నాలుగైదు రోజులుగా తగ్గుతున్న ప్రయాణికులు
వైరస్ ప్రభావంతో సొంత వాహనాల్లో వెళ్లుతున్న జనం
ఆర్దికభారంతో తలపట్టుకుంటున్న మెట్రో అధికారులు
హైదరాబాద్: మహానగర ప్రజలను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్న మెట్రో మళ్లీ ఒమిక్రాన్ కష్టాలు ఎదుర్కొంటుంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్‌తో ఆర్థిక నష్టాలు చవిచూసి సహాయం కోసం ఎదురుచూస్తుంది. సెకండ్‌వేవ్ తరువాత మెల్లగా కోలుకుని రోజుకు 2.50లక్షల మంది ప్రయాణికుల సంఖ్య చేరుకుంది. ఇటీవలే నగరవాసులకు ఆకట్టుకునేందుకు సువర్ణ ఆఫర్‌ను తీసుకొచ్చి ప్రయాణికులు సంఖ్య పెరుగుతుండగా మళ్లీ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండటంతో ప్రజారవాణాలో వెళ్లేందుకు ప్రజలు మొగ్గు చూపడంలేదు. సొంత వాహానాల్లో తిరుగుతుండటంతో మెట్రో ప్రయాణికులు సంఖ్య గత నాలుగు రోజుల నుంచి తగ్గుముఖం పట్టినట్లు సిబ్బంది వెల్లడిస్తున్నారు. వైరస్ సోకకుండా పలు జాగ్రత్తలు చేపట్టిన ప్రయాణికుల ఆదరణ ఆశించిన స్దాయిలో లేదని చెబుతున్నారు.
ప్రస్తుతం చలి తీవ్రత పెరగడంతో చీకటి పడితే ప్రజలు రోడ్లపైకి రావాలంటే జంకుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వస్తుందని భావిస్తూ తిరగడానికి ఇష్టం పడటంలేదు. మెట్రో రైలు ప్రయాణికుల కోరిక మేరకు గత రెండు నెల నుంచి ఉదయం 6గంటల మొదటి రైలు ప్రారంభమై, రాత్రి 11.15 గంటలకు చివరి రైల్ ఆఖరి స్టేషన్‌కు చేరుకునేలా నడిపిస్తున్నారు. సమయం పొడిగించిన తరువాత రోజుకు 2.50లక్షలు దాటుతుండగా ఒమిక్రాన్ దెబ్బతో మళ్లీ నష్టాల బాధలు ఎదుర్కొంటున్నట్లు మెట్రో అధికారులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఎల్బీనగర్, మియాపూర్ కారిడార్‌లో కార్యాలయాలు, కళాశాలలు నడిచే సమయంలో ప్రయాణికులు ఉన్నట్లు, జెబిఎస్, జూబ్లీ బస్టాండ్ కారిడార్‌లో ఆశించిన విధంగా జనం మొగ్గు చూపడంలేదని, నాగోల్, మాదాపూర్ కారిడార్‌లో ఇప్పటిప్పుడే ఐటీ ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లుతుండటంతో వారంతా మెట్రోను ఆదరిస్తుండగా, వైరస్ ప్రభావంతో ఐటీ సంస్దలు ఇంటి నుంచే విధులు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుండటంతో మెట్రోకు ఆర్ధికభారం మోయలేనంత అవుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు ఆదరించేందుకు కొత్త ప్రయత్నాలు చేసేందుకు మెట్రో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.