మనతెలంగాణ/ హైదరాబాద్ : ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి అధికారిని నియమించే ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ‘మేరా బూత్, సబ్ సే మజ్‌బూత్‘ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కాచిగూడ భూమన్నగల్లీలోని పలు అపార్ట్‌మెంట్‌లో పోలింగ్ బూత్‌లో ఓటర్ వెరిఫికేషన్, ఎన్‌రోల్‌మెంట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులకు ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితాలో నమోదు సంబంధిత దరఖాస్తు ఫారాలు, అడ్రస్ మార్పు, యువ ఓటర్ల నమోదు తదితర సేవలను వినియోగించుకోవచ్చని చెప్పారు. జాబితాలో తప్పులు సరిదిద్దుకోవడంతో పాటు 18 ఏళ్లు పైబడిన వారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. తనకు ఓటు హక్కు కలిగిన బర్కత్‌పురా పోలింగ్ బూత్‌లోని కొన్ని బస్తీలు, కాలనీ ప్రజల్లో తాను అవగాహన కల్పించానని తెలిపారు.