న్యూయార్క్ : ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వ్యాప్తి ఇంకా తీవ్ర స్థాయిలోనే ఉందని, స్వల్ప విరామం తరువాత వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది. ముఖ్యంగా కరోనా నిబంధనలు తొలగించిన ప్రాంతాల్లో వైరస్ తిరగబడుతోందని హెచ్చరించింది. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధ్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో డబ్లుహెచ్‌ఒ ఎపిడెమిలాజిస్ట్ మరియా వాన్ ఖెర్ఖోవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని వారాల పాటు తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మళ్లీ పెరుగుతున్నాయి. పరీక్షల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ కేసులు పెరుగుతున్నాయి అని మరియా ట్విటర్ వేదికగా వెల్లడించారు. డబ్లుహెచ్‌ఒ గణాంకాల ప్రకారం మార్చి 7 13 మధ్య ప్రపంచ వ్యాప్తంగా కొత్త కేసులు 8 శాతం పెరిగాయి. అత్యధికంగా దక్షిణ కొరియా , వియత్నా, జర్మనీ దేశాల్లో ఈ పెరుగుదల కన్పించింది. వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉందని చెప్పి కొన్ని ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు ఎత్తి వేశారు.
దీంతో ఆయా ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయని మరియా వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ల వల్ల వ్యాధి తీవ్రత , ప్రాణాపాయ ముప్పు తగ్గుతుందే తప్ప వైరస్ వ్యాప్తి తగ్గబోదని ఆమె అన్నారు. “కరోనా సవాళ్లను ఎదుర్కోవడంలో దేశాలను బట్టి భిన్నమైన పరిస్థితులు ఉండొచ్చు. కానీ మహమ్మారి మాత్రం ఇంకా అంతం కాలేదు. దీనిపై మనమంతా అప్రమత్తంగా ఉండాలి. టెస్టులు, జీనోమ్ సీక్వెన్సింగ్‌లు, వ్యాక్సినేషన్‌ను మరింత పెంచాలి. మన ఆరోగ్య కార్యకర్తలను సంరక్షించుకోవాలి. మహమ్మారి అంతం మనచేతుల్లోనే ఉంది.” అని మరియా చెప్పుకొచ్చారు.