ఆరున్నర గంటలపాటు విచారించిన ఎసిబి కెటిఆర్‌తో
పాటు న్యాయవాది రామచంద్రరావుకు అనుమతి
దానకిషోర్, అర్వింద్‌కుమార్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా
విచారణ పలు కీలకాంశాలపై వివరణ కోరిన ఎసిబి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫార్ము లా ఈ కార్ రేసింగ్ కేసులో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఎసిబి విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం నందినగర్‌లోని నివాసం నుంచి కెటిఆర్ ఎసిబి కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎసిబి విచారణ ప్రారంభమైంది. కెటిఆర్‌తో పాటు న్యాయవాది రామచంద్రరావు ఎసిబి కార్యాలయంలోనికి అనుమతించారు. హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ గదిలో కెటిఆర్‌ను, న్యాయవాదిని లైబ్రరీలో కూర్చోబెట్టేందుకు ఎసిబి ఏర్పాట్లు చేసింది. దాదాపు ఆరున్నర గంటల పాటు ఎసిబి అధికారులు కెటిఆర్‌ను ప్రశ్నించారు. సాయంత్రం 5.15 గంటల సమయంలో కెటిఆర్ ఎ సిబి కార్యాలయం నుంచి బయటకు వ చ్చారు. ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఎసిబి అధికారులు కెటిఆర్‌కు సూచించారు.
కేసు దర్యాప్తు అధికారి డిఎస్‌పి మజీద్ ఖాన్ కెటిఆర్ ను విచారించగా, ఎసిబి జాయింట్ డై రెక్టర్ రితిరాజ్ విచారణను పర్యవేక్షించారు. ఈ విచారణను వేరే గదిలో నుం చి కెటిఆర్ న్యాయవాది రామచంద్రరా వు చూసేలా ఏర్పాట్లు చేశారు. ఫార్ము లా ఈ రేసు కేసులో కెటిఆర్‌పై అనేక ఆరోపణలు రాగా, అవి నిరూపించడానికి ఎసిబి అధికారులు విచారణ చేపట్టారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ ప్రా జెక్టులో నియమాలను ఉల్లంఘించి రూ.55 కోట్లు ఎఫ్‌ఇఒకు బదిలీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.గత కొన్ని రోజులుగా ఈ కేసు చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విచారణ సందర్భంగా మధ్యాహ్నం 1. 30 గంటలకు ఎసిబి అధికారులు లం చ్ బ్రేక్ ఇచ్చారు. లంచ్ తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైంది. లంచ్ బ్రేక్ వరకు మూడు గంటల పాటు కెటిఆర్ ఎసిబి అధికారులు విచారించారు. ఫార్ములా ఈ- కార్ రేస్లో జరిగిన నగదు చెల్లింపులపై కెటిఆర్ మధ్యాహ్నం వరకు ఎసిబి 15 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
దానకిశోర్,అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్స్ ఆధారంగా విచారణ..?
విచారణ సందర్భంగా ఎసిబి అధికారులు పలు కీలక ప్రశ్నలను కెటిఆర్ ముందు ఉంచినట్లు తెలిసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఎసిబి అధికారులు కెటిఆర్‌ను విచారించినట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ నిధుల దుర్వినియోగంపైనే వరుసగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేసులో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి మళ్లింపుపై కెటిఆర్‌ను అధికారులు ప్రశ్నించారు. ఆ నిధులను ఎందుకు మళ్లించారు.. నిబంధనలు పాటించారా.. నిధుల మళ్లింపుకు ఆర్థిక శాఖ అనుమతి ఉందా.. ఫార్ములా ఈ రేసులో రూ. 55 కోట్లు విదేశీ కంపెనీకి ఎందుకు చెల్లించారు..ఇది నిబంధనలకు విరుద్దమని మీకు తెలియదా..? ఆర్‌బిఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు…కేబినెట్ ఆమోదం లేకుండానే నిధులు ఎందుకు మళ్లించారు..?..ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేదనుకున్నారా..అగ్రిమెంట్లు, చెల్లింపులన్నీ మీ ఆధ్వర్యంలోనే జరిగాయా..? …మీ ఆదేశాల మేరకే నగదు బదిలీ చేశామని అధికారులు చెపుతున్నారని, దానికి మీ సమాధానం ఏంటి..? అంటూ ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.
కీలక అంశాలను కెటిఆర్‌ను ప్రశ్నించిన ఎసిబి అధికారులు
ఫార్ములా ఈ- కార్ రేస్ కేసు విచారణ సందర్భంగా ఎసిబి అధికారులు పలు కీలక అంశాలపై కెటిఆర్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ కార్ రేసు నిర్వహణలో మీ పాత్ర ఏంటి..? ఆర్గనైజర్లకు నగదు చెల్లింపులు మీ ఆధ్వర్యంలోనే జరిగాయా..? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో చెల్లింపులు ఎందుకు చేశారు..? నగదు చెల్లింపుల్లో క్యాబినెట్ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు..? హెచ్‌ఎండీఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు తెలిసే చెల్లింపులు జరిగాయా..? పౌండ్స్ రూపంలో ఇండియన్ కరెన్సీ విదేశీ అకౌంట్స్‌కు చెల్లించినపుడు ఆర్‌బిఐ అనుమతి లేదు.. అసలు అనుమతులు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది..? మీరు సక్సెస్ ఫుల్ ఈవెంట్‌గా భావిస్తున్న ఈ కార్ రేస్‌లో ప్రమోటర్స్ ఎందుకు వెనక్కి తగ్గారు..? అని కెటిఆర్‌ను ఎసిబి అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. అసలు హైదరాబాద్‌లో ఫార్ములా రేస్ ప్రతిపాదన ఎవరిది ..? ఈ ప్రతిపాదనను ఎవరు ఆమోదించారు…హైదరాబాద్‌లోనే ఈ ఫార్ములా రేస్‌ను ఎందుకు నిర్వహించాలనుకున్నారు..?…రేస్ నిర్వహించడం వలన ప్రభుత్వానికి ఏమైనా ప్రయోజనం లభించిందా..ఎఫ్‌ఈవో కంపనీకే ఎందుకు ఈ రేస్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు…
నగదు బదిలీ చేస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు హెచ్చరించారా…నగదు బదిలీ అనే అంశం నిబంధనలకు విరుద్ధం అనేది అధికారులు మీ దృష్టికి తీసుకొచ్చారా… నిబంధనలు పట్టుంచుకోకుండా 55 కోట్లు నగదు ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది…నగదు బదిలీ చేసే సమయంలో నిబంధనలు పట్టించుకోవద్దని మీరే చెప్పారా..అరవింద్ కుమార్ మాత్రం మీ ఆదేశాలతో నగదు బదిలీ చేశామని వాంగ్మూలం ఇచ్చారు… దీనికి మీ సమాధానం ఏంటి…గ్రీన్ కో కంపనీ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగింది..స్పాన్సర్ షిప్‌లో ఉన్న కంపనీ మీకు ఎలక్టోరల్ బాండ్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది..ఈ స్పాన్సర్ షిప్ ద్వారా ఆ కంపినీకి ప్రయోజనం చేకూరిందా..? అంటూ ఎసిబి ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. మీపై మోపిన అభియోగాలపై మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు..? నగదు బదిలీ అంశం కేబినెట్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు..? కేబినెట్ నుంచి అనుమతులు లేకుండా ఎలా బదిలీ చేస్తారు…? …బదిలీ అయిన నగదు తిరిగి హెచ్‌ఎండిఎ ఖాతాకు వచ్చిందా లేదా…? మీకు సమాచారం ఏమైనా ఉందా ..? అంటూ వరుసగా ఎసిబి అధికారులు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.