Tuesday, September 17, 2024

విరాళాల వెల్లువ

- Advertisement -
- Advertisement -

సిఎం సహాయనిధికి జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగ సంఘాలు రూ.33కోట్ల భారీ విరాళం
రూ.5 కోట్లు ప్రకటించిన ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
హైదరాబాద్ వరదలపై మాజీ గవర్నర్ నరసింహన్ ఆందోళన, ప్రభుత్వ సహాయక పునరావాస కార్యక్రమాలపై ప్రశంసలు
మరికొందరు సినీ ప్రముఖుల ఆపన్న హస్తం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున దాతలు ముందుకు వస్తున్నారు. బుధవారం కూడా భారీగా సిఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువగా వచ్చాయి. ఇందులో భాగంగా ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ప్రకటించింది. రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ, అనుబంధ ఉద్యోగ సంఘాలు తమ ఒకరోజు మూలవేతనాన్ని సుమారుగా రూ.33 కోట్లను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో సిఎం సహాయనిధికి బుధవారం అందచేశారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి మద్ధతుగా నిలవడానికి ముందుకువచ్చిన ఉద్యోగులకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ వి.మమత, మామిళ్ల రాజేందర్, ఏ.సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, ఆర్.ప్రతాప్, ముజీబ్‌హుస్సేనీ, ఎంబి కృష్ణయాదవ్, రవీందర్‌కుమార్ గౌడ్, అరుణ్‌కుమార్, వెంకటయ్య, ఎం.సత్యనారాయణ గౌడ్, తమటం లక్ష్మణ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఒడిషా ప్రభుత్వం రూ.5 కోట్లు
వరద బాధితులను ఆదుకునేందుకు ఒడిషా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. ఈ మేరకు సిఎంఆర్‌ఎఫ్‌కు రూ.5 కోట్లు ప్రకంటిస్తున్నట్లు ఆ రాష్ట్ర సిఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు ఆయన ఒక లేఖ ద్వారా తెలియజేశారు. కాగా స్నేహ చికెన్ అధినేత రామ్‌రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దర్శకుడు శంకర్ రూ.10 లక్షలు, టిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కును మంత్రి కెటిఆర్ అందజేశారు.
ఔదార్యాన్ని చాటుకున్న సంపూర్ణేష్ బాబు
వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు తన వంతుగా రూ.50వేలను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్‌ను మంత్రి హరీష్‌రావును కలిసి అందజేశారు.
వరదలపై మాజీ గవర్నర్ ఆందోళన
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలో నెలకొన్న పరిస్థితి పట్ల మాజీ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందించారు. సహాయ కార్యక్రమాల కోసం తన వంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి రూ.25వేలను సిఎంఆర్‌ఎఫ్‌కు అందించారు. పరిస్థితి తొందరగా కుదుట పడాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. మాజీ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు సిఎంఆర్‌ఎఫ్‌కు విరాళాలు ప్రకటించిన వారందరికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

Odisha Govt announces rs 5 Crore donate for Telangana

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News