Monday, December 23, 2024

20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయిల్‌పామ్ తోటల సాగును 20లక్షల ఎకరాల్లో చేపట్టాలని లక్షంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన శాఖల మంత్రి నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. శనివారం శాసనసభలో సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్ లు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్ రెడ్డి బదులిచ్చారు. ఎంతో ముందుచూపుతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలో తలసరి వంటనూనెల వినియోగం సాలీనా 19 కిలోలు ఉందన్నారు. దేశంలో 250 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల వినియోగం అవుతుండగా, దేశంలో ఉత్పత్తి అవుతున్న వంటనూనెలు 130 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని తెలిపారు. మిగిలిన వంటనూనెలు అన్నీ విదేశాల నుండి దిగుమతి అవుతున్నాయని వివరించారు.

1992 నుండి ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం మందకొడిగా సాగుతూ వచ్చిందని తెలిపారు. వంటనూనెల్లో స్వయంపోషకం కావాలంటే దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాల్సి ఉందని వెల్లడించారు. అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ తోటలను సాగు చేయించాలని లక్షంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 40 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు వుండేదని తెలిపారు. ఏడాదిలో లక్ష 18 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయించామని, నూతనంగా 2023 -24లో 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని , దీని కోసం రూ.750 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు.

ఎకరాకు రూ.50,918 చొప్పున సబ్సిడీ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుకు ప్లాంట్ మెటీరియల్, ఇంటర్ క్రాప్ – ఇన్ ఫుట్స్, బిందు సేద్యం కోసం అందించడం జరుగుతున్నదని తెలిపారు. ఒక రైతుకు 12.5 ఎకరాల వరకే సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం పరిమితి విధించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆ పరిమితి సవరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 38 ఆయిల్ పామ్ నర్సరీలు ఏర్పాటు చేశామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలో భూమి కేటాయింపు చేశామని తెలిపారు. ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకువచ్చిన వారికి ఆయా జిల్లాలలో భూములు ప్రభుత్వం కేటాయిస్తుందని తెలిపారు. ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ (ఒఇఆర్) ఆధారంగా ఆయిల్ పామ్ ధర నిర్ణయించడం మూలంగా పామాయిల్ గెలలకు టన్నుకు రూ.17 వేల పై చిలుకు ధర పలుకుతున్నదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News