శ్రీనగర్ : నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా 2019 ఆగస్టు తరువాత కశ్మీర్ పరిస్థితిపై ఆదివారం సంచలన ట్వీట్ చేశారు. తాను తన తండ్రి ప్రస్తుత ఎంపి ఫరూక్ అబ్దుల్లాతోసహా మొత్తం తమ కుటుంబీకులనందర్నీ ఇంట్లోనే బందీలుగా అధికారులు చేశారని ఆరోపించారు. 2019 ఆగస్టు తరువాత ఇదీ నయాకశ్మీర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తమ ఇళ్లల్లోనే తాము బందీలుగా ఎలాంటి వివరణ లేకుండానే గడప వలసి వచ్చిందని ఆయన విమర్శించారు. తన తండ్రిని, తనను బందీ చేయడమే కాక, తమ సోదరిని ఆమె పిల్లల్ని కూడా ఇంట్లో బందీలు చేశారని ఆయన అధికారులపై ట్వీట్లో మండి పడ్డారు. తమ సిబ్బందిని కూడా ఇంట్లో పనులు చేయనీయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తన ట్వీట్‌తోపాటు తన ఇంటి బయట పార్కింగ్ చేసిన పోలీస్ వాహనాల ఫోటోలు కూడా ఆయన పోస్ట్ చేశారు. పిడిపి అధ్యక్షురాలు మెహబూబ్ మఫ్తీ కూడా శనివారం తాను కూడా ఇంట్లో బందీ అయ్యానని ఆరోపించారు. ఉగ్రవాది అన్న కారణంతో ఎన్కౌంటర్లో హతుడైన అథర్ ముస్తాక్ కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరే ముందు అరెస్టులో ఉంచారని ఆమె ఆరోపించారు.