Sunday, January 19, 2025

ప్రధాని మోడీకి ఒడిశా సిఎం కౌంటర్.. ఏవీ ఆ హామీలు!

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పాలంటూ ప్రధాని మోడీ చేసిన సవాల్‌పై బిజు జనతా దళ్ (బీజేడీ ) చీఫ్ , ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా స్పందించారు. అసలు మీకు ఒడిశా గుర్తుందా? అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒడియా శాస్త్రీయ భాష అయినప్పటికీ దాన్ని మోడీ మరిచారని, ఒడిస్సీ క్లాసికల్ సంగీతంపై తాను చేసిన ప్రతిపాదనలు కూడా రెండు సార్లు తిరస్కరించారని, దుయ్యబట్టారు. తాను విడుదల చేసిన 3 నిమిషాల వీడియోలో ఆయన మోడీ పై ఇలా కౌంటర్ ఎటాక్ చేశారు.

“ మోడీజీ …నన్ను జిల్లాల పేర్లు అడుగుతున్న మీకు అసలు ఒడిశా గుర్తుందా ? ఒడియా శాస్త్రీయ భాష అయినా, దాని గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు. సంస్కృతానికి రూ. 1000 కోట్లు కేటాయించారు . కానీ ఒడియాకు మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు.” అని నవీన్ పట్నాయక్ ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను క్లాసికల్ ఒడిస్సీ సంగీత గుర్తింపు విషయమై రెండు సార్లు ప్రతిపాదనలను గతంలో పంపించాను.

కానీ వాటిని తిరస్కరించారని పట్నాయక్ మండి పడ్డారు. ఒడిశాకు ఒడియా భాష , సంస్కృతిని అర్ధం చేసుకునే ముఖ్యమంత్రి కావాలంటూ ఉద్ఘాటించారు. ఇదే సమయంలో ఒడిశాలో సహజ వనరులు ఎన్నో ఉన్నా ఆ రాష్ట్ర ప్రజలు పేదలుగా ఎందుకున్నారని ప్రధాని మోడీ సంధించిన ప్రశ్నకు కూడా నవీన్ పట్నాయక్ బదులిచ్చారు. ఒడిశా సహజ సంపద బొగ్గు అని, కేంద్రం ఆ బొగ్గుని తీసుకుంటుందని, కానీ గత పదేళ్లలో బొగ్గుపై రాయల్టీని పెంచడం మర్చిపోయారని తూర్పార బట్టారు. కేవలం ఎన్నికల సమయంలో ఒడిశాను గుర్తు చేసుకుంటే ప్రయోజనం ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల చాలా మందికి భారత రత్న ఇచ్చిన కేంద్రం ఒడిశా వీర కుమారులను ఎందుకు మరిచి పోయిందని నిలదీశారు. అలాగే ఒడిశా రాష్ట్రానికి 2014, 2019 లో ప్రధాని మోడీ చేసిన వాగ్దానాలు కూడా నవీన్ పట్నాయక్ గుర్తు చేశారు. నిత్యావసర ధరలు తగ్గిస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ఎల్‌పీజీ, పెట్రోలు , డీజిల్ ధరలు తగ్గిస్తామని, అందరికీ మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని మోడీ వాగ్దానాలు ఇచ్చారని, కానీ అవేవీ పూర్త చేయలేదని పేర్కొన్నారు. జూన్ 10 వ తేదీనే కాదు, మరో పదేళ్లలోనూ ఏమీ జరగదని, ఒడిశా ప్రజల హృదయాలను బీజేపీ గెలుచుకోలేదని నవీన్ పట్నాయక్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News