Thursday, January 23, 2025

జెట్ ఇంధనం, ఎల్‌పీజీ వాణిజ్య గ్యాస్ ధరల పెంపు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా జెట్ ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయెల్ ) , ఎల్‌పిజీ వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయి. జెట్ ఇంధనం ధర 5.1 శాతం పెరిగింది. కిలో లీటరుకు రూ.5779.84 వంతున పెంచుతున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ. 1,12,419 నుంచి రూ.1,18,199 కు చేరుకుంది. కోల్‌కతాలో కిలో లీటరుకు రూ.1,26,697.08,ముంబై కిలో లీటర్ రూ. 1,10,592.31కి, చెన్నైలో కిలో లీటర్ రూ. 1,22,423. 92 కు పెరిగింది. సెప్టెంబర్ 1న కూడా ఎటిఎఫ్ ధరల్లో పెరుగుదల నమోదైంది.

జులై 1న కూడా ఏటీఎఫ్ ధర 1.65 శాతం పెంచారు. ఇలా జెట్ ఇంధనం ధర పెరగడం వరుసగా నాలుగోసారి. జెట్ ఇంధనం పెరగడానికి ప్రధాన కారణం ముడి చమురు ధర పెరగడం. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర భారీగా పెరిగి 97 డాలర్లకు చేరుకుంది. జులై నుండి ఇప్పటివరకు ముడి చమురు ధర 30 శాతం పెరిగింది. సెప్టెంబరు లోనే ఏకంగా 15 శాతం పెరిగింది. అక్టోబర్ ప్రారంభం కావడంతో మరికొద్ది రోజుల్లో పండగల సీజన్ ప్రారంభం కానుంది. అందువల్ల ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమాన ఛార్జీలపై కూడా కనిపిస్తుంది.

ఇక వాణిజ్య సిలిండర్లపై అదనపు భారం
19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రెండు నెలలుగా తగ్గుతూ వచ్చిన ధర ఈసారి మాత్రం రూ. 209 కి పెరిగింది. అంతకు ముందు ఆగస్టు , సెప్టెంబర్ నెలల్లో దాదాపు రూ. 250 మేర తగ్గాయి. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1731కు పెరిగింది. అంతకు ముందు ఇది రూ. 1522 గా ఉంది. చెన్నైలో రూ. 1898, కోల్‌కతాలో రూ. 1839, ముంబైలో రూ. 1684 కు, చేరింది.

కొత్త ధర ఆదివారం నుంచే అమలులోకి వస్తుందని చమురు సంస్థలు వెల్లడించాయి. కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్‌ధర సెప్టెంబర్ 1న రూ.157.5 తగ్గింది. అంతకు ముందు ఆగస్టు 1న రూ.100 మేర తగ్గింది. ఇలా రెండు నెలలు తగ్గిన ధరలు తాజాగా ఒక్కసారిగా రూ. 200 కు పైగా పెరగడంతో వాణిజ్య సిలిండర్ వినియోగదారులపై భారం పడినట్టయింది. ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర మారలేదు. ఆగస్టు 30న వీటి ధర రూ. 200 తగ్గిన విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News