గవర్నర్ కుమారుడు తనపై దాడి చేశాడని, రాజభవన్ లోని ఓ ఉద్యోగి ఫిర్యాదు చేసిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా పూరీ లోని రాజ్‌భవన్ ఉద్యోగి తనపై గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు, అతడి స్నేహితులు దాడి చేశారని ఆరోపించారు. అయితే ఈ సంఘటనపై రాజ్‌భవన్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాను రాజ్‌భవన్‌లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఎస్‌ఒ)గా విధులు నిర్వర్తిస్తున్నట్టుగా బాధితుడు బైకుంఠ ప్రధాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జులై 7,8 తేదీల్లో రాజ్‌భవన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేస్తుండగా, ఓ వంట మనిషి తన వద్దకు వచ్చి గవర్నర్ కుమారుడు లలిత్‌కుమార్ పిలుస్తున్నట్టుగా తెలిపాడన్నారు.
దీంతో తాను లలిత్ కుమార్ గదికి వెళ్లానన్నారు. గదిలో ఐదుగురు స్నేహితులతో ఉన్న ఆయన తనను దుర్భాషలాడుతూ తీవ్రంగా కొట్టాడని పేర్కొన్నారు. వారంతా కలిసి తనను రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జాము 4.30 వరకు కొడుతూనే ఉన్నారని ఫిర్యాదు చేశారు. వారి నుంచి తప్పించుకొని మరో గదిలోకి వెళ్తే లలిత్‌కుమార్ భద్రతా అధికారులు తనని బలవంతంగా వెనక్కి తీసుకు వచ్చారని వివరించారు. నిన్ను హత్య చేసినా, ఎవరూ రక్షించేవారు లేరంటా లలిత్ కుమార్ బెదిరించాడని బాధితుడు ఆరోపించారు. బైకుంఠ ప్రధాన్ భార్య సయోజ్ ప్రధాన్ మాట్లాడుతూ తన భర్తపై దాడికి పాల్పడిన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీస్‌లు పేర్కొన్నారు.