Friday, January 10, 2025

రష్యా నుంచి చవగ్గా చమురు!

- Advertisement -
- Advertisement -

CM KCR Federal movement

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటి మీద ప్రభావం చూపుతుందని అనుకున్నదే. ప్రాథమికంగా ఆ రెండు దేశాల నుంచి దిగుమతి చేసుకునే సరకుల సరఫరాలో అంతరాయమేర్పడి వాటి ధరలు పెరుగుతాయని ఊహించిందే. అంతకు మించి ఈ యుద్ధం ప్రపంచ దేశాల మధ్య ద్రవ్యపరమైన సంబంధాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. రష్యాపై అమెరికా, దాని మిత్ర దేశాలు విధించిన ఆంక్షలే ఇందుకు కారణం కాబోతున్నాయి. ఇరాన్, ఉత్తర కొరియా, క్యూబా, వెనిజులా వంటి దేశాలపై అమెరికా ఆంక్షలు అక్కడి జనాన్ని అనేక కష్టాల పాలు చేస్తున్నాయి. కాని రష్యాపై విధించిన ఆంక్షలు అమెరికాకు ఎదురు తిరుగుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతులపై నిషేధం విధించాలని అమెరికా నిర్ణయించినప్పుడు దాని మిత్ర యూరప్ దేశాలు అందుకు నిరాకరించాయి.

చివరికి ఈ విషయంలో అమెరికా వొంటరి కాక తప్పలేదు. అమెరికన్ డాలరు అంతర్జాతీయ మారకపు కరెన్సీగా స్థిరపడిపోయిన తర్వాత తాను, తన మిత్రదేశాలు ఎవరిపైనైతే ఆంక్షలు విధిస్తాయో ఆ దేశాలతో ఇతర ఏ దేశమూ ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు పెట్టుకోడానికి సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. అలా పెట్టుకుంటే అవి కూడా ఆంక్షల పరిధిలోకి జారిపోక తప్పడం లేదు. గతంలో ఇరాన్ నుంచి సునాయాసంగా చమురు పొందుతూ వచ్చిన భారత దేశం కూడా అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై విధించిన ఆంక్షల కొరడా దెబ్బను తినవలసి వచ్చింది.

దానికి భయపడి ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే ఆయిల్ కిమ్మత్తును విశేషంగా తగ్గించుకొని ఇండియా నష్టపోయింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా ఆయా దేశాలు ఏదో విధంగా తట్టుకొని గట్టెక్కగలుగుతున్నాయంటే చైనా, రష్యాలు వాటితో సంబంధాలను కొనసాగిస్తుండడమే కారణం. యుద్ధం మొదలైన తర్వాత కొద్ది రోజుల పాటు తటపటాయించిన అమెరికా చివరికి అంతర్జాతీయ బ్యాంకింగ్ సంబంధాల సారథి అయిన స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలి కమ్యూనికేషన్స్) నుంచి రష్యాను తొలగించింది. దీనితో డాలర్ మారకపు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రష్యా వెలికి గురైంది.రష్యా బ్యాంకులేవీ డాలర్ ఆధారిత వాణిజ్య కార్యకలాపాల్లో పాలు పంచుకోలేని స్థితి తలెత్తింది. ఇందుకు రష్యా చలించలేదు. తనకున్న వనరుల అవసరం చాలా దేశాలకు వుంది. అలాగే అనేక దేశాలతో దానికి సత్సంబంధాలున్నాయి. డాలర్‌తో నిమిత్తం లేకుండా ఆయా దేశాల కరెన్సీల పైనే వాటితో ఇచ్చిపుచ్చుకునే సంబంధాలు పెట్టుకునేందుకు అది చొరవ చూపుతున్నది. అంటే భారత దేశానికి విక్రయించబోయే సరుకును తన కరెన్సీ అయిన రూబుల్ రూపాయి విలువల ఆధారంగా అమ్మడానికి అది సిద్ధపడుతున్నది.

ఇలాగే తన వద్ద నుంచి దిగుమతులు చేసుకునే లేదా తనకు సరకులను విక్రయించే ఇతర దేశాలతో కూడా నేరుగా వాటి వాటి కరెన్సీల ఆధారంగా వాణిజ్యం నెరపుకోవచ్చుననే ధీమా దానిలో కనబడుతున్నది. ఈసరళి పుంజుకుంటే అమెరికన్ డాలర్ అవసరం తగ్గి దాని ప్రభావం నుంచి అనేక దేశాలు బయటపడతాయి. అది డాలర్ దారుణంగా నీరసించిపోడానికి దారి తీస్తుంది. ఈ వైపుగా ప్రస్తుతం భారత దేశంతో వాణిజ్యానికి రష్యా రంగం సిద్ధం చేసింది. ఇండియాకు 3.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌ను అత్యంత చవకగా ఇవ్వడానికి రష్యా సంకల్పించింది. రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులు కూడా తానే భరించి ఈ ముడి చమురును ఇండియాకు అందజేయడానికి నిర్ణయించింది. నేడో రేపో ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నా యి. అన్ని ఖర్చులు భరించి అతి తక్కువ ధరకు క్రూడాయిల్‌ను తనకు రష్యా ఇవ్వజూపుతున్నప్పుడు ఇండియా ఎంత మాత్రం వెనుకాడవలసిన పని లేదు. ఈ ఒప్పందంపై సహజంగానే అమెరికా అసంతృప్తిని ప్రకటించింది. అయితే అటు తనను కాదని యూరప్ దేశాలు రష్యా నుంచి చమురును, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నప్పుడు ఇండియా ఆ పని చేస్తే అడ్డుకునే హక్కు అమెరికాకు ఎలా వుంటుంది?

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఖండిస్తూ భద్రతా మండలిలో తీర్మానం ప్రతిపాదించినప్పుడు దానిపై ఓటింగ్‌కు భారత దేశం గైర్హాజరయింది. యుద్ధం విషయంలో తటస్థ పాత్ర పోషించింది. రష్యా నుంచి విశేషంగా ఆయుధాలు కొంటున్న గతంలో దాని నుంచి గణనీయమైన మద్దతు పొందిన భారత దేశం దాని పట్ల శత్రువైఖరిని సులభంగా వహించజాలదు. ఇప్పుడు రష్యా ఇవ్వజూపుతున్న 3.5 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ కిమ్మత్తు వాస్తవానికి భారత దేశ అవసరాల్లో ఆవంతే. 85 శాతం క్రూడ్ అవసరాలకు దిగుమతులపై ఆధారపడుతున్న ఇండియా అందులోని 2 శాతం చమురును మాత్రమే రష్యా నుంచి కొంటున్నది. భారత దేశం ప్రతి రోజూ వినియోగించే క్రూడాయిల్ కిమ్మత్తు 4.5 మిలియన్ బ్యారెళ్లు. రష్యా ఇవ్వజూపుతున్న ఆయిల్ అతి స్వల్పమే అయినప్పటికీ దానిని ఇండియా తీసుకోడం అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను కొత్త మలుపు తిప్పుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News