Monday, December 23, 2024

జల్సాల కోసం ప్రియుడితో కలిసి స్కెచ్ వేసిన యువతి

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వృద్ధురాలి హత్య కేసు మిస్టరీని హయత్‌నగర్ పోలీసులు చేధించారు. జల్సాల కోసం వృద్ధురాలిని హత్య చేసి బంగారం చోరీ చేసిన ప్రియుడు, ప్రియురాలిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 23తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బి నగర్ డిసిపి సాయిశ్రీ తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హయత్‌నగర్, తొర్రూర్‌కు చెందిన ఓల్డ్ బస్తీకి చెందిన సామ్‌రెడిడ సత్తెమ్మ(82) ఒంటరిగా ఉంటోంది. వృద్ధురాలి ఇంట్లో గూడపాటి లలిత(34) అద్దెకు ఉంటోంది. నారాయణపేట జిల్లా, దామెరగిడ్డ గ్రామానికి చెందిన ఎండ్ల రాకేష్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన సోదరుడి ఇంటి వద్ద ఉంటున్నాడు.

డిగ్రీ వరకు చదువుకున్న రాకేష్ నారాయణపేటలో ముత్తూట్ ఫైనాన్స్‌లో క్యాషియర్‌గా ఉద్యోగంలో చేరాడు. తర్వాత నగరానికి బదిలీ కావడంతో తొర్రూర్‌లో తన సొదరుడు కొత్తగా నిర్మించిన ఇంట్లో ఉంటున్నాడు. ఈ సమయంలో తన సోదరుడి ఇంటికి సమీపంలోని సత్తెమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్న లలితతో పరిచయం ఏర్పడింది. తరచూ తన సోదరుడి ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్‌లో ఛాటింగ్ చేసుకునేవారు. రాకేష్ తరచూ వృద్ధురాలు సత్తెమ్మ ఇంటికి వెళ్లి టివి చూసేవాడు, ఆమెతో మాట్లాడేవాడు. వృద్ధురాలు చెప్పిన చిన్న చిన్న పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే లలిత, రాకేష్‌కు వృద్ధురాలి బంగారు ఆభరణాలపై కన్నుపడింది. ఎలాగైన వాటిని చోరీ చేసి ఇద్దరు కలిసి జల్సాలు చేయాలని ప్లాన్ వేశారు.

రెండు, మూడు సార్లు వాటిని చోరీ చేసేందుకు యత్నించిన కుదరలేదు. దీంతో ఈ నెల 4వ తేదీన వృద్ధురాలు బంధువుల వివాహానికి హాజరై ఇంటికి వచ్చింది. వృద్ధురాలి వద్దకు చేరుకున్న లలిత, రాకేష్ సమయం కోసం చూడసాగారు, అదేసమయంలో సత్తెమ్మ నిద్రించేందుకు బెడ్‌పై పడుకోగానే ఇద్దరు కలిసి దిండుతో ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న హయత్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు, డిఐ నిరంజన్ తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News