Wednesday, January 22, 2025

లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఎన్నిక

- Advertisement -
- Advertisement -

లోక్‌సభ స్పీకర్‌గా ఎన్‌డిఎ అభ్యర్థి ఓమ్ బిర్లా ఎన్నిక
ప్రధాని మోడీ ప్రతిపాదిత తీర్మానం మూజువాణి వోటుతో ఆమోదం
కాంగ్రెస్ ఎంపి కె సురేష్ పేరు ప్రతిపాదించిన ప్రతిపక్షం
తీర్మానంపై వోటు కోసం పట్టుబట్టని ప్రతిప్ కూటమి
బిర్లాకు మోడీ, రాహుల్ అభినందన

న్యూఢిల్లీ : ఎన్‌డిఎ అభ్యర్థి ఓమ్ బిర్లా బుధవారం లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన తీర్మానాన్ని సభ మూజువాణి వోటుతో ఆమోదించింది. అంతకు ముందు అరుదైన చర్యగా ప్రతిపక్షం తమ సొంత అభ్యర్థి పేరును ఆ పదవికి ప్రతిపాదించడంతో ఈ అంశంపై ముమ్మరంగా చర్చ జరిగింది. ఎనిమిది సార్లు ఎంపి కొడికున్నిల్ సురేష్ పేరును తమ అభ్యర్థిగా ప్రతిపాదించిన ప్రతిపక్షం తీర్మానంపై వోటింగ్ కోసం పట్టుబట్టకపోవడంతో ప్రొటెమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ స్పీకర్‌గా ఓమ్ బిర్లా ఎన్నికైనట్లు ప్రకటించారు. దీనితో కోటాకు చెందిన బిజెపి ఎంపి ఒమ్ బిర్లా వరుసగా రెండవ సారి స్పీకర్ పదవిని అధిష్ఠిస్తున్నట్లు అయింది.

ఒక స్పీకర్ లోక్‌సభ గడువు ముగిసిన తరువాత తిరిగి ఆ పదవిలో కొనసాగడం ఇది ఐదవ సారి. సాంప్రదాయకంగా ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయించే పదవికి ఎన్నిక అవసరమైన కొన్ని సందర్భాల్లో ఇది కూడా ఒకటి. ‘ఓమ్ బిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారని ప్రకటిస్తున్నా’ అని మహతాబ్ చెప్పారు. ఆ వెంటనే మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పీకర్ ఆసనం వరకు బిర్లాను తోడ్కొని వెళ్లేందుకు అధికార పక్షం బెంచీలలో ముందు వరుసలో బిర్లా సీటు వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వారితో కలిసారు, బిర్లాకు రాహుల్ శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ప్రధానితో కూడా కరచాలనం చేశారు, అటు పిమ్మట మోడీ, రాహుల్, రిజిజు స్పీకర్ ఆసనం వరకు బిర్లాను తోడ్కొని వెళ్లారు, అక్కడ బిర్లాకు మహతాబ్ స్వాగతం పలుకుతూ, ‘ఇది మీ ఆసనం. దయచేసి ఆసీనులు కండి’ అని అన్నారు.

మోడీ 18వ లోక్‌సభలో మొడటిసారిగా మాట్లాడుతూ.. పార్లమెంటేరియన్‌గా బిర్లా కృషి కొత్త లోక్‌సభ సభ్యులకు స్ఫూర్తి కావాలని అన్నారు. ‘రెండవ సారి ఈ పదవికి మీరు ఎన్నిక కావడం గర్వకారణం’ అని ప్రధాని అన్నారు. ‘మొత్తం సభ తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నా. వచ్చే ఐదు సంపత్సరాల పాటు మీ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తున్నా’ అని మోడీ చెప్పారు, బిర్లా ‘మధుర దరహాసం’ మొత్తం లోక్‌సభను సంతోషంగా ఉంచుతుందని మోడీ అన్నారు. స్పీకర్ పదవికి ఎన్నికైనందుకు బిర్లాను రాహుల్ గాంధీ అభినందిస్తూ, సభలో ప్రజల వాణి వినిపించేందుకు ప్రతిపక్షాన్ని అనుమతిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. సభ ‘తరచు, బాగా’ పని చేయాలని ప్రతిపక్షం కోరుతున్నదని ఆయన తెలిపారు, నమ్మకంతో సహకారం లభించడం ఎంతో ముఖ్యం అని ఆయన అన్నారు.

‘ఈ సభ భారత ప్రజల వాణికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రభుత్వానికి రాజకీయ అధికారం ఉందనుకోండి. కానీ ప్రతిపక్షం కూడా భారత ప్రజల వాణికి ప్రాతినిధ్యం వహిస్తుంది’ అని కాంగ్రెస్ నేత చెప్పారు, ‘మీ పనిలో మీకు చేయూత ఇచ్చేందుకు ప్రతిపక్షం ఇష్టపడుతుంది. సభలో మాట్లాడేందుకు మీరు మమ్మల్ని అనుమతిస్తారని నా నమ్మకం’ అని రాహుల్ చెప్పారు, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో సహా పలువురు ప్రతిపక్ష నేతలు ఆయనతో ఏకీభవించారు. ‘వివక్ష లేకుండా మీరు ముందుకు సాగుతారని మేము విశ్వసిస్తున్నాం. స్పీకర్‌గా మీరు ప్రతి పార్టీకి సమాన అవకాశం, గౌరవం ఇస్తారని నమ్ముతున్నాం. ఈ గొప్ప పదవికి నిష్పాక్షికత మహత్తర బాధ్యత. మీరు& ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి’ అని అఖిలేశ్ చెప్పారు.

బిజెపిలో కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన 62 ఏళ్ల బిర్లా పార్టీ నుంచి మూడవ సారి ఎంపిగా ఉన్నారు, ఆయన అంతకు ముందు మూడు సార్లు రాజస్థాన్ ఎంఎల్‌ఎగా కూడా ఉన్నారు. బుధవారం ఉదయం స్పీకర్ పదవికి బిర్లా ఎన్నికల కోసం ప్రధాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీర్మానాన్ని సమర్థించారు, ఎన్‌డిఎ మిత్ర పక్షాల నుంచి జెడి (యు) సభ్యుడు రాజీవ్ రంజన్ సింగ్, హెచ్‌ఎఎం(ఎస్) సభ్యుడు జీతన్ రామ్ మాంఝీ, శివసేన సభ్యుడు ప్రతాప్‌రావ్ జాదవ్, ఎల్‌జెపి(ఆర్‌వి) సభ్యుడు చిరాగ్ పాశ్వాన్ కూడా బిర్లాకు అనుకూలంగా తీర్మానాలు ప్రవేశపెట్టారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్‌కు చెందిన సురేష్ ఎన్నిక కోసం శివసేన (యుబిటి) సభ్యుడు అర్వింద్ సావంత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

అయితే, మూజువాణి వోటు తరువాత ప్రధాని తీర్మానం తప్ప తక్కినవన్నీ నిరర్థకం అయ్యాయని మహతాబ్ ప్రకటించారు, ఏకాభిప్రాయ సాధన కోసం యత్నాలు విఫలమైన తరువాత అధికార కూటమి, ప్రతిపక్ష కూటమి మధ్య అరుదైన పోటీ నెలకొన్న తరువాత బిర్లా ఎన్నిక కావడం మున్ముందు పరిస్థితులు ఏవిధంగా ఉంటాయో సూచిస్తున్నదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.

బిర్లాకు మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా డిప్యూటీ స్పీకర్ పదవిని ఇండియా కూటమికి ఇవ్వాలన్న ముందస్తు షరతుకు బిజెపి సీనియర్ నేతలు అంగీకరించని తరువాత పోటీకి వెళ్లాలని ప్రతిపక్షం చివరి క్షణంలో నిర్ణయించింది. ప్రతిపక్షంనుంచి కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్), టిఆర్ బాలు (డిఎంకె), కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, జెపి నడ్డా మధ్య మంగళవారం కొద్ది సేపు జరిగిన చర్చలు విఫలమయ్యాయి, ఉభయ పక్షాలు తమ తమ వాదనలపై పంతం పట్టాయి. ప్రతిపక్ష నేతలు ఇద్దరూ రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయం నుంచి వాకౌట్ చేశారు. ఉప సభాపతి పదవికి ప్రతిపక్ష అభ్యర్థిని నిలపాలన్న ‘సంప్రదాయాన్ని’ ప్రభుత్వం పాటించడం లేదని వేణుగోపాల్ ఆరోపించడమే కాకుండా, బిర్లాపై అభ్యర్థిని నిలబెడుతామన్న నిర్ణయాన్ని ప్రకటించారు.

ఉప సభాపతి ఎంపిక సమయం వచ్చినప్పుడు వారి డిమాండ్‌ను పరిశీలిస్తామని సీనియర్ మంత్రులు హామీ ఇచ్చినప్పటికీ ప్రతిపక్షం ఒత్తిడి రాజకీయాలకు పాల్పడుతున్నదని, ముందస్తు షరతులు పెడుతోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (బిజెపి), లాలన్ సింగ్ (జెడియు) ఆరోపించారు. లోక్‌సభలో ఎన్‌డిఎ వైపు 295 మంది ఎంపిలు, ఇండియా కూటమి వైపు 233 మంది సభ్యులు ఉండడంతో బిర్లాకు అనుకూలంగా సంఖ్యా బలం ఉంది.

రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు సీట్లలో ఒకదానికి రాజీనామా చేసిన తరువాత లోక్‌సభలో ప్రస్తుతం 542 మంది సభ్యులు ఉన్నారు, కనీసం ముగ్గురు స్వతంత్ర సభ్యులు కూడా ప్రతిపక్షానికి మద్దతు ఇస్తున్నారు. బలరామ్ జాఖడ్ ఒక్కరే రెండు సభా సమయాలు పూర్తిగా సభాపతిగా వ్యవహరించారు, ఆయన ఏడవ, ఎనిమిదవ లోక్‌సభల్లో స్పీకర్‌గా ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News