న్యూఢిల్లీ: కొత్త పార్లమెంటు భవనం ప్రారంభంతో దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ప్రస్తుత పాత పార్లమెంటు భవనం చరిత్ర పుటల్లో మిగిలి పోనుంది. భారత దేశానికి స్వాతంత్య్రం లభించడానికి 26 ఏళ్ల ముందు 1921 ఫిబ్రవరి 21న బ్రిటన్‌కు చెందిన డ్యూక్ ఆఫ్ కన్నాట్ ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.560 అడుగుల వ్యాసం, మైలులో మూడోవంతు చుట్టుకొలత కలిగిన ఈ వృత్తాకార భవన డిజైన్‌ను సర్ హెర్బర్ట్ బేకర్, సర్ ఎడ్విన్ ల్యూటన్‌లు రూపకల్పన చేశారు.1927 జనవరి 18న అప్పటి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్యపు దేవాలయంగా కీర్తించబడే ఈ పాత పార్లమెంటు భవనం అప్పటి బ్రిటీష్ పరిపాలన మొదలుకొని స్వాతంత్య్రం కోసం విప్లవ వీరులు భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్‌లు విసిరిన బాంబుల మోతలకు సాక్షీభూతంగా కూడా నిలిచింది.
ప్రపంచంలోనే అద్భుతమైన పార్లమెంటు భవనాల్లో ఒకటిగా పేరొందిన పాత పార్లమెంటు భవనం అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందిందో ఇప్పుడు దానికి దగ్గర్లో నిర్మించిన నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై కూడా మీడియాలో అంతే చర్చ జరుగుతుండడం విశేషం. ప్రారంభోత్సవానికి ముందే ఈ భవనం వివాదాస్పదం కావడం గమనార్హం. భారత ప్రథమ పౌరురాలు అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడాన్ని ప్రశ్నిస్తున్న దాదాపు 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా గత ఏప్రిల్‌లో ముగిసిన బడ్జెట్ సమావేశాలే పార్లమెంటు భవనంలో జరిగిన చివరి సమావేశాలు కావడం గమనార్హం.