క్లాసిక్ సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సునీత, శృతిక, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్రం పోస్టర్, టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ జేడీ లక్ష్మీనారాయణ, తెలంగాణ ఎమ్మెల్సీ బి. దయానంద్‌లు విచ్చేశారు. జేడీ లక్ష్మీనారాయణ సినిమా పోస్టర్, టీజర్‌లను ఆవిష్కరించారు. అనంతరం చిత్రంలోని 5 పాటల్లోంచి 4 పాటలను ప్రదర్శించారు.
ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ…
సహజంగా నేను సినిమా ఈవెంట్‌లకు రాను. అయితే వెంకన్నగారు పోలీస్ ఆఫీసర్ మీద తీసిన అని చెప్పారు. అలాగే ట్రైలర్ కూడా చూపించారు. అది చూసిన తర్వాత ఇంప్రెస్ అయి ఈ కార్యక్రమానికి రావటానికి అంగీకరించాను. ఈ వయసులో వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్ పోలీస్ క్యారెక్టర్ చేయడం గ్రేట్. ఇప్పుడు ప్రదర్శించిన పాటలు కూడా వేటికవే చాలా బాగున్నాయి. సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, కెమెరా వర్క్ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా విజయంతో వెంకన్నగారు సమాజానికి ఉపయోగపడే మరిన్ని సినిమాలు నిర్మించాలని కోరుకుంటూ యూనిట్ అందరికీ ఆల్‌ది బెస్ట్ చెబుతున్నాను అన్నారు.
ఎమ్మెల్సీ బి. దయాకర్ మాట్లాడుతూ…
వెంకన్నగారు పారిశ్రామికవేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఇప్పుడు సినిమా రంగంపై దృష్టిపెట్టి సమాజానికి ఉపయోగపడేలా ఓ పోలీస్ ఆఫీసర్ కథను ఎంచుకోవడం నిజంగా అభినందనీయం. ఆయన ఈ సినిమాతో విజయం అందుకుని మరిన్ని సినిమాల్లో నటించాలని, నిర్మించాలని కోరుకుంటున్నా అన్నారు.
చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ…
ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడకు విచ్చేసిన జేడీ లక్ష్మీ నారాయణ గారికి, ఎమ్మెల్సీ దయానంద్ గారికి, దర్శకులు రేలంగి నరసింహారావు గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మరియు నా మిత్రులు, శ్రేయోభిలాషులకు, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్, ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ వయస్సులో నేను హీరోగా చేయడం ఏంటి అనుకోలేదు.
మన టాలీవుడ్ సీనియర్ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్ చేశారు. తుమ్మపల్లి రామసత్యనారాయణ గారు సినిమా పరిశ్రమలో సక్సెస్ రేటు 5 శాతానికి మించి లేదు కదా.. హాయిగా వ్యాపారాలు చేసుకోక ఎందుకు అన్నారు. ఆ 5 శాతంలో నేను ఎందుకు ఉండ కూడదు అన్నాను. ఆయన ఈ సినిమాకు సంబంధించి చాలా మంచి సలహాలు ఇచ్చారు. అలాగే థియేట్రికల్ రిలీజ్ విషయంలో కూడా హెల్ప్ చేస్తున్నారు. ఈ సినిమాను హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…
వెంకన్నగారిలో ఇంత ప్యాషన్ ఉందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా మంచి నటుడు అవుతారు. చిన్న బడ్జెట్‌తో పెద్ద సినిమా తీశారు. ఆయన నాతో అన్నట్టు సక్సెస్ అవుతున్న 5 శాతం మందిలో ఈయన కూడా ఉంటారు. పాటలు, సంగీతం, కొరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ…
నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినప్పుడు ఇదేదో చిన్న సినిమాలే అనుకున్నాను. కానీ ఇప్పుడు తెరమీద ట్రైలర్, పాటలు చూస్తే ఓ పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. యూనిట్ అంతా సమష్టిగా కృషి చేశారు. అది తెరమీద కనిపిస్తోంది. నిర్మాత ఆర్థిక భరోసా అందిస్తే టెక్నీషియన్స్ సినిమాను ఏ రేంజ్‌కు తీసుకెళ్తారో ఈ సినిమా నిరూపిస్తోంది. అందరికీ మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నా అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర యూనిట్‌తో పాటు ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, యంగ్ హీరో క్రిష్, చిత్ర హీరోయిన్‌లు, తల్లాడ వెంకన్న శ్రేయోభిలాషులు సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రసంగించారు.