భువనేశ్వర్: కొవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లడంతోపాటు వారి ఇళ్ల వద్దనే వేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని జిల్లాలు, పురపాలక యంత్రాంగాలను ఒడిషా ప్రభుత్వం ఆదేశించింది. కరోనా వ్యాక్సినేషన్‌ను ప్రజల ఇళ్ల వద్దనే కొన్ని జిల్లాలలో చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అటువంటి వ్యూహాలను వెంటనే నిలిపివేసి కొవిడ్-19 నిర్వహణ మార్గదర్శకాల మేరకు అనువైన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు(సివిసి) ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగించాలని ఆదేశిస్తూ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి పికె మోహపాత్ర జిల్లాల పాలనాధికారులకు బుధవారొ ఒక లేఖ రాశారు.
ప్రజల వద్దకే వ్యాక్సిన్ లేదా ఇంటి వద్దకే వ్యాక్సిన్ వ్యూహాల వల్ల టీకా వేసిన తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తితే గుర్తించడం కష్టతరం అవుతుందని, అంతేగాక వ్యాక్సిన్ వృథా జరిగే అవకాశం కూడా ఉందని మోహపాత్ర పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల ప్రకారం టీకా కోసం ప్రజలు వేచి ఉండేందుకు తగినంత స్థలం, వ్యాక్సినేషన్‌కు ప్రత్యేకంగా ఒక గది, టీకా వేసుకున్న వ్యక్తులను కనీసం అరగంట పాటు పరిశీలించేందుకు ఒక అజ్జర్వేషన్ గది ఉండే విధంగా వ్యాక్సినేషన్ సెంటర్లు ఉండాలని మోహపాత్ర తన లేఖలో తెలిపారు. భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్, కటక్ మున్సిపల్ కార్పొరేషన్, బరంపురం మున్సిపల్ కార్పొరేషన్, రూర్కెలా మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కొన్ని జిల్లా యంత్రాంగాలు ఇటీవలే డ్రైవ్-ఇన్ వ్యాక్సినేషన్ లేదా డోర్‌స్టెప్ వ్యాక్సినేషన్ చేపట్టాయి. మనుషులకు రోడ్డు మీద లేదా మాల్స్ వద్ద వ్యాక్సిన్ వేయడం సమంజసం కాదని పేర్కొంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సికి ఒక పిటిషన్ కూడా అందింది.
Odisha Govt Stops Doorstep vaccination drive