భువనేశ్వర్ : గత ఏడాది డిసెంబర్ నాటికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆస్తి విలువ మొత్తం రూ.65. 40 కోట్లుగా సిఎంఒ వెబ్‌సైట్ వెల్లడించింది. ఆయన మంత్రివర్గం లోని 14 మంది మంత్రులు కరోడ్ పతులే. శుక్రవారం సవరించిన సిఎంఒ వెబ్‌సైట్ ప్రకారం 2020 21లో ముఖ్యమంత్రి ఆస్తుల విలువ రూ. 64.97 కోట్లు ఉండగా, 2021-22 నాటికి చరాస్తి విలువ రూ. 43 లక్షల వరకు పెరిగింది.
ఒడిశా లోని మంత్రులందరూ తమ ఆస్తుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌కు తెలియజేశారు. పట్నాయక్‌కు చరాస్తి విలువ రూ. 12.52 కోట్లు. ఈ ఆస్తిలో న్యూఢిల్లీ, భువనేశ్వర్, హింజిలికట్, బర్గారా, బ్యాంకు అకౌంట్లు కూడా కలిసి ఉన్నాయి. స్థిరాస్తికి సంబంధించి భువనేశ్వర్ విమానాశ్రయానికి సమీపాన గల “నవీన్ నివాస్”లో రెండింట మూడొంతుల వాటా ఉంది. దీని విలువ రూ. 9,52,46,190. న్యూఢిల్లీ లోని 3, డాక్టర్ అబ్దుల్ కలాం రోడ్‌లో ఆస్తిలో 50 శాతం వాటా ఉంది. దీనివిలువ రూ. 43,36,18,000. హెచ్‌ఎఫ్‌డిసి లో రూ. కోటి ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది. రూ.9 కోట్ల విలువైన ఆర్‌బిఐ బ్యాండ్లు ఉన్నాయి.
పోస్టాఫీస్‌లో రూ. 1.50 కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. న్యూఢిల్లీ జన్‌పథ్ లో బ్యాంకులో రూ. 70.11 లక్షల డిపాజిట్లు , భువనేశ్వర్ ఎస్‌బిఐలో రూ. 20.87లక్షల డిపాజిట్లు ఉన్నాయి. రూ. 3.49 లక్షల విలువైన బంగారు నగలు ఉండగా, 1980 మోడల్ పాత అంబాసిడర్ కారు రూ. 6, 434 విలువ చేస్తుంది. ఐదుసార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పిన నవీన్ పట్నాయక్‌కు స్థిరాస్తి విలువ రూ 52.88 కోట్లు. ఇదంతా తన తల్లిదండ్రులు బిజు, గ్యాన్ పట్నాయక్ నుంచి సంక్రమించిందే.
ఇక మిగతా కోట్లకు పడగెత్తిన మంత్రుల్లో అశోక్ చంద్ర పండా, ప్రీతి రంజన్ ఘడాయి, రాణేంద్ర ప్రతాప్ సాయిన్, ప్రమీల మల్లిక్, నిరంజన్ పూజారి, ఉషాదేవి, అటను సబ్యసాచి నాయక్, రాజేంద్ర ఢోయిల్కియా, టుకుని సాహు, ప్రదీప్ కుమార్ అమత్, పికె దేవ్, బసంతి హేమాంబరం, రోహిత్ పూజారి, అశ్వినీ పాత్ర ఉన్నారు. వీరందరి కన్నా ఒడిశా ఉక్కు, గనుల మంత్రి ప్రఫుల్ల మల్లిక్ ఆస్తి విలువ కేవలం రూ.42 లక్షలే కావడం గమనించదగినది.