భువనేశ్వర్ : ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదివారం జపాన్ నుంచి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. విదేశీ గడ్డపై నుంచి మొట్టమొదటిసారిగా ఆయన కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం ఇది తొలిసారి. ఒడిశా రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాబట్టుకొనే ప్రయత్నంలో ఆయన జపాన్ పర్యటనకు వెళ్లారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు జపాన్ లోని క్యోటో నగరం 6000 కిమీ దూరంలో ఉంది.
అక్కడ నుంచి వర్చువల్ విధానంలో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించడం విశేషం. మంత్రులు ఈ సమావేశంలో వేర్వేరుగా పాల్గొని నేరుగా ముఖ్యమంత్రితో చర్చించారు. ఫైళ్లు ప్రాసెస్ చేశారు. డాక్యుమెంట్లు సంతకాలు ఆన్‌లైన్ లోనే జరిగాయి. ఇదంతా ఒడిశా స్టేట్ వైడ్ ఏరియా నెట్‌వర్క్ ( ఒఎస్‌డబ్లుఎఎన్) ద్వారానే జరిగిందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. “ పాలనా వ్యవస్థలను, ప్రజా సేవలను మరింత సమర్ధంగా నిర్వహించడానికి వీలుగా తాజా అత్యంత ఆధునిక 5 టి చార్టర్ సాంకేతిక ప్రక్రియను ఉపయోగించుకోవడంలో తాము ముందున్నామని ” ప్రకటనలో పేర్కొనడమైంది.