ఒడిశా నూతన ముఖ్యమంత్రి మోహ్‌న్ చరణ్ మాఝీ, ఆయన మంత్రివర్గ సహచరుల సమక్షంలో గురువారం ఉదయం పూరీలోని మహాప్రభు జగన్నాథ స్వామి ఆలయానికి చెందిన నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. కొవిడ్ మహమ్మారి కాలంలో 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయానికి చెందిన మూడు ద్వారాలు మూతపడగా గురువారం ఉదయం స్వామివారికి మంగళ హారతి పూర్తయిన తర్వాత అవి తెరుచుకున్నాయి. ముఖ్యమంత్రి, ఇద్దరు ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పలువురు బిజెపి ఎంపీలు, పార్టీ నాయకులు ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఆలయ సముదాయం చుట్టూ వారంతా ప్రదక్షిణ చేశారు. భువనేశ్వర్‌లో బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బిజెపి ప్రభుత్వం జగన్నాథుని ఆలయం ద్వారాలన్నిటినీ తెరవాలని తొలి నిర్ణయం తీసుకుంది.
స్వామివారికి మంగళ హారతి తర్వాత ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చెందిన నాలుగు ద్వారాలను మళ్లీ తెరిచినట్లు పూరీలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మాఝీ తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీ జగన్నాథుని ఆలయం అభివృద్ధి, మెరుగైన నిర్వహణ, అదనపు సౌకర్యాల కోసం రూ. 500 కోట్ల మూల నిధిని ఏర్పాటు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు మాఝీ తెలిపారు. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో ఇందుకు సంబంధించిన కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపారు. కొవిడ్ మహమ్మారి తర్వాత కూడా ఆలయానికి చెందిన మూడు ద్వారాలను ఎదుకు తెరవలేదో వివరణ కోరుతూ ఒక నివేదికను సమర్పించాలని ఆలయ అధికారులను కోరామని రాష్ట్ర మంత్రి సురేష్ పూజారి తెలిపారు. ఆలయానికి చెందిన అన్ని ద్వారాలను తెరవడం బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన వాగ్దానాలలో ఒకటి. గత బిజెడి ప్రభుత్వం మూడు ద్వారాలను మూసివేసి కేవలం సింహద్వారం నుంచి మాత్రమే భక్తులను ఆలయంలోకి అనుమతించింది.