జెనీవా : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏమేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చిత నెలకొందని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్‌తో కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అయితే ఈరోజు వరకు ఈ కొత్త వేరియంట్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదని ఆరోగ్యసంస్థ వెల్లడించింది. గతవారం దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగు చూసిన తరువాత వేరియంట్ లోని అసాధారణ మ్యుటేషన్లపై ఆందోళన వ్యక్తం చేసింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు వెలుగు చూసిన ఆల్ఫా, బీటా, గామా, వేరియంట్లకంటే ప్రమాదకరమైన జాబితా లోకి ఈ వేరియంట్‌ను చేర్చింది.
ఒమిక్రాన్ తీవ్రత పై ఇంకా స్పష్టత లేదు
డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా? లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా ? అనే విషయాలపై ఇంకా స్పష్టంగా తెలియదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) ప్రకటించింది. ఈ వేరియంట్ వల్ల ఎలాంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే దానిపై కూడా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. దక్షిణాఫ్రికా సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్‌పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని వెల్లడించింది. వివరాలు అందుబాటు లోకి వస్తున్న కొద్దీ వాటిని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తామని తెలిపింది. దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ వెలుగు లోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిందని, అయితే అవి ఒమిక్రాన్ వల్లేనని ఇంకా నిర్ధారణ కాలేదని దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది.
దక్షిణాఫ్రికా ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోందని, ఇది కొత్త వేరియంట్ వల్లేనని చెప్పడానికి నిర్ధిష్ట ఆదారాలు లేవని పేర్కొంది. మరోవైపు వ్యాక్సిన్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం ఇంకా కొనసాగుతున్న ఫలితమే ఒమిక్రాన్ అని డబ్లుహెచ్‌ఒ డైరెక్టర్ జనరల్ బెడ్రెస్ అథనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ల పంపిణీలో సమానత్వం లోపిస్తున్న కొద్దీ వైరస్ మరిన్ని పరివర్తనాలకు లోనవుతుందని తద్వారా మరింత ముప్పు తెచ్చి పెడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు, ఆరోగ్య సంరక్షకులు సహా ఇతర కరోనా యోధులకు తొలుత వ్యాక్సిన్ అందించాల్సిన అవసరం ఉందన్నారు.