Sunday, December 22, 2024

వృద్ధులకు కేంద్రం ఏం చేసింది?

- Advertisement -
- Advertisement -

మన దేశంలో 70 ఏళ్ల తర్వాత బీమా సౌకర్యం లేదు. బ్యాంకు లోన్ వసతి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎలాంటి పని దొరకదు. కేవలం ఇతరులపై ఆధారపడి బతకమంటారు. 60- 65 ఏళ్ల దాకా వారు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, అన్నీ రకాల పన్నులు చెల్లించారు. ఈ వయసులో వారిని ఏ బీమా స్కీమ్ ఆదుకోదు. రైళ్లలో 50% రాయితీలను తొలగించారు. మరో వైపు చూస్తే రాజకీయాల్లో ఉన్న ముసలివాళ్ళు ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులు అవుతున్నారు. పదవి ముగిశాక పెన్షన్లు పొందుతున్నారు. వీరి మాదిరే దేశంలోని వృద్ధులకు కూడా ఆర్థిక అవసరాలు ఉంటా యి కదా! మరి వారికి పెన్షన్ ఎందుకివ్వరు. పిల్లలపై ఆధారపడే దౌర్భాగ్య పరిస్థితి వారికెందుకు. ఒకవేళ పిల్లలు చేరదీయకపోతే వారు ఎలా బతకాలి.

రాజ్యసభలో 8 ఫిబ్రవరి రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమాజ్ వాది పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ సభలో లేవనెత్తిన అంశాలు ఆనాడే అందరి దృష్టిని ఆకర్షించాయి. మహిళలకు, పారిశుద్ధ కార్మికులకు, సీనియర్ సిటిజన్లకు ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఘాటుగానే ఆమె ప్రశ్నించారు. నిర్భయ చట్టం అమలుకు బడ్జెట్ కేటాయింపులో తగ్గింపు శోచనీయమని అన్నారు. అయితే ఆమె దేశంలో ముసలివాళ్ల పట్ల చూపిన వ్యక్తిగత సానుభూతి, ఆయా వర్గాలను ఆకట్టుకుంది. వృద్ధుల వాట్సా ప్ గ్రూపుల్లో, వెబ్ సైట్లలో ఆమె ప్రసంగ పాఠాన్ని ప్రచారంలోకి తెచ్చారు. అలా అప్పుడప్పుడు కనబడే జయా బచ్చన్ వృద్ధుల పట్ల ఆవేదన ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది.
నవంబర్‌లో 5 రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని కొన్ని సామాజిక మాధ్యమాల్లో వృద్ధులపై ఆనాడు ఆమె లేవనెత్తిన వాక్యాలు చక్కర్లు కొడుతున్నాయి. తెలంగాణ మినహా రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలు ఉత్తర భారత్‌కి చెందినవి కాబట్టి ఆ ప్రాంతాల్లో సీనియర్ సిటిజన్లలో కేంద్రంలోని బిజెపి తమకు ఏమి చేసింది అనే కోణంలో ఈ మాటలు ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. నిజానికి జయా బచ్చన్ తన తొమ్మిది నిమిషాల ప్రసంగంలో వివిధ అంశాలతో పాటు సీనియర్ సిటిజన్ల ప్రస్తావన తెచ్చారు. అయితే ఆ మర్నాడు ఆమె ప్రసంగ పూర్తి పాఠంగా ప్రచురించిన వార్తలో వృద్ధులకు సంబంధించిన చాలా అంశాలున్నాయి. అఖిల భారత మాజీ సైనికుల సంఝా మోర్చా వెబ్ సైట్‌లో సెప్టెంబర్‌లో పోస్ట్ చేసిన సమాచారం ఇలా ఉంది.

సీనియర్ సిటిజన్లను చంపేయండి! అని ఆమె అన్నట్లుగా దీనికి శీర్షిక పెట్టారు. ఇప్పుడు దేశంలో వున్న 15 కోట్ల వృద్ధుల జనాభా వచ్చే 20 ఏళ్లలో రెట్టింపవుతుంది. వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. 65 ఏళ్లు పైబడిన ఈ దేశ నిర్మాతలకు కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం ఏ సదుపాయాలూ కల్పించలేకపోతున్నందున వారిని చంపేయండి. సరిపోతుంది అని జయాబచ్చన్ రాజ్యసభలో ఆవేశంగా, ఆవేదనతో అన్నట్లు ఇందులో పేర్కొన్నారు.
ఆమె లేవనెత్తిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. మన దేశంలో 70 ఏళ్ల తర్వాత బీమా సౌకర్యం లేదు. బ్యాంకు లోన్ వసతి లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఎలాంటి పని దొరకదు. కేవలం ఇతరులపై ఆధారపడి బతకమంటారు. 60- 65 ఏళ్ల దాకా వారు ఇన్సూరెన్స్ ప్రీమియంలు, అన్నీ రకాల పన్నులు చెల్లించారు. ఈ వయసులో వారిని ఏ బీమా స్కీమ్ ఆదుకోదు. రైళ్లలో 50% రాయితీలను తొలగించారు. మరో వైపు చూస్తే రాజకీయాల్లో ఉన్న ముసలివాళ్ళు ఎంఎల్‌ఎలు, ఎంపిలు, మంత్రులు అవుతున్నారు. పదవి ముగిశాక పెన్షన్లు పొందుతున్నారు. వీరి మాదిరే దేశంలోని వృద్ధులకు కూడా ఆర్థిక అవసరాలు ఉంటా యి కదా! మరి వారికి పెన్షన్ ఎందుకివ్వరు. పిల్లలపై ఆధారపడే దౌర్భాగ్య పరిస్థితి వారికెందుకు. ఒకవేళ పిల్లలు చేరదీయకపోతే వారు ఎలా బతకాలి. ఈ వృద్ధులు ప్రభుత్వాలకి వ్యతిరేకంగా పోవాలని అనుకుంటే ఎన్నికల్లో ఫలితాలను తారుమారు చేయగలరు. వారిని ఇలాగే అశ్రద్ధ చేస్తే వారు దేనికైనా సిద్ధపడతారు. జీవితంలో ఎన్నో ఎన్నికల్లో పాల్గొని నేతల రాతలు మార్చి న వీరిని తక్కువగా అంచనా వేయవద్దు. సమాజంలోని ఎన్నో వర్గాలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు వృద్ధుల కోసం ప్రత్యేక పథకాలు తేవాలి. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లు తగ్గించి వారి ఆదాయానికి గండి కొడుతున్నారు.ఎందరో కొందరు పదవీ విరమణ పెన్షన్ పొందుతుంటే వారి నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్ళు నిండిన పురుషులకు, మహిళలకు పెన్షన్ ఇవ్వాలి. బస్, రైలు, విమాన సర్వీసుల్లో రాయితీలు కావాలి. బతికున్నంత కాలం బీమా సౌకర్యాన్ని ఇస్తూ ప్రభుత్వమే కిస్తులు చెల్లించాలి. కోర్టు కేసుల్లో వృద్ధులకు సంబంధించిన వాటిని పదే పదే వాయిదాలు వేయకుండా తొందరగా విచారణ పూర్తి చేయాలి. వృద్ధుల నిలయాలను ఊరూరా ఏర్పాటు చేయాలి. పదిహేనేళ్ల తర్వాత తుక్కుగా పరిగణించే కార్ల విషయంలో వృద్ధులకు వెసులుబాటు కల్పించాలి. వారివి వాణిజ్య వాహనాలు కానందున అవి తిరిగిన దూరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ వయసులో మరో కారును కొనలేరు కాబట్టి రద్దు చేసిన వాహనానికి బదులుగా వృద్ధులకు కొత్తవి అందివ్వాలి.

జయా బచ్చన్ పేరిట ప్రచారంలో ఉన్న ఈ డిమాండ్లు న్యాయమైనవే. ప్రభుత్వ ఉద్యోగాలు చేసి రిటైర్ అయి పింఛన్ పొందుతున్న వారు దేశ పౌరుల్లో అతి కొద్ది మంది మాత్రమే. ప్రయివేటు రంగంలో పింఛన్ వసతి లేదు. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చే పింఛను రూ. 5 వేలు మించదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటరి మహిళలకు ఆసరా పింఛన్లు ఇస్తున్నాయి. ఆదాయ మార్గాలు లేని వృద్ధుల కోసం కేంద్రం ప్రత్యేకంగా కొన్నిపథకాలు ఏర్పాటు చేసి వాటిని తన నిర్వహణలోనే నడిపించాలి. వివిధ ఆధారాలతో ఆన్‌లైన్ దరఖాస్తు ద్వారా మంజూరు చేసి బ్యాంక్ ఖాతాలో వేయాలి. అవసరమైతే దీని కోసం ఒక సెస్‌ను విధించి అధికాదాయ వర్గాల నుంచి వసూలు చేయాలి. వృద్ధుల నిధికి విరాళాలు ఇచ్చే వారికి ఆదాయ పన్ను రాయితీని కల్పించాలి. వృద్ధులు వాడే మందులపై పన్ను తీసేయాలి. అడల్ట్ డైపర్లు ఉచితంగా సరఫరా చేయాలి. కదలలేని వృద్ధుల ఇళ్ళకి ఆహారం పంపిణీ చేయాలి. వికలాంగులకు ఇస్తున్నట్లు వృద్ధులకు కూడా చక్రాల కుర్చీలను అందజేయాలి. వృద్ధులకోసం విడిగా బస్సులు నడపాలి. ఇలా దేశంలోని వృద్ధుల అవసరాలు చాలానే ఉన్నాయి.

అయితే జయా బచ్చన్ ప్రసంగంలో ఇవన్నీ లేవని ఆమె నోట వచ్చిన కొన్ని మాటలకు మరిన్ని జోడించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ఫ్యాక్ట్లీ అనే సామాజిక మాధ్యమాల నిజానిజాల నిర్ధారణ వేదిక అంటోంది. ఏదేమైనా ఆమె అన్నా అనుకున్నా ఇవి వాస్తవాలు. తమ సమస్యలపై ప్రభుత్వం చూపు పడాలని వృద్ధుల సంఘాలు ఆరాటపడుతున్నట్లున్నాయి. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బిజెపి ప్రచారానికి వెళుతున్న ప్రధాని మోడీ లేదా ఇతర ప్రభుత్వ బాధ్యుల దృష్టికి వెళ్లాలని వారి ఆశిస్తూ ఉండవచ్చు. చాలా పాశ్చాత్య దేశాలు వృద్ధులందరికీ పెన్షన్, నివాస, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. చైనా ముందు జాగ్రత్తగా ప్రతి ఏటా కేర్ సెంటర్లను పెంచుతూ పోతోంది. వృద్ధుల హెల్త్ కేర్ ఇండెక్స్- 2023 లోని 90 దేశాల జాబితాలో మన దేశం 77 స్థానంలో ఉంది. మన కన్నా పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మంచి ర్యాంకుల్లో ఉన్నాయి. ఏదో రూపంలో ఎన్నికల వేళ దేశంలో వృద్ధుల పరిస్థితి, వారి అవసరాలు చర్చలోకి రావడం మాత్రం అవసరమే అనాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News