Monday, December 23, 2024

23న హైదరాబాద్‌లో ఒలంపిక్ డే రన్..

- Advertisement -
- Advertisement -

23న హైదరాబాద్ ఒలంపిక్ డే రన్
ఘనంగా నిర్వహిస్తామన్న క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ నెల 23న హైదరాబాద్‌లో ఒలింపిక్ రన్‌ను ఘనంగా నిర్వహిస్తామని క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే సందర్భంగా స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ సహకారంతో ఈనెల 23న హైదరాబాదులోని 15 ప్రముఖ సెంటర్ల నుండి ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియం వరకు ఒలంపిక్ రన్ ను ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఒలంపిక్ డే రన్ సందర్భంగా రూపొందించిన క్రీడాకారులు ధరించే జెర్సీలను రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడల అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారన్నారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం నుండి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా క్రీడా పాలసీని రూపొందించామన్నారు. తెలంగాణ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి కామన్వెల్త్ లాంటి అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించామన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో క్రీడల పట్ల విద్యార్థులకు అవగాహన, క్రీడా సంస్కృతినీ పెంపొందించేలా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో సుమారు 18 వేల క్రీడా ప్రాంగణాలను నిర్మించామన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వల్ల నేడు రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ వేదికలపై అద్భుతమైన ప్రతిభను కనబరిచి పతకాలను సాధిస్తున్నారన్నారు. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలంపిక్ డే రన్ ను నిర్వహించడానికి ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 18 నుండి 22 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒలంపిక్ రన్ను ఘనంగా నిర్వహించామన్నారు.

అలాగే ముగింపు వేడుకలను హైదరాబాద్ నగరంలో ప్రముఖ 15 కేంద్రాలైనా చార్మినార్, విక్టరీ ప్లేగ్రౌండ్, హనుమాన్ వ్యాయామశాల, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం యూసుఫ్ గూడా, బోయినపల్లి, హెల్త్ లీగ్, ఫతే మైదాన్ క్లబ్, సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహం, ఖైరతాబాద్ లోని విశ్వేశ్వర విగ్రహం, నారాయణ వైఎంసిఏ, ఉస్మానియా యూనివర్సిటీ, హిమాయత్ నగర్ లోని వాసవి పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ల నుండి సుమారు 10 వేల మంది క్రీడాకారులు, విద్యార్థులు ఈ ఒలంపిక్ డే రన్ లో పాల్గొని మగింపు కార్యక్రమం లాల్ బహదూర్ స్టేడియంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

ఒలంపిక్ డే రన్ విజయవంతంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఒలంపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎస్ ఆర్ ప్రేమ్ రాజ్ కో కన్వీనర్ లు మహేశ్వర్, మల్లారెడ్డి ఒలంపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ యాదవ్, వివిధ క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News