాకు అందుబాటులో లేకుండా పోయాడు. యువరాజ్, సురేశ్ రైనా, గంభీర్, సచిన్, ధోనీ వంటి మ్యాచ్ విన్నర్లు కూడా జట్టులో లేరు. ప్రస్తుతం విరా ట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మలు మాత్రమే అనుభవజ్ఞులైన ఆటగాళ్లుగా ఉన్నారు. మిగతావారు ఉన్నా వారికి తగినంత అనుభవం లేదు.

ఇలాంటి స్థితిలో వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌లో ట్రోఫీని సాధించడం టీమిండియాకు శక్తికి మించిన పనిగానే చెప్పక తప్పదు. అంతేగాక చాలా ఏళ్లుగా భారత్ ఐసిసి టోర్నమెంట్‌లలో పేలవమైన ప్రదర్శనతో నిరాశ పరుస్తోంది. రెండు టి20 వరల్డ్‌కప్‌లతో పాటు వన్డే ప్రపంచకప్‌లో కూడా చెత్త ఆటతో ఉసురు మనిపించింది. తాజాగా ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగే డబ్లూటిసి కప్ ఫైనల్లో కూడా పేలవమైన ఆటను కనబరిచింది. ఘోర పరాజయంతో కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఐపిఎల్ రాకతో టీమిండియా ఆటగాళ్లలో దూకుడు పెరిగింది. అయితే టెస్టులు, వన్డే ఫార్మాట్‌లకు వచ్చే సరికి ఈ దూకుడు ప్రతికూలంగా మారుతోంది. టి20లలో యువ ఆటగాళ్లు బాగానే ఆడుతున్నా వన్డే లు, టెస్టులకు వచ్చే సరికి తేలిపోతున్నారు. ఇది జట్టుకు అతి పెద్ద సమస్యగా మారింది.

టి20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న సూర్యకుమార్ యాదవ్ వన్డేలకు వచ్చే సరికి పూర్తిగా తేలిపోతున్నాడు. వరుస అవకాశాలు లభిస్తున్నా దాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. వన్డేల్లో అతని ఆట తీరు అంతంత మాత్రంగానే ఉంది. ఇక కోహ్లి, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, కెప్టెన్ రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ తదితరులు కూడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నారు. వరల్డ్‌కప్ మరి కొన్ని నెలల సమయం మాత్రమే ఉన్న పరిస్థితుల్లో టీమిండియా ప్రదర్శన జట్టు యజమాన్యానికి కలవర పరుస్తోంది. మరోవైపు జట్టు ఆటతీరుపై గవాస్కర్, సెహ్వాగ్, కపిల్‌దేవ్, గంభీర్, గంగూలీ, వెంగ్‌సర్కార్ వంటి మాజీ దిగ్గజాలు సయితం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు తీసుకోక పోతే సొంత గడ్డపై జరిగే వన్డే విశ్వకప్‌లో టీమిండియాకు చేదు అనుభవం తప్పక పోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News