యంగ్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ఒకే ఒక జీవితం. నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతోంది. ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదకానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ చిత్రంలోని నటీనటుల మాతృమూర్తులు ఈ వేడుకకు హాజరవ్వడం ఆకట్టుకుంది. ఈ వేడుకలో అమల అక్కినేని మాట్లాడుతూ “ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. కుటుంబ సభ్యులతో కలసి చూసే సినిమా ఇది. మీ మనసుల్ని హత్తుకునే సినిమా ఇది”అని అన్నారు. శర్వానంద్ మాట్లాడుతూ “ఇంత అద్భుతమైన సినిమా తీసిన దర్శకుడు శ్రీకార్తిక్‌కి కృతజ్ఞతలు. శ్రీకార్తిక్ పెద్ద దర్శకుడు అవుతాడు.అమల లేకుండా ఈ సినిమా ఊహించలేను. ఆమెతో కలసి నటించడం గౌరవంగా భావిస్తాను. రీతూ వర్మ కథని నమ్మి ఈ సినిమా చేశారు. ఇందులో సరికొత్త వెన్నెల కిషోర్‌ని చూస్తారు. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూపిస్తున్నాం” అని తెలిపారు. శ్రీకార్తిక్ మాట్లాడుతూ “తల్లి కొడుకుల ప్రయాణాన్ని విలక్షణమైన శైలిలో మనసుని హత్తుకునేలా చూపే చిత్రం ’ఒకే ఒక జీవితం’. వినోదం, మంచి పాటలు, ఎమోషన్స్, కాలంతో ప్రయాణం, గొప్ప సందేశం వున్న చిత్రమిది. ఈ కథతో అందరూ కనెక్ట్ అవుతారు. శర్వానంద్ తన నటనతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. అమల ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం నా అదృష్టం. రీతూ వర్మ మరో అద్భుతమైన పాత్రలో మిమ్మల్ని అలరిస్తారు. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, నాజర్ పాత్రలు ఈ కథలో కీలకం. వారి అనుభవంతో కథని బలంగా తీర్చిదిద్దారు. సిరివెన్నెల లాంటి లెజండరీ రచయిత రాసిన అమ్మ పాట చిరకాలం నిలిచిపోతుంది”అని పేర్కొన్నారు. ఈ వేడుకలో రీతూ వర్మ, ఎస్‌ఆర్ ప్రభు, ప్రియదర్శి, కృష్ణ చైతన్య, జేక్స్ బిజోయ్, శ్రీజిత్ సారంగ్, సుజిత్ సారంగ్ పాల్గొన్నారు.
Oke Oka Jeevitham Movie Pre Release Event