Sunday, November 24, 2024

తిరుమల కొండపైకి ఒలెక్ట్రా ఈ-బస్సులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేఘా ఇంజినీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) తిరుమలను సందర్శించే భక్తుల సౌకర్యార్ధం తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉచితంగా అందించే ఎలక్ట్రిక్ బస్సుల నమూనా సిద్ధం చేసింది. ఎంఈఐఎల్ గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ ఈ బస్సులను హైదరాబాద్‌లోని తన ప్లాంట్ లో తయారు చేస్తోంది. తితిదే మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించిన తొలి బస్సును గురువారం దేవస్థాన రవాణా విభాగం జనరల్ మేనేజర్ పివి శేషారెడ్డి సమగ్రంగా పరిశీలించారు. ఒలెక్ట్రా తయారు చేసిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 10 ఎలక్ట్రిక్ బస్సులను తితిదేకు అందించాలని ఎం ఈ ఐ ఎల్ నిర్ణయించిన విషయం విధితమే.

ఈ బస్సులను తిరుమలను సందర్శించే భక్తులకు కాలుష్య రహిత ప్రయాణం అందించేందుకు తితిదే వినియోగించనుంది. బస్సు పనితీరును ఒలెక్ట్రా ప్రతినిధులు వివరించారు. ప్రయాణికులకు పూర్తి భద్రత కల్పించేలా బస్సును తయారు చేశామని తెలిపారు. బస్సుల్లో ఎలెక్ట్రానిక్ డిసేప్లే బోర్డ్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తోందో తెలిపే వివరాలు పొందుపరిచారు. తిరుమల పవిత్రత, ప్రాశస్త్యాన్ని తెలిపే ఫోటోలను బస్సుపై పొందుపరిచారు. బస్సులో కొద్దిదూరం ప్రయాణించిన శేషారెడ్డి దాని పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

శబ్ధ, వాయు కాలుష్యం లేని ప్రయాణం..
సంస్థ పురోగతి, భవిష్యత్తు ప్రయత్నాలలో శ్రీవారి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటున్నామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చైర్మన్, ఎండి కెవి ప్రదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 మీటర్ల పొడువున్న 10 ఎలక్ట్రిక్ బస్సులను తిరుమల తిరుపతి దేవస్థానానికి త్వరలో అందించనున్నామని వెల్లడించారు. ఈ బస్సుల కోసం ఛార్జీంగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు పరిశుభ్రమైన, వాయు, శబ్ధ కాలుష్యంలేని ప్రయాణాన్నిఈ విద్యుత్ బస్సుల ద్వారా అందిస్తామని ప్రదీప్ తెలిపారు.

ఒలెక్ట్రా అందిస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు తిరుమలను పర్యావరణ హితంగా మార్చుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిరుమలలో 12 డీజిల్ బస్సులు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. త్వరలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల సేవలు ప్రారంభం అయితే తితిదేకు డీజిల్ ఖర్చుల భారం తగ్గటంతో పాటు పర్యావరణం మెరుగు పడేందుకు ఎంతో అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎపిఎస్ ఆర్టిసి) ఆధ్వర్యంలో 50 ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు ప్రతిరోజూ తిరుపతి, తిరుమల మధ్య నడుస్తూ భక్తులకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News