కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ కంపెనీలు 100 శాతం జీవ ఇంధన వాహనాల తయారీకి మారాలన్న నిబంధనను మరో ఆరు నెలల్లో తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. దాంతో, వినియోగదారులకు ఖర్చు తగ్గుతుందని, విదేశీమారకం నిల్వలు పెరుగుతాయని గడ్కరీ అన్నారు. లీటర్ పెట్రోల్ ధర రూ.110 ఉండగా, లీటర్ బయోఇథనాల్ ధర రూ.65 మాత్రమేనని ఆయన తెలిపారు. ఎలారా కేపిటల్ నిర్వహించిన సదస్సులో ఆటోమొబైల్ రంగంలో చేపట్టే సంస్కణలను గడ్కరీ వివరించారు. మరో ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఇంజిన్ల తయారీకి మారాల్సిందిగా ఆటోమొబైల్ కంపెనీలను ఆదేశించనున్నట్టు ఆయన తెలిపారు. వరి, జొన్న, మొక్కజొన్న, చెరుకులాంటి పంటల దిగుబడులు పెరిగినందున జీవ ఇంధనం తయారీకి కొరత ఉండదని గడ్కరీ తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ కూడా వేగవంతమైందని ఆయన తెలిపారు. మరో ఏడాదిలో ఆ వాహనాలు దేశంలోని రహదారులపైకి పెద్దసంఖ్యలో రానున్నాయని గడ్కరీ అన్నారు.