Wednesday, January 22, 2025

పెద్ద ఎత్తున సహాయక చర్యలు

- Advertisement -
- Advertisement -

పెద్ద ఎత్తున సహాయక చర్యలు
200 అంబులెన్స్‌లు, రంగంలోకి సైన్యం
న్యూఢిల్లీ: ఒడిషాలో క్షతగాత్రులను ఆదుకునేందుకు, సహాయక చర్యలకు పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కేంద్రం, ఒడిషా, కర్నాటక, తమిళనాడు ఇతర రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరిస్తున్నాయి. భువనేశ్వర్‌లో అధికారులు మాట్లాడుతూ దాదాపు 200 అంబులెన్స్‌లు, 50 బస్సులు, 45 సంచార ఆరోగ్య శకటాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 1200 మంది ఆరోగ్య సిబ్బంది రంగంలోకి దిగింది. ప్రధాని మోడీ సంఘటనాస్థలి నుంచి కేబినెట్ సెక్రెటరీ, ఆరోగ్య మంత్రితో మాట్లాడారు. పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారికి తక్షణం చికిత్సలు నిర్వహించాలి, బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ఒడిషా రెవెన్యూ, విపత్తు నిర్వహణ మంత్రి ప్రమీలా మాలిక్‌తో మాట్లాడారు. ప్రమాద స్థలిని మరమ్మతు చేసే పనులపై కూడా ఆరాతీశారు.

ఒక్క బోగీలో వెలికితీతలు సవాలే
ప్రమాదంలో బాగా దెబ్బతిని, పూర్తిగా నేలలోకి కూరుకుపోయి ఉన్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ బోగీలోనుంచి మృతదేహాలను వెలికితీయడం సవాలుగా మారింది. లోపల ఎవరైనా బతికి ఉన్నారా? అనే విషయం తేల్చుకోవల్సి ఉంది. మరో వైపు బోగీల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు నానా పాట్లు పడుతున్నారు. లోపల చిక్కుపడ్డ వారిని సురక్షితంగా వెలికితీసేందుకు అన్ని విధాలుగా యత్నిస్తున్నట్లు ఒడిషా ప్రధాన కార్యదర్శి పికె జెనా విలేకరులకు తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. దీనికి ఆగ్నేయ రైల్వే భద్రత కమిషనర్ ఎఎం చౌదరి సారధ్యం వహిస్తున్నారు.

రంగంలోకి దిగిన సైనిక దళాలు
సహాయక చర్యల కోసం సైనిక దళాలు కూడా రంగంలోకి దిగాయి. వీరి వెంబడి ఇంజనీరింగ్, వైద్య సిబ్బంది కూడా హుటాహుటిన వెళ్లింది. పశ్చిమ బెంగాల్‌లోని బరాక్‌పోర్, పనాగర్ నుంచి సైనిక దళాలు తరలివెళ్లాయి. రెండు సైనిక హెలికాప్టర్లను కూడా తరలించారు. గాయపడిన వారిని పరిస్థితి తీవ్రతను బట్టి చికిత్సకు పంపించేందుకు ఈ హెలికాప్టర్లను వాడుతున్నారు. ఈ మార్గంలో రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు వాడే కవచ్ అందుబాటులో లేదని రైల్వే శాఖ తెలిపింది. ఇవి ఉండి ఉంటే పరిస్థితి తీవ్రత తగ్గి ఉండేది. పట్టాల పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు భారతీయ రైల్వే ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

ఘటనాస్థలికి అశ్విని, మమత, నవీన్ పట్నాయక్
ప్రధాని మోడీ ఘటనా స్థలికి రాకముందు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాంతానికి వచ్చివెళ్లారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ , ఒడిషా సిఎం నవీన్ పట్నాయక్ కూడా అక్కడికి హుటాహుటిన తరలివచ్చారు. మృతుల కుటుంబాలకు రూ పది లక్షల సాయాన్ని , తీవ్రంగా గాయపడ్డ వారికి రూ రెండు లక్షలను రైల్వే శాఖ ప్రకటించింది. తరువాత ప్రధాని ఇక్కడికి వచ్చినప్పుడు మృతుల కుటుంబాలకు అదనంగా రూ 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ 50000ను ప్రధాని సహాయక నిధినుంచి ప్రకటించారు.

ఈ ప్రాంతంలో పట్టాలు పూర్తిగా దెబ్బతిన్నాయి, బోగీలు చెల్లాచెదరుగా పడి ఉండటంతో , అనేకం తలకిందులు అయి ఉండటంతో పట్టాలను బాగుచేయడం చాలా ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. గాయపడ్డ వారితో బాలాసోర్ జిల్లా ఆసుపత్రి ఇప్పుడు యుద్ధతాకిడి ప్రాంతాన్ని తలపిస్తోంది. గాయపడ్డ వారిని స్ట్రెచర్లపై తీసుకువెళ్లుతున్నారు. తక్కువవార్డులు ఎక్కువ మంది గాయపడ్డ వారు, చాలీచాలని వైద్య సిబ్బందితో ఈ జిల్లా ఆరోగ్య కేంద్రం గందరగోళంగా మారింది. ఆసుపత్రి మార్చురి అంతా విషాదకర స్థితిలో ఉంది. ఇక ప్రమాదంలో చిక్కుపడ్డ తమ వారి పరిస్థితిని తెలుసుకునేందుకు దూర ప్రాంతాల నుంచి పలువురు తరలివస్తున్నారు. చాలా శవాలు గుర్తు పట్టని స్థితిలో ఉండటంతో వారి బంధువులవస్తే కానీ మృతులను గుర్తుపట్టడం వీలుకాదని, అందుకే వీరిని రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో పలు రైళ్లు నిలిచిపోయి ఉండటంతో వారిని ఏ విధంగా రప్పిస్తారనేది అస్పష్టంగానే ఉంది.

భద్రతను గాలికొదిలి.. లగ్జరీలకు ప్రాధాన్యతలు:కేంద్రంపై మండిపడ్డ కాంగ్రెస్
ఇప్పుడు జరిగిన దారుణ విషాదఘట్టం దేశంలోని రైళ్లలో భద్రతా ఏర్పాట్ల లోపాలను తెలియచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఆధునికత పేరిట తీసుకువస్తున్న పలు రైళ్లను కేవలం సంపన్నుల కోసం రూపొందిస్తున్నారని, ఇక సాధారణ పౌరులు, మధ్యతరగతివారు ప్రయాణించే రైళ్ల భద్రత జోలికివెళ్లడం లేదని కాంగ్రెస్ పేర్కొంది. విపక్షాలు ముందుగా జరిగిన ఘటనపై తీవ్ర విచారం, మృతులు, బాధితుల పట్ల సంఘీభావం ప్రకటించాయి. రైల్వేల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని లేకపోతే ఇటువంటి విషాదాలు చోటుచేసుకుంటాయని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఘటనపై నిర్థిష్ట గడువుతో కూడిన దర్యాప్తు చేట్టాలని బిఎస్‌పి అధినేత్రి మాయావతి సూచించారు. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య ఘటనపై స్పందించారు. ఆ ప్రాంతానికి రాష్ట్ర కార్మిక మంత్రి సంతోష్ లాడ్‌ను పంపిస్తున్నట్లు, సహాయక చర్యల పర్యవేక్షణ పనులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

బాధాకరం….కదిలించిన ఘటన:సోనియా గాంధీ స్పందన
ఒడిషాలో జరిగిన రైలు ప్రమాదం అత్యంత విషాదకరం, బాధాకరం అని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ విషాద వార్త తెలియగానే తనకుబాధకల్గిందని , గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News