Monday, December 23, 2024

ఏకైక సంస్కృత న్యాయవాది

- Advertisement -
- Advertisement -

అహం సంస్కృతం వాదామి- ఇదేమిటి అనుకుంటున్నారా! ఈ సంస్కృత వాక్యానికి తెలుగు అర్థం నేను సంస్కృతంలో మాట్లాడతాను అని. భావ వ్యక్తీకరణకు భాష మూలాధారం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6900 భాషలు వాడుకలో ఉండగా, అందులో 3500 సంవత్సరాల చారిత్రక ఆధారాలతో ఉనికి గల సంస్కృతం అతి ప్రాచీన భాష. సంస్కృతాన్ని దేవవాణి, దేవ భాష, సురభారతి అని కూడా అంటారు. సంస్కృత లిపిని దేవనాగరి అంటారు. భారత రాజ్యాంగంలోని 8వ అధికరణంలో పేర్కొన్న 22 భాషలలో అతి తక్కువగా వాడుకలో ఉన్న భాష స్థాయికి సంస్కృత భాష చేరుకుంది. సంస్కృతానికి, భారత దేశానికి గల సంబంధం అజరామరమైనదే కాక దేశంలోని అన్ని భాషలకు మాతృక లాంటిది ఈ ప్రాచీన భాష. భారతీయ సనాతన ఆధ్యాత్మిక గ్రంధాలైన రామాయణ, మహాభారత, భాగవతాలన్నీ తొలుత సంస్కృతంలోనే రచింపబడ్డాయని చరిత్ర మనకు చెబుతుంది.

అంతేకాక పూర్వం విద్యాబోధన అంతా కూడా సంస్కృతం లోనే జరిగేదని, ఈ ప్రత్యేకత వల్లనే భారత దేశం ఒకప్పుడు విశ్వగురువుగా భాసిల్లిందని అంటారు. వేల సంవత్సారాల క్రితమే నలందా, తక్షశిల, శారదా, మిథిలా, విక్రమ లాంటి వైదిక విద్యాలయాలలో సంస్కృత భాషలోనే దేశ విదేశీయులకు వివిధ శాస్త్రాలలో విద్యాబోధనను అందించిన విజ్ఞాన భూమి భారతదేశం. అయితే కాలక్రమంలో భారత దేశంపై వివిధ వలసవాదులు దండయాత్రలు చేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవడంతో పాటు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వారి భాషలను భారతీయులపై బలవంతంగా రుద్దడం వలన సంస్కృత భాష ప్రాభవం కాలక్రమేణా మసకబారింది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్ దాదాపు గత నాలుగున్నర దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ తాను చేపట్టిన మొట్టమొదటి కేసు నుండి

నేటి వరకు ప్రతి కేసును సంస్కృతంలోనే నిర్వహించడం సంస్కృత భాష పట్ల ఆయనకు గల నిబద్ధతకు నిదర్శనం.
భారత న్యాయస్థానాలలో వాద, ప్రతివాదనలు తీర్పు లు అన్నీ సాధారణంగా ఇంగ్లీష్, హిందీ లేదా స్థానిక మాతృభాషలలో జరుగుతాయి తప్ప సంస్కృతంలో కాదు అని బాల్యంలోనే తన తండ్రి ద్వారా తెలుసుకున్న ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్, భవిష్యత్తులో తాను న్యాయవాద వృత్తి చేపట్టి సంస్కృతంలోనే వ్యాజ్యాలు నిర్వహిస్తానని ఏడో తరగతి చదువుతున్న సమయంలో చేసిన ప్రతిజ్ఞపై నేటికీ కట్టుబడిఉన్నారు. బాల్యం నుండి సంస్కృతంపై మక్కువ గల ఆయన ప్రపంచంలోని అతి పెద్ద సంస్కృత విశ్వవిద్యాలయాలలో ఒకటైన సంపూర్ణానంద్ సంస్కృత్ విశ్వవిద్యాలయం, వారణాసి నుండి బుద్ధిస్ట్ ఫిలాసఫీలో పట్టా పొందారు.

ఆ తరువాత హరిచంద్ర కాలేజ్ నుండి సంస్కృత మాధ్యమంలోనే బిఎ, ఎల్‌ఎల్‌బి పూర్తి చేసి 1978లో న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టారు. ఒక వైపు న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే మరో పక్క సంస్కృత భాష పరిరక్షణ కోసం ఆయన ఇతోధిక కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన సంస్కృత భాషలో 60 నవలలు రచించడమే కాక పిల్లలకు, ఔత్సాహికులకు పూర్తి ఉచితంగా సంస్కృతం బోధించడం శ్లాఘనీయం. అంతే కాక ఆయన ప్రతి సంవత్సరం కోర్టు ఆవరణలో సంస్కృత భాషా దినోత్సవం నిర్వహిస్తారు. ఆయన ఈ కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ 2003లో సంస్కృత మిత్రం అనే జాతీయ బిరుదుతో సత్కరించింది.
ఆయన వద్దకు వచ్చే కేసుల పిటిషన్ల దరఖాస్తు నుంచి వాదనలు, విచారణలు, నివేదికలు, అఫిడవిట్లు అన్నీ కూడా సంస్కృతంలోనే నిర్వహిస్తారు. ఆయన వాడే భాష సరళంగా ఉండడంతో న్యాయస్థానంలో అందరికీ సులువుగా అర్థమవుతుందట. సంస్కృతంలో ఆయన వాక్పటిమను చూసి సహచర న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఇతరులు మంత్రముగ్ధులవుతుంటారు. అంతేకాక న్యాయమూర్తులు సైతం ఆయన వాదించే కేసుల తీర్పులను ప్రత్యేకంగా సంస్కృతం, హిందీ భాషలలో వెల్లడించడం విశేషం. ఆయనకు కేవలం సంస్కృతం మాత్రమే తెలుసు అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. సంస్కృతంతో పాటు ఆయనకు హిందీ, ఇంగ్లీష్ భాషలలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది.

సంస్కృతంలో వాదనలు వినిపించినతరువాత, న్యాయమూర్తి కోరితే ఆయన దానిని హిందీ లేదా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి వినిపిస్తారట. సంప్రదాయ నల్ల కోటు ధరించి నుదిటిపై త్రిపుండ్, తిలకంతో ఆయన న్యాయవాదులందరిలో విలక్షణంగా కనిపిస్తారు. ప్రపంచంలోనే ఏకైక సంస్కృత న్యాయవాదిగా నాలుగున్నర దశాబ్దాల నుండి కొనసాగుతున్న తన పేరును గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చేర్చాలని ఆచార్య శ్యామ్ ఉపాధ్యాయ్ కోరుతున్నారు.సంస్కృత భాష బహుముఖమైనదే కాక ఆధునిక భాషలన్నిటికీ మాతృక లాంటిది. ఒక్కో పదానికి సంస్కృత భాషలో ఉన్నన్ని పర్యాయ పదాలు మరే ఇతర భాషలో లేవంటే అతిశయోక్తి కాదు. ఉదాహరణకు ఏనుగుకు సంబంధించి ఇంగ్లీష్‌లో కేవలం ఒకే పదం అందుబాటులో ఉండగా సంస్కృతంలో దాదాపు వంద పదాలు అందుబాటులో ఉన్నాయి.

అంతేకాకుండా అతి తక్కువ పదాలను ఉపయోగించి సుదీర్ఘమైన భావాన్ని కేవలం సంస్కృతంలో మాత్రమే వ్యక్తపర్చవచ్చు. సంస్కృత భాషను ఉచ్ఛరించడం వలన మెదడు పని తీరు మెరుగుపడడమేకాక జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) పరిశోధకుడు రిక్ బ్రిగగ్స్ తన పరిశోధనా పత్రంలో నాసా వారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) ప్రోగ్రామ్ కోసం కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ను అభివృద్ధి చేయడానికి ప్రాచీన భారతీయ భాష అయిన సంస్కృతం అత్యంత అనుకూలమైన భాష అని పేర్కొనడం గమనార్హం. సంస్కృత భాషలో మరే ప్రపంచ భాషలలో లేని పదజాలం (Vocabulary) ఉంది. సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి ప్రపంచంలోని ఇతర భాషలలోని కఠినమైన పదాలను సైతం అనాయాసంగా ఉచ్ఛరించడమేకాక సులువుగా నేర్చుకోగల్గుతారు. సంస్కృత భాషను సృష్టికర్త అయిన బ్రహ్మ కనిపెట్టి ఖగోళంలో నివసించే రుషులకు బోధించగా, దానిని వారు భూలోకంలో నివసించే వారి అనుచరులైన మానవులకు అందించారని అంటారు.

ఆధునిక పోకడలతో వెర్రితలలు వేస్తున్న నేటి కాలంలో కూడా మాతృభాష కన్నడ అయినప్పటికీ సంస్కృతం మాట్లాడే అరుదైన గ్రామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది కర్ణాటక రాష్ట్రం షిమోగా జిల్లాలోని మత్తూర్ గ్రామం. సంస్కృత భాష పరిరక్షణ కోసం ఈ గ్రామంలోని స్థానిక పాఠశాలలో సుమారు 5000 మందికి విద్యార్థులకు సంస్కృతం బోధించబడడం అత్యంత సంతోషదాయకం. అధిక సంఖ్యలో విష్ణు, శైవ ఆలయాలు ఉండే ఈ గ్రామంలో ప్రతి రోజు తెల్లవారు జామున మహిళలు, బాలబాలికలు కలిసి నగర సంకీర్తన జరపడం మరో ప్రత్యేకత. సంస్కృత భాష ఔన్నత్యాన్ని విస్తృత పరచడానికి, 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు జంట గ్రామాలైన హోస హళ్లి, మత్తూర్‌లను ప్రధాన కేంద్రాలుగా స్థాపించారు.

అప్పట్లోనే సంస్కృతం నేర్చుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి ఈ రెండు గ్రామాలకు ప్రజలు తరలి వచ్చేలా చేసి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌ఘర్ జిల్లా నుండి దాదాపు 45 కి.మీ దూరంలో ఉన్న ఝిరి గ్రామంలోని గోడలు సంస్కృత భాషలో లిఖించబడిన సూక్తులు, నీతి వాక్యాలు, సామెతలతో విలక్షణంగా దర్శనమిస్తాయి. కేవలం 1000 మంది నివసించే ఈ గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ మాతృభాషగా సంస్కృతం మాట్లాడతారు. గ్రామంలోని వయోజనులు స్థానిక దేవాలయాలలో పిల్లలకు చేసే సంస్కృత బోధన చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది.మహిళల సంస్కృత పాటలు లేనిదే ఆ గ్రామంలో వివాహ వేడుకలు జరగవు. ఈ ప్రత్యేకతలతో మధ్యప్రదేశ్ సందర్శించే పర్యాటకులకు ఝిరి గ్రామం ఆకర్షణీయ కేంద్రంగా మారుతోంది. ఒడిశా రాష్ట్రంలోని పట్టముండై పట్టణానికి 29 కి.మీ దూరంలో కేవలం 50 గృహాలతో 300 జనాభా ఉండే చిన్న గ్రామం శాస.

ప్రధానంగా బ్రాహ్మణులు నివసించే ఈ గ్రామంలో సంస్కృత భాషకు గొప్ప స్థానముంది. ఈ గ్రామ సమీపంలోగల బాబ్‌కర్‌పూర్ గ్రామంలో నెలకొన్న ప్రఖ్యాత కవి కాళిదాసు ఆలయం సంస్కృత భాషపట్ల ఆ ప్రాంత వాసుల భకి, గౌరవాన్ని సూచిస్తుంది. రాజస్థాన్, బన్స్వారా జిల్లాలోని గనోడా గ్రామ ప్రజలు రెండు దశాబ్దాల క్రితం వరకు సంస్కృత భాషను ఆ గ్రామం లో ప్రవేశపెట్టే వరకు కూడా తమ ప్రాంతీయ భాష వాగాడిలో మాట్లాడుకునేవారు. కాగా పాఠశాలలు, కళాశాలల్లో సంస్కృతాన్ని ప్రవేశపెట్టిన అనతి కాలం లోనే విద్యార్థులు సంస్కృతంలో నిష్ణాతులు అయ్యారు. కాలక్రమేణా, పెద్దలు కూడా యువకుల నుండి సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించగా నేడు గ్రామంలోని వారందరూ సంస్కృతం మాట్లాడుతున్నారు.

ఒకప్పుడు దేశంలో ఎంతో దేదీప్యమానంగా వెలిగిన సంసృత భాషను నేడు వేద పండితులు తప్ప ఇతరులు ఎవరూ నేర్చుకోవడానికి పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. ఇంటర్మీడియేట్, డిగ్రీలలో సంస్కృత భాషను రెండవ భాషగా ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ విద్యార్థులు అందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. కంచి కామకోటి పీఠం లాంటి పలు ఆధ్యాత్మిక సంస్థలు సంస్కృత, వేద పాఠశాలలు నెలకొల్పి సంస్కృత భాష ప్రాభవాన్ని నిలబెట్టే కృషి చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాష పట్ల ఆసక్తి పెరుగుతుండగా ఆ భాషకు పుట్టినిల్లయిన భారత్‌లో మాత్రం పరిస్థితి ఇప్పటికీ నిరాశాజనకంగానే ఉంది. ఇప్పటికయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని భారత దేశానికే ప్రత్యేకమయిన సంస్కృత భాష పరిరక్షణకు దేశ వ్యాప్తంగా పాఠశాల, కళాశాల స్థాయిలలో నిర్బంధ అంశంగా చేర్చి దేవ భాష ప్రాభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News