యోషిరో మోరీ
టోక్యో: ఒలింపిక్స్‌ను నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని టోక్యో క్రీడల నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరీ స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఇప్పటికే ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేశామన్నారు. మరోసారి ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం కానీ, రద్దు చేయడం కానీ జరగదని మోరీ తేల్చి చెప్పారు. ఈ ఏడాది జులైఆగస్టు నెలలోనే టోక్యో ఒలింపిక్స్‌ను నిర్వహించి తీరుతామాని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. కరోనా పూర్తిగా తగ్గక పోయినా ఒలింపిక్స్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయన్నారు.
ఈసారి షెడ్యూల్‌లో ఎలాంటి మార్పు ఉండదన్నారు. అంతేగాక ముందుగా అనుకున్నట్టే మార్చి 25న టార్చ్ రిలే పునః ప్రారంభమవుతుందని మోరీ పేర్కొన్నారు. ఇదిలావుండగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కూడా ఇదే విషయాన్ని తెలిపింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే ఒలింపిక్స్ జరుగుతాయని, ఇందులో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. కాగా జపాన్ రాజధాని టోక్యో వేదికగా కిందటి ఏడాదే ఒలింపిక్స్ జరగాల్సి ఉంది. అయితే కరోనా మహమ్మరి విజృంభణ నేపథ్యంలో విశ్వ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేశారు. ఈ ఏడాది జులై 23 నుంచి ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి.