ఆఫ్రికా హెల్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిపుణుల అధ్యయనం
జొహన్నెస్‌బర్గ్ : ఒమిక్రాన్ బారిన పడి కోలుకున్నవారిలో డెల్టా వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక సామర్ధం పెరుగుతున్నట్టు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాకుండా డెల్టాతో రీ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.ఇప్పటికే 130 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ తీవ్రతను అంచనా వేసేందుకు ఆఫ్రికా హెల్త్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎహెచ్ఆర్ఐ) నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందుకోసం ఒమిక్రాన్ సోకిన 15 మందిని పరిగణన లోకి తీసుకున్నారు. వీరిలో వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా ఉన్నారు. వీరి నుంచి ప్లాస్మాను సేకరించిన పరిశోధకులు ఒమిక్రాన్ , డెల్టా వేరియంట్‌పై ఈ యాంటీబాడీల పనితీరును విశ్లేషించారు. వీరిలో ఒమిక్రాన్‌ను తటస్థీకరించే సామర్ధం 14 రెట్లు ఉన్నట్టు గుర్తించారు. వీటితోపాటు డెల్టాను తటస్ఠీకరించే సామర్ధం కూడా 4.4 రెట్లు ఎక్కువ ఉందని కనుగొన్నారు. దీని ద్వారా సాధారణ ప్రజలతో పోలిస్తే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టాను ఎదుర్కొనే సామర్ధం అధికంగా ఉన్నట్టు నిరూపితమైందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తులో డెల్టాను తటస్థీకరించే సామర్ధం అధికంగా ఉందంటే , వారిలో రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు తక్కువేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు.