న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒడిశా రైలు దుర్ఘటనకు అనుమతులు లేని మరమ్మతులు చేపట్టడమే కారణమని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ వెల్లడించింది. సిగ్నల్ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అరుణ్ కుమార్ మహంత ఉన్నతాధికారుల నుంచి సరైన అనుమతులు తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో మరమ్మతులు చేయించారని తెలిపింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయస్థానానికి సిబిఐ వివరించింది. రైలు దుర్ఘటనకు సంబంధించి సిబిఐ అరెస్టు చేసిన ముగ్గురిలో ఒకరైన అరుణ్ కుమార్ మహంత తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ భువనేశ్వర్‌లోని సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దీనిని సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించింది.
బహానగా బజార్ స్టేషన్ సమీపంలో ప్రమాదం జరిగిన 94వ క్రాసింగ్ లెవెల్ గేట్ వద్ద మరమ్మతు పనులు మహంత సమక్షంలోనే జరిగాయని కోర్టుకు వివరించింది. దీనికోసం ఆయన సీనియర్ డివిజినల్ ఇంజినీర్ నుంచి అనుమతులు గానీ, సర్క్యూట్ చిత్రంగానీ తీసుకోలేదని తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. మహంత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న లెవెల్ క్రాసింగ్ గేట్ గత కొంత కాలంగా సరిగా పని చేయడం లేదని, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. పర్యవేక్షణ పనిని ఇతర వ్యక్తులకు అప్పగించారని, అందువల్ల ప్రమాదానికి మహంత బాధ్యుడు కాదని అన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం మహంతకు బెయిల్ నిరాకరించింది.