బీజింగ్ : చైనాలో స్వయం ప్రతిపత్తి ప్రాంతమైన జిన్‌జియాంగ్ యుగుర్ లో 135 ఏళ్ల వృద్ధురాలు అలిమిహాన్ సయేధీ గురువారం మృతి చెందినట్టు స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. 1886 జూన్ 25 లో జన్మించిన సయేథీ షూలే కౌంటీ లోని కొముక్సెరిక్ టౌన్‌షిప్ నుంచి తరలి వచ్చినట్టు ప్రజా ప్రచార విభాగం తెలియచేసింది. చైనా అసోసియేషన్ ఆఫ్ జెరంటాలజీ, జెరియాట్రిక్ 2013 లో విడుదల చేసిన వృద్ధుల జాబితాలో అలిమిహాన్ అగ్రస్థానాన నిలిచారు. ఆఖరి శ్వాస వరకు ఆమె నిరాడంబరంగా జీవితాన్ని సాగించారని, వేళకు భుజించేవారని, తన ఇంటి ఆవరణలో ఎండలో ఎక్కువ సేపు గడిపే వారని జిన్హుయా వార్తా సంస్థ వెల్లడించింది.
తన మునిమనుమల సంరక్షణలో ఆమె సహకరించేవారని తెలిపింది. సుదీర్ఘకాలం జీవించే వారితో ఉండే ప్రాంతంగా కొముక్సెరిక్ ప్రసిద్ది చెందింది. అక్కడ అంతా 90 ఏళ్లు దాటిన వారే. వైద్యసౌకర్యాలు అభివృద్ధి చెందడం వారి సుదీర్ఘకాల జీవితానికి చాలావరకు తోడ్పడుతోంది. ఉచితంగా ఏటా శారీరక పరీక్షలు, 60 ఏళ్లు పైబడిన వారికి నెలానెలా వయో వృద్ధ సబ్సిడీల సాయం, స్థానిక ప్రభుత్వం అందించడం, ఇవన్నీ శతాధిక జీవనం సాగించడానికి తోడ్పడుతోందని పరిశీలకులు చెబుతున్నారు.