భయం వద్దు
బాధ్యతగా ఉండండి
దీనితో ప్రపంచంలో చనిపోయింది
ఒక్కరే : డిహెచ్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు 9కి చేరాయని, ఈ వేరియంట్ పట్ల ప్రజలు భయాందోళన చెందొద్దని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే చాలని వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని, ఈ వైరస్ వల్ల ఏలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో పాటు వైరస్ సామూహిక వ్యాప్తిలేదని వివరించారు. తాజాగా హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే దవాఖానల్లో వైద్య సేవల నిమిత్తం చేరారని వెల్లడించారు. దేశంలో 11 రాష్ట్రాల్లో 88 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడించారు.
ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు.భవిష్యత్లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కాగా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమని, అయితే కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలు ఇంటా బయటా మాస్కు ధరించి బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారని, రాష్ట్రంలోని 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని మరో 28 లక్షల మందికి రెండో డోస్ వేయాల్సి ఉందన్నారు. ఎయిర్ పోర్టుకు వచ్చి వైరస్ బారిన పడిన 9 కేసుల్లో ఎవ్వరికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రపంచ వ్యాప్తంగా ఒక్క యుకెలో తప్పితే ఎక్కడా ఒమిక్రాన్ వైరస్ మరణాలు సంభవించలేదని స్పష్టం చేశారు.
హన్మకొండలో అప్రమత్తం
తాజాగా హన్మకొండ, హైదరాబాద్ చార్మినార్ ప్రాంతాలలో కొత్త కేసులు నమోదయ్యాయని, ఆయా ప్రాంతాలలోని వైద్యాధికారులను అప్రమత్తం చేశామని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. శంషాబాద్ విమానాశ్రయంలో సేకరించిన నమూనాల్లో 9మందికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. వీరిలో 8 మంది రాష్ట్రంలోకి ప్రవేశించారని, మరో వ్యక్తి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందినవాడన్నారు. ఇప్పటివరకు సామాజిక వ్యాప్తి జరగలేదని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ సోకడానికి వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒక కారణమని,యూకెలో టీకా తీసుకోని వారిలో మాత్రమే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవాలన్నారు. కొద్ది వారాల పాటు ఇంట్లో కూడా మాస్కు ధరించాలని సూచించారు. గాలి, వెలుతురు వచ్చేలా తలుపులు, కిటికీలు తెరుచుకోవాలని హితవు పలికారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అయితే నిర్లక్ష్యంగా మాత్రం ఉండొద్దన్నారు.
వైద్య బృందాల పరీక్షలు
ఒమైక్రాన్ పాజిటివ్‌గా తేలిన తొలి ఇద్దరు వ్యక్తులు (విదేశీయులు) హైదరాబాద్ టోలిచౌకీ, పారామౌంట్ కాలనీ, ఐఏఎస్ కాలనీల్లో తిరిగిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు 25 బృందాలుగా ఏర్పడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో గురువారం నమోదైన 4 కేసుల్లో ఒకరి ఆచూకీ లభ్యం కాలేదు. కెన్యా నుంచి వచ్చిన వ్యక్తి(44)గా గుర్తించారు. వ్యక్తి అడ్రస్‌లో క్లారిటీ లేకపోవడంతో ఆచూకీ దొరకలేదు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో వైద్య సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఒమైక్రాన్ హాట్‌స్పాట్‌గా పారమౌంట్ కాలనీ గుర్తించారు. పారమౌంట్ కాలనీని వైద్య సిబ్బంది జల్లడ పడుతోంది. మెడికల్ టూరిజం ద్వారా ఇతన్ని గుర్తించేందుకు అధికారుల ప్రయత్నిస్తున్నారు. కెన్యా నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళలు, ఒకరు పురుషుడు. వీరు నాలుగు రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు. ర్యాండమ్ టెస్టులో భాగంగా విమానాశ్రయంలో నమూనా తీసుకుని పరీక్షించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. జన్యు విశ్లేషణలో ఒమైక్రాన్ నిర్ధారణ అయింది. ఈ ముగ్గురు నాలుగు రోజుల నుంచి బయట తిరుగుతూ నగరంలోని వేర్వేరు హోటళ్లలో బస చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.