భువనేశ్వర్ : అసలు ఈ ఘోర రైలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? యాంత్రిక లోపమా? మానవ కల్పితమా? తెలియని మిస్టరీగా మారిన ఒడిషాలో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనపై దర్యాప్తు వేగవంతం అయింది. ప్రధానంగా ఇక్కడి ఆటోమెటిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఎవరో కావాలనే తమ ఆధీనంలోకి తీసుకుని , దీని సంకేతాలు మార్చారనే అనుమానాలు బలోపేతం అవుతున్నాయి. దీనిని ప్రధానంగా చేసుకుని ఇప్పుడు అధికారిక దర్యాప్తు సాగుతోంది. సిబిఐ దర్యాప్తులో భాగంగా ఇప్పుడు ఇక్కడి బాలేశ్వర్ దగ్గరి బహానగా బజార్ రైల్వే స్టేషన్‌కు సీల్ వేసిన సిబిఐ కారణాలపై ఆరా తీస్తోంది. ఘోర ప్రమాదం దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొని రైల్వే చరిత్రలో అత్యంత దారుణ అధ్యాయం అయింది. దీనికి కారణం మానవ చర్య అని నిర్థారితం అయితే దీని వెనుక భారీ స్థాయి కుట్రకోణం ఉందనే విషయం స్పష్టం అవుతుంది.
ఇది దేశంలో అత్యంత విస్తారిత రైల్వే రాదార్లకు , సంబంధిత రోజువారి ప్రయాణాలకు కొరకరాని కొయ్య అవుతుంది. ఎవరో కావాలనే రైలు రూటు మార్చారా? అత్యంత వేగంగా దూసుకువచ్చే ఎక్స్‌ప్రెస్ రైలును , లూప్‌లైన్‌లో నిబంధనల ప్రకారం నిలిచి ఉన్న సరుకు రవాణా గూడ్స్ రైలును ఢీకొట్టేలా చేశారా? అనేది ఇప్పుడు దర్యాప్తు తంతులో చేపట్టిన ప్రధాన విషయంగా మారింది. సాధారణంగా రైళ్లు పలు కారణాలతో పట్టాలు తప్పుతాయి. ఈ క్రమంలో బోగీలు పక్కకు వైదొలిగి కొంత మేర ప్రాణనష్టం జరుగుతుంది. అయితే ఇందుకు భిన్నంగా ఒక లైన్‌లో వెళ్లాల్సిన రైలు మరో రూట్లోకి వెళ్లి, గూడ్స్‌ను ఢీకొని బోగీలు చెల్లాచెదురుగా పడటం,
ఇదే సమయంలో మరో వైపు నుంచి దూసుకువచ్చిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు పడి ఉన్న బోగీలను చీల్చుకుంటూ వెళ్లడం ఇంతవరకూ దాదాపుగా ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగని విపత్తు అయింది. వీటన్నింటికి కారణం కేవలం సిగ్నలింగ్ వ్యవస్థను మార్చివేసి, వందలాది మంది చనిపోవడానికి వీలు కల్పిస్తే , ఇందుకు బాధ్యులు ఎవరు? వీరి ఉద్ధేశాలు ఏమిటీ? దీని వెనుక భారీ స్థాయి కుట్ర కోణం ఉందా? అనేది ఇప్పుడు రైల్వే భద్రతా వ్యవస్థ తేల్చుకోవల్సిన కీలక ప్రశ్న అయింది.
ఈ నెల 2న జరిగిన మరమ్మతు పనులు కారణమా?
ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో రైళ్లరాకపోకలను నియంత్రించే బారియర్ సరిగ్గా పనిచేయకుండా ఉందని ఇప్పుడు వెల్లడైంది. దీనితో సిగ్నలింగ్ ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనిని మరమ్మతు చేసే పనులలో ఉన్న రైల్వే కార్మికులు తెలిసో తెలియకో ఎక్స్‌ప్రెస్ రైలు పోవడానికి వీలుగా సిగ్నలింగ్‌లో మార్పులు చేశారనే వాదన విన్పిస్తోంది. రైలు పక్కరూట్లోకి వెళ్లేలా చేయడం ద్వారా తమ మరమ్మతు పనులు వేగవంతం అవుతాయని వారు భావించి ఉంటారని, అయితే ఈ క్రమంలో తలెత్తే తీవ్ర ప్రమాదం గురించి వారికి అవగావహన ఉందా? అనేది ప్రధాన ప్రశ్న అయింది. అయితే కార్మికుల చర్యకు సంబంధించిన ఈ విషయంపై అధికారికంగా ఇప్పటివరకూ ఎటువంటి నిర్థారణ జరగలేదు.
యాంత్రిక లోపాలపైనే ముందుగా ప్రచారం
ప్రమాదం తరువాత ఇదంతా అంతా కూడా కేవలం సిగ్నలింగ్ వ్యవస్థలో తలెత్తిన లోపాల వల్లనే జరిగిందని జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో వార్తలు వెలువడ్డాయి. రైళ్లు సాగేందుకు ముందుగా గ్రీన్ లైట్ తరువాత వెంటనే రెడ్ సిగ్నల్ రావడం ఈ క్రమంలో అప్పటికే దూసుకువెళ్లిన రైలు పక్కట్రాక్‌లోకి దూకుడుగా వెళ్లిన ఫలితం చేదు అనుభవానికి దారితీసిందని ముందు అంతా భావించారు. అయితే దీనిని మించిన కారణాలు ఉన్నాయని ఇప్పుడు వాదనలు వెలువడుతున్నాయి. తరచూ ఈ ప్రాంతంలో సిగ్నలింగ్ వ్యవస్థలో భారీ స్థాయిలో లోపాలు ఏర్పడుతూ వస్తున్నాయని తొలుత రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. సిగ్నలింగ్ వ్యవస్థ ఆటోమొటిక్ పద్ధతిలోనే ఉంది కానీ దీనిని ఈ క్షణాలలో ఎవరో దీని సిగ్నల్‌ను మార్చి ఉంటారనేది కూడా ఈ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే పలు స్థాయిల్లో దర్యాప్తు జరుగుతున్నందున ఇటువంటి వాటిపై తాము స్పందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వ్యాఖ్యానించేందుకు రైల్వేల అధికారిక భద్రతా వ్యవస్థ అయిన సిఆర్‌ఎస్ నిరాకరించింది.