Friday, September 20, 2024

కబ్జాదారులపై కొరడా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తప్పుడు భూరికార్డులు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసిన అక్రమార్కులపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ) చర్యలు చేపట్టింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్‌ఎండిఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నిస్తున్నారు. సంబంధంలేని సర్వే నెంబర్లు చూపించి హెచ్‌ఎండిఏ ఆధీనంలో ఉన్న భూముల్లో పొజిషన్ కోసం ప్రయత్నించారు. హెచ్‌ఎండిఏ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సహకారంతో ఆపరేషన్ శంషాబాద్‌ను విజయవంతం చేశారు. ఈ ఆపరేషన్‌లో దాదాపు వంద మంది పాల్గొన్నారు. హెచ్‌ఎండిఏ ఎస్టేట్ అధికారులు, సిబ్బంది 15 మంది, హెచ్‌ఎండిఏ ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారులు, సిబ్బంది 50 మంది, సైబరాబాద్ పోలీస్ అధికారులు, సిబ్బంది 20 మంది పాల్గొన్నారు.

20 ఎకరాల్లో హెచ్‌ఎండిఏ నర్సరీ ఏర్పాటు

పక్కా ప్రణాళికతో సోమవారం రాత్రి శంషాబాద్ ప్రాంతానికి చేరుకున్న హెచ్‌ఎండిఏ యంత్రాంగం రహదారులను బ్లాక్ చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ ఆక్రమణలను కూల్చివేసింది. వాస్తవానికి శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములను హెచ్‌ఎండిఏ 1990 సంవత్సరంలో అప్పటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ అక్వీజేషన్ కింద హెచ్‌ఎండిఏ సేకరించింది. శంషాబాద్‌లోని ఈ భూములపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఏ)కు సర్వహక్కులు ఉన్నాయి. ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్‌ఎండిఏ గతంలో నర్సరీ ఏర్పాటు చేసింది.

రెండు ఎకరాల భూమి వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ల కోసం

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్‌ఎండిఏకు సంబంధించిన 181 ఎకరాల్లో రెండు ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్‌ఎండిఏ కు సంబంధించిన ఈ భూముల నుంచి ముప్పై(30) గుంటల భూమిని కేటాయించారు. ఈ నేపథ్యంలోనే కొందరు ఆ భూములపై కన్నేసి వాటిని కాజేయడానికి ప్రయత్నించగా హెచ్‌ఎండిఏ అధికారులు వెంటనే స్పందించి ఈ ఆపరేషన్ విజయవంతం చేశారు. తదుపరి చర్యల్లో భాగంగా హెచ్‌ఎండిఏ భూముల చుట్టూ బుధవారం నుంచి ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News