Monday, December 16, 2024

జమ్మూ కశ్మీరు ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం

- Advertisement -
- Advertisement -

జమ్మూ కశ్మీరు ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫిరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణం చేశారు. 2019లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒమర్ అబ్దుల్లా చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పదవీ స్వీకారం ప్రమాణం చేయించారు. తన తాత షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన మూడవ తరం నాయకుడు ఒమర్ అబ్దుల్లా కావడం విశేషం. ముఖ్యమంత్రితోపాటు ఐదుగురు ఎన్‌సి శాసనభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రస్తుతానికి తాము ప్రభుత్వంలో చేరడం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. శ్రీగనర్‌లోని షేర్ కశ్మీరు ఇంటర్నేషనల్ కన్వెన్షెన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి ఇండియా కూటమి నాయకులు పూర్తి స్థాయిలో హాజరయ్యారు.

కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, వామపక్ష నాయకులు ప్రకాశ్ కారత్, డి రాజా, డిఎంకె ఎంపి కనిమొళి, ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలె తదితరులు హాజరయ్యారు. పడిపి అధినేత్రి మొహబూబా ముఫ్తి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం. ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా, తల్లి మొల్లీ అబ్దుల్లా, ఆయన ఇద్దరు సోదరీమణులు, ఇద్దరు కుమారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జమ్మూ కశ్మీరు పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉన్న 2009 నుంచి 2014 కాలంలో ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో యుటిలోని 90 సీట్లలో 42 స్థానాలలో ఎన్‌సి గెలుపొందగా దాని మిత్రపక్షమైన కాంగ్రెస్ ఆరు స్థానాలను గెలుచుకుంది. మరో ఐదుగురు ఎమ్మెల్యేలను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేయవలసి ఉంది.

ఉప ముఖ్యమంత్రిగా సురేందర్ చౌదరి
జమ్మూలోని నౌషెరా నుంచి గెలుపొందిన నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే సురేందర్ చౌదరిని ఉప ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. జమ్మూ ప్రాంత ప్రజల గొంతుకను వినిపించేందుకే చౌదరిని ఎంపిక చేశానని, తమది సమ్మిళిత ప్రభుత్వమని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరినీ తమతో కలుపుకుని వెళతామని, ఇదే తమ లక్షమని ఆయన చెప్పారు. మంత్రివర్గంలో మరో మూడు ఖాళీలు ఉన్నాయని, వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని ఒమర్ తెలిపారు. పిడిపి మాజీ సభ్యుడైన సురందర్ చౌదరి ఇటీవలి ఎన్నికల్లో బిజెపి జమ్మూ కశ్మీరు అధ్యక్షుడు రవీందర్ రైనాను 7,819 ఓట్ల తేడాతో ఓడించారని ఆయన చెప్పారు.

అదో ముళ్ల కిరీటం: ఫరూఖ్ అబ్దుల్లా
తన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ అదో ముళ్ల కిరీటమని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయనకు అల్లా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో అనేక సవాళ్లు ఉన్నాయని, చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందన్న నమ్మకం ఈ ప్రభుత్వంపై తనకు ఉందని ఆయన చెప్పారు. జమ్మూ కశ్మీరుకు రాష్ట్ర హోదాను సాధించడమే కొత్త ప్రభుత్వ ప్రధాన లక్షమని తన ఒమర్ అబ్దుల్లా కుమారుడు జహీర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా సాధించిన అనంతరం ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తమ అసలైన పోరాటం మొదలవుతుందని ఆయన చెప్పారు.

ఒమర్ అబ్దుల్లాకు పూర్తి సహకారం: ప్రధాని
జమ్మూ కశ్మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లాకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియచేశారు. జమ్మూ కశ్మీరు అభివృద్ధి కోసం కేంద్రం ఆయనకు సంపూర్ణ సహకారాన్ని అందచేస్తుందని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News