బెంగళూరు: కర్నాటకలో తొలి హెచ్3ఎన్2 వైరస్ మరణం చోటుచేసుకుంది. ఒక 82 ఏళ్ల వృద్ధుడు ఈ వైరస్ కారణంగా మరణించినట్లు ఆరోగ్య శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. హీరే గౌడ అనే వృద్ధుడుమార్చి 1వ తేదీన హెచ్3ఎన్2 వైరస్‌తో మరణించినట్లు హసన్ జిల్లాకు చెందిన ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. డయాబెటిస్‌తో బాధపడుతున్న హీరే గౌడకు హైపర్‌టెన్షన్ కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. గౌడను ఫిబ్రవరి 24న ఆసుపత్రిలో చేర్పించగా మార్చి 1న మరణించినట్లు ఆ అధికారి చెప్పారు.
గౌడకు సంబంధించిన నమూనాలను పరీక్షకు పంపించగా ఆయనకు వైరస్ సోకినట్లు మార్చి 6న నిర్ధారణ అయినట్లు అధికారి తెలిపారు. హెచ్3ఎన్2 వైరస్ ఇన్‌ఫెక్షన్లు హఠాత్తుగా పెరగడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ఐదు రోజుల క్రితం వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. 15 ఏళ్ల వయసున్న పిల్లలు, 55 65 ఏళ్లు దాటిన వృద్ధులలో ఈ వైరస్ కనిపిస్తోందని మంత్రి విలేకరులకు తెలిపారు. గర్భిణి మహిళలకు కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉంది.